కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ధర్మపురి సంజయ్
సాక్షి, హైదరాబాద్: చాలాకాలం తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరగనున్నాయి. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్, నిజామాబాద్ మాజీ మేయర్, ఎంపీ డీఎస్ తనయుడు ధర్మపురి సంజయ్, భూపాలపల్లి జిల్లా బీజేపీ నేత గండ్ర సత్యనారాయణలు త్వరలోనే కాంగ్రెస్‌లో చేరనున్నారు. మంగళవారం ఉదయం ఈ ముగ్గురు నేతలు టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ తాము త్వరలోనే కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు.
కొండాతో రేవంత్ ఏకాంత చర్చలు
రేవంత్‌రెడ్డి మంగళవారం చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో భేటీ అయ్యారు. కొండా నివాసానికి వెళ్లిన రేవంత్ ఏకాంతంగా సమావేశమయ్యారు. అనంతరం ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. కొండా రాజీనామా చేసింది కాంగ్రెస్ పార్టీకేనని, పార్టీ సిద్ధాంతాలకు కాదని రేవంత్ వ్యాఖ్యానించారు. ఆయన ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలోకి రావొచ్చునన్నారు. విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ రేవంత్ పీసీసీ అధ్యక్షుడు కావాలని అటు పార్టీలో, ఇటు బయట చాలా కొట్లాడానని చెప్పారు. ఆయన పీసీసీ అధ్యక్షుడు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే నిరుద్యోగ దీక్షలో పాల్గొంటానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరతాననేది త్వరలోనే చెబుతానని కొండా అన్నారు.
కాంగ్రెస్‌లో అందరికీ న్యాయం: రేవంత్
కాంగ్రెస్ పార్టీలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందని రేవంత్‌రెడ్డి చెప్పారు. మంగళవారం ఉదయం తన నివాసంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మున్నూరుకాపు, ముదిరాజ్, వెలమ సామాజిక వర్గాలకు చెందిన ముగ్గురు నేతలు తమ పార్టీలోకి రావడం సంతోషదాయకమన్నారు. ఇతర పార్టీల నేతలు చాలామంది టచ్‌లోకి వస్తున్నారని చెప్పారు. రెండు, మూడు రోజుల్లో పార్టీ అధికార ప్రతినిధులను నియమిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment