Dharmapuri Sanjay
-
మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఇంటిపై దాడి
-
కాంగ్రెస్ నేత ధర్మపురి సంజయ్ ఇంటిపై దాడి కలకలం..
సాక్షి, నిజామాబాద్: డీఎస్ కొడుకు, నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఇంటిపై దాడి జరిగింది. ఇద్దరు వ్యక్తులు సంజయ్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. మంగళవారం ఉదయం రెక్కీ నిర్వహించిన ఇద్దరు అగంతకులు.. స్కార్పియో వాహనంతో ఇంటి గేట్లను ధ్వంసం చేసి లోపలికి చొరబడేందుకు యత్నం చేశారు. సుమారు 20 నిమిషాలపాటు సంజయ్ ఇంటి వద్ద హంగామా సృష్టించారు. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది దుండగులును అడ్డుకున్నారు. దీనిపై సంజయ్ అనుచరులు పోలీసులకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దాడికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఉద్దేశపూర్వకంగా సంజయ్ ఇంటిపై దాడి చేశారా? దీని వెనుక ఎవరైనా ఉన్నారా? అనే పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. కాగా మాజీ మేయర్ సంజయ్ తన తండ్రి శ్రీనివాస్‌తో పాటు ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. అయితే మరుసటి రోజే తను కాంగ్రెస్‌లో చేరలేదని, కేవలం కొడుకును పార్టీలో చేర్పించినట్లు డీఎస్ చెప్పారు. దీనికితోడు కొంత కాలంగా డీఎస్ తనయులు అరవింద్, సంజయ్‌ల మధ్య రాజకీయ వైరం నడుస్తోంది. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి పై దాడికి వెళ్లడం కలకలం సృష్టించింది. -
డీఎస్ పక్కా ప్లాన్! టికెట్ కన్ఫామ్ అయ్యాకే పార్టీ మార్పు.. సంజయ్ పోటీ అక్కడినుంచేనా?
ధర్మపురి శ్రీనివాస్ కుమారుడు ధర్మపురి సంజయ్ కాంగ్రెస్‌లో చేరికతో నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ పార్టీలో వార్ మొదలైందా? అర్బన్ సీటు సంజయ్‌కు కన్ఫామ్ అయిందా? మరి నిజామాబాద్ అర్బన్‌పై ఆశలు పెట్టుకున్నవారు ఏం చేయాలి? పార్టీలో మొదలైన మాటల యుద్ధాన్ని ఎవరు చల్లార్చుతారు? సంజయ్ వల్ల కాంగ్రెస్‌కు లాభమా? నష్టమా? వాచ్ దిస్ స్టోరీ.. పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించిన పీసీసీ మాజీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ తన పెద్ద కుమారుడు సంజయ్‌ను ఎట్టకేలకు కాంగ్రెస్ గూటికి చేర్చారు. సంజయ్ గాంధీభవన్‌లో అడుగుపెట్టడానికి వీల్లేదంటూ ఎంతమంది అడ్డుకున్నా ఈ విషయంలో డీఎస్ సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్‌లో తనకున్న పట్టు.. తన రాజకీయ అనుభవం ఏంటో పార్టీలోని ప్రత్యర్థులకు చూపించారు. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో కొడుకు సంజయ్‌తో కలిసి కాంగ్రెస్‌లో చేరి 24 గంటలు తిరక్కుండానే డీఎస్ పీచేముడ్ అనడంతో ఒక్కసారిగా ధర్మపురి ఫ్యామిలీ పాలిటిక్స్ బట్టబయలయ్యాయి. డీఎస్ ఫ్యామిలీ పొలిటికల్ ఎపిసోడ్ పక్కనపెట్టి.. నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ రాజకీయాలు పరిశీలిస్తే సరికొత్త వార్‌కు తెరతీసినట్లయింది. డీఎస్ పక్కా ప్లాన్ తోనే తన కొడుకు సంజయ్ కు టిక్కెట్ కన్ఫర్మ్ చేసుకునే తిరిగి కాంగ్రెస్ గూటికి చేర్చారన్న చర్చ ఊపందుకుంది. నిజామాబాద్ అర్బన్‌లో మున్నూరు కాపుల బలమెక్కువగా ఉండటం డీఎస్ కుమారుడికి కలిసొచ్చే అంశం. ఇప్పటికి రెండుసార్లు ఇక్కడి నుంచి అసెంబ్లీకి ఎన్నికైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే బిగాల గణేష్ వైశ్య సామాజిక వర్గానికి చెందినవారు. అయితే ఆయనకు పార్టీలోను, ప్రజల్లోనూ వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో.. ఈసారి మున్నూరు కాపు బిడ్డను గెలిపించుకోవాలనే గట్టి పట్టుదలతో ఆ సామాజికవర్గీయులంతా ఉన్నట్టుగా చర్చ నడుస్తోంది. చదవండి: ఎంపీ అర్వింద్‌కు కొత్త టెన్షన్.. నిజామాబాద్‌లో రసవత్తర రాజకీయం! మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన నేతగా.. తనకూ, తన తండ్రికి తమ వర్గంలో ఉన్న పలుకుబడిని ఉపయోగించుకుని ఈసారి నిజామాబాద్ అర్బన్‌లో కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించాలన్నది సంజయ్ యోచనగా ఉంది. దానికి కాంగ్రెస్ అధిష్ఠానం కూడా సై అన్నట్టుగా ఇప్పటికైతే ఓ ప్రచారం ఊపందుకుంది. కానీ సంజయ్ మాత్రం ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా.. తన గ్రౌండ్ వర్కంతా చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. సంజయ్ రాకను ఆది నుంచీ స్థానిక కాంగ్రెస్ నేతలు కొందరు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. తమ అభ్యంతరాలను ఏఐసీసీకి కూడా నివేదించారు. సీనియర్ నేత, పార్టీకి ఎంతో సేవ చేసిన డీఎస్ వస్తే పర్లేదు గానీ.. సంజయ్ అవసరమా అన్నట్టుగా బాహాటంగానే వ్యతిరేకిస్తూ వచ్చారు. సంజయ్ రాకను అడ్డుకునేందుకు అంతర్గతంగా పావులు కదిపారు. కానీ డీఎస్ తన పంతం నెగ్గించుకుని కొడుకు సంజయ్‌ను తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేర్పించారు. చదవండి: కొడవళ్ళకు గులాబీ చిక్కడం లేదా? లెఫ్ట్ పార్టీల వన్ సైడ్ లవ్ ఇంకా ఎన్నాళ్ళు..? దీంతో ఇంతకాలం నిజామాబాద్ అర్బన్‌పై ఆశలు పెట్టుకున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పరిస్థితేంటన్న చర్చ కాంగ్రెస్‌లో మొదలైంది. సంజయ్‌కు టిక్కెట్ కన్ఫామ్ అయిందంటూ సాగుతున్న ప్రచారాన్ని మహేష్ గౌడ్ కొట్టిపారేస్తున్నారు. టిక్కెట్ ఖరారైందంటూ ఇప్పట్నుంచే ఎవరైనా చెప్పుకుంటే అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానంటూ.. పరోక్షంగా సంజయ్ కు చురకలంటించే యత్నం చేశారు. తన తమ్ముడు, బీజేపీ ఎంపీ అరవింద్‌తో కొనసాగుతున్న పొల్టికల్ వార్‌లో భాగంగా.. అవసరమైతే అరవింద్ పైనే పోటీకి దిగుతానంటూ కూడా సంజయ్ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు పార్టీలోని సంజయ్ ప్రత్యర్థులు దాన్ని కూడా అడ్వంటేజ్‌గా మార్చుకుంటున్నారు. ఆర్మూర్ అసెంబ్లీ స్థానం నుంచి అరవింద్ పోటీ చేస్తాడన్న ప్రచారం జరుగుతుండటంతో.. సంజయ్‌ను అక్కడే తన తమ్ముడిపై బరిలో దింపాలని కూడా అధిష్ఠానం ముందు తమ సూచనలు ఉంచినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఓ వైపు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వర్గం...మరోవైపు సంజయ్ వర్గం కాంగ్రెస్ బరిలో గిరిగీసి కొట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రత్యర్థి పార్టీలతో కాకుండా..పార్టీలోని ప్రత్యర్థులతోనే ఎవరికి వారు పోరాడాల్సిన పరిస్థితి ప్రస్తుతం నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్‌లో కొనసాగుతోంది. మొత్తం మీద నిజామాబాద్ అర్బన్‌లో ఒకవైపు డీఎస్ ఫ్యామిలీలో అంతర్గత యుద్ధం..మరో వైపు హస్తం పార్టీలో టిక్కెట్ పోరు అక్కడి కేడర్‌లో ఉత్కంఠను రేపుతోంది. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి వెబ్‌డెస్క్ -
డీఎస్ ఇంట్లో రాజకీయ రచ్చ.. అన్న ఆరోపణలపై స్పందించిన అరవింద్..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌లో డీఎస్ చేరిక వ్యవహారంపై ఆయన చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తన తండ్రి మైల్డ్ పెరాలసిస్‌తో పాటు, చెప్పింది మర్చిపోయే డిమెన్షియాతో బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ సమయంలో ఆయనను గాంధీభవన్‌కు తీసుకెళ్లి పార్టీ కండువా కప్పడం సబబు కాదన్నారు. ' మా నాన్న మైండ్ స్ట్రోక్ వచ్చి బాధపడితే కనీసం సోనియా గాంధీ గానీ ఇంకెవరు గానీ పలకరించినవాళ్లు లేరు. నా తండ్రి కట్టర్ కాంగ్రెస్ వ్యక్తి అని నేనే పలుమార్లు చెప్పాను. ఆయన కాంగ్రెస్‌లోకి వెళ్లినా, కమ్యూనిస్టు పార్టీలోకి వెళ్లినా నాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ, ఇది సమయం కాదు.. జాయిన్ చేసుకునే పద్ధతి ఇది కాదు. సోనియానో , ఇంకెవరైనా ఆ స్థాయి వాళ్లో ఆయన ఇంటికే వెళ్లి కండువా కప్పితే భావ్యం తప్ప ఇది పద్ధతి కాదన్నదే నా ఉద్దేశం' అని అరవింద్ అన్నారు. కాగా.. డీఎస్, ఆయన పెద్ద కుమారుడు సంజయ్ ఆదివారం గాంధీభవన్ వెళ్లి కాంగ్రెస్‌లో చేరారు. కానీ ఒక్కరోజుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పార్టీ అధిష్టానానికి లేఖ రాశారు. తాను పార్టీలో చేరలేదని, కానీ చేరినట్లు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అయితే ఈ లేఖను తన తమ్ముడు అరివింద్ బ్లాక్మెయిల్ చేసి రాయించాడని సంజయ్ ఆరోపించారు. తన తండ్రి అనారోగ్యంపై అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారం అన్నాదమ్ముల మధ్య పొలిటికల్ హీట్ పెంచింది. సంజయ్ ఆరోపణల నేపథ్యంలోనే అరవింద్ సోషల్ మీడియా వేదికగా స్పందించి వివరణ ఇచ్చారు. చదవండి: కాంగ్రెస్‌లో చేరిక పంచాయితీ.. డీఎస్ తనయుల వార్! తండ్రిని బ్లాక్ మెయిల్ చేశారా? -
కాంగ్రెస్‌లో చేరిక పంచాయితీ.. డీఎస్ తనయుల వార్! తండ్రిని బ్లాక్ మెయిల్ చేశారా?
డీ శ్రీనివాస్ ఆరోగ్యంపై ఆందోళనగా ఉందని ఆయన కుమారుడు ధర్మపురి సంజయ్ తెలిపారు. తన తండ్రికి ఫిట్స్ వస్తే ఇంట్లోనే ఎందుకు ఉంచారని ప్రశ్నించారు. తన తమ్ముడు ధర్మపురి అరవిందే తండ్రిని బ్లాక్మెయిల్ చేసి లేఖలు రాయిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అరవింద్ దిగజారి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి చుట్టూ ఉన్నవాళ్లపై తనకు అనుమానం ఉందని సంజయ్ చెప్పారు. డీఎస్ రాజీనామా లేఖలు బీజేపీ చేస్తున్న డర్టీ పాలిటిక్స్ అని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే అరవింద్‌పై పోటీ చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. డీఎస్, ఆయన కుమారుడు సంజయ్ ఆదివారమే కాంగ్రెస్ గూటికి తిరిగివెళ్లారు. అయితే 24 గంటల్లోనే ఆ పార్టీకి రాజీనామా చేస్తునట్లు డీఎస్ ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆయన లేఖ రాశారు. డీఎస్ లేఖ రాస్తున్న వీడియోను కూడా విడుదల చేశారు. రాజీనామా లేఖను ఆయన సతీమణి విజయలక్ష్మి మీడియాకు విడుదల చేశారు. డీఎస్ ఆరోగ్యం సహకరించట్లేదని, కాంగ్రెస్ వాళ్లు తమ ఇంటి వైపు రావొద్దని డీఎస్ భార్య విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో సోదరుడు అరవింద్‌పై సంజయ్ తీవ్ర ఆరోపణలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. డీఎస్ రాజీనామానా వ్యవహారం కాస్తా ఆయన కుమారుల పంచాయితీగా మారింది. అన్న సంజయ్ ఆరోపణలపై తమ్ముడు అరవింద్ ఇంకా స్పందించాల్సి ఉంది. మరోవైపు తన కుమారుడు సంజయ్ కాంగ్రెస్‌లోకి తిరిగి చేరిన సందర్బంగానే గాంధీభవన్ వెళ్లానని, కానీ తానూ పార్టీలో చేరినట్లు ప్రచారం చేశారని డీఎస్ లేఖలో పేర్కొన్నారు. ఒకవేళ తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు భావిస్తే ఈ లేఖను రాజీనామాగా భావించి ఆమోదించాలని కోరుతున్నట్లు తెలిపారు. చదవండి: చేరికల చిచ్చు.. ఒక్క రోజుకే కాంగ్రెస్‌కు డీఎస్ రాజీనామా.. అసలేమైంది? -
కవిత ఎంట్రీ.. డైలమాలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్!
నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ డైలమాలో పడ్డారా? తొలిసారి ఎంపీగా గెలిచిన ఆనందం కొనసాగుతుందా? ఇంతటితో ఆగిపోతుందా? ఇంతకీ ఆయన టెన్షన్‌కు కారణం ఏంటి? అసలు ఇందూరు రాజకీయాల్లో ఏం జరుగుతోంది? రాబోయే ఎన్నికల నాటికి పరిణామాలు ఎలా మారబోతున్నాయి? ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా, మాజీ మంత్రిగా కాంగ్రెస్ పార్టీలో ఓ స్థాయిలో చక్రం తిప్పిన తండ్రి అండదండలు ఓపక్క.. ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవితనే ఓడించిన ఆత్మవిశ్వాసం మరోపక్క.. నిజామాబాద్ ఎంపీ అరవింద్‌కు మంచి ఇమేజ్ తెచ్చి పెట్టాయి. అయితే కొంత కాలం స్తబ్దుగా ఉన్న కల్వకుంట్ల కవిత మళ్లీ ఇందూర్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో... ధర్మపురి అరవింద్ లో డైలామా మొదలైంది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎక్కువ శాతం అధికార టీఆర్ఎస్ పార్టీ వారే కాబట్టి... వారి అండదండలతో కవిత ఎమ్మెల్సీగా మళ్లీ నిజామాబాద్ రాజకీయాల్లో అడుగు పెట్టారు. దీంతో బీజేపి మళ్లీ ఆమెపై ముప్పేట దాడిని మొదలెట్టినా... కవిత మాత్రం ఇందూరు చుట్టే తన రాజకీయ జీవితాన్ని తిప్పుతుండటంతో... ఎంపీ అరవింద్‌లో ఒకింత టెన్షన్ మొదలైందా అన్న చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న ఎంపీలందరినీ.. ఎమ్మెల్యేలుగా బరిలోకి దింపాలన్న యోచనలో బీజేపి అధిష్ఠానం ఉన్నట్టుగా రాష్ట్ర పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో అరవింద్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి బరిలోకి దిగుతారన్న ప్రచారం మొదలైంది. అందుకు తగ్గట్టే ఆయన పెర్కిట్ లో ఇల్లు కూడా తీసుకుని...అక్కడి నుంచి కార్యకలాపాలు మొదలెట్టడం కూడా ఆ ప్రచారం నిజమే అనిపిస్తోంది. ఎన్ని ఆరోపణలున్నా.. కొంచెం గట్టి పిండమైన జీవన్ రెడ్డి... వాటన్నింటినీ చూసీచూడనట్టుగానే పోతూ... ఇంకోవైపు అరవింద్నూ అంతకంతకూ కౌంటర్ చేస్తుండటంతో... అరవింద్ ఇప్పుడు ఆర్మూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగడమా? వద్దా అన్న మీమాంసలో పడ్డట్టుగా తెలుస్తోంది. ఫ్యూచర్ పాలిటిక్స్‌కు చిక్కు అరవింద్ మీమాంసను మరింత బలపర్చేలా... రానున్న ఎన్నికల్లో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నదానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఒక వేళ పార్లమెంట్‌కు మళ్లీ ఎన్నిక కావాలనుకుంటే నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి లేదా అసెంబ్లీకి వెళ్లాలనుకుంటే ఆర్మూర్ శాసనసభ స్థానం నుంచి పోటీ చేస్తారంటూ ఇప్పటివరకు ఊహాగానాలు కొనసాగాయి. వచ్చే ఎన్నికల్లో కవిత నిజామాబాద్ నుంచి లోక్‌సభ సీటుకు పోటీ చేస్తే గనుక.. తనకు గత పార్లమెంట్ ఎన్నికల్లో దక్కిన ఆదరణ మళ్లీ దక్కుతుందో.. లేదోనన్న సందేహాలే ఇప్పుడు అరవింద్ ఫ్యూచర్ పాలిటిక్స్ కు చిక్కుగా మారాయి. అదే సమయంలో నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గంపైన కూడా అరవింద్ ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో క్యాడర్లో అస్పష్టత... అరవింద్ బరిలోకి దిగుతాడని ప్రచారం జరుగుతున్న నియోజకవర్గాల్లో టిక్కెట్లు ఆశించే ఆశావహుల్లో నిస్తేజానికీ ఈ డైలమా కారణమవుతోందన్నది ఇప్పుడు ఇందూరు రాజకీయాల్లో జరుగుతున్న చర్చ. బరిలోకి అన్న సంజయ్ నిజామాబాద్ అర్బన్ నుంచి డీఎస్ తన పెద్దకుమారుడు సంజయ్‌ను బరిలోకి దించాలని యోచిస్తున్న క్రమంలో... అక్కడి నుంచి అన్నకు పోటీగా దిగే పరిస్థితి అరవింద్ కు ఉండదు. పైగా తనకు ప్రధాన అనుచరుడైన ధన్ పాల్ సూర్యనారాయణ అక్కడి నుంచి టిక్కెట్ ఆశిస్తున్నాడు. ఇక గతంలో ఎమ్మెల్యేగా చేసిన ఎండల లక్ష్మీనారాయణ నుంచి అంత సహకారం అందే పరిస్థితి లేదు. ఇక రూరల్ నియోజకవర్గంలో నిల్చోవడమంటే... ఎదురుగా ఉన్నది బాజిరెడ్డి గోవర్ధన్. తన తండ్రికి ఇందూర్ పాలిటిక్స్ లో ఎంత పట్టుందో... జిల్లాలోని బాన్సువాడ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ వంటి నియోజకవర్గాల నుంచి గెల్చిన చరిత్ర బాజిరెడ్డికుంది. ఈ క్రమంలో ఆయన్ను తట్టుకోవడమూ అంత వీజీ కాదు. ఇక బాల్కొండలో ఇప్పటికైతే మంత్రి ప్రశాంత్ రెడ్డి హవా స్పష్టంగా కనిపిస్తున్న క్రమంలో... అరవింద్ అక్కడి నుంచి బరిలో ఉంటాడా అన్నదీ మళ్లీ డౌటే. అయితే ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి కూడా బీజేపి నుంచి బరిలో ఉండటానికి ఉత్సాహం చూపిస్తున్నా... అరవిందే అడ్డుపడుతున్నాడన్న ఒకింత ప్రచారమూ... ఆయన బాల్కొండపై కన్నేశాడా అనే అనుమానాలకు బలమిస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికలనాటికి.... అరవింద్ నియోజకవర్గ దారేది...? అన్న చర్చ జిల్లాలో జరుగుతోంది. చదవండి: బీజేపీ ఎమ్మెల్యేకు ఝలక్ ఇచ్చిన గోమాత! -
రాజకీయ జీవితంపై ధర్మపురి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు
నిజామాబాద్ అర్బన్: తన రాజకీయ జీవితంపై రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నేను ఏ పార్టీలో ఉన్నానో నాకే తెలియదు. కేసీఆర్‌నే అడగండి’ అని డీఎస్ పేర్కొన్నారు. నిజామాబాద్‌లో శుక్రవారం తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. తన కుమారుడు, మాజీ మేయర్ సంజయ్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలవడం ఆయన ఇష్టమన్నారు. మరో కుమారుడు అర్వింద్ బీజేపీలో చేరి ఎంపీగా గెలిచాడన్నారు. -
కాంగ్రెస్‌లో చేరనున్న నేతలు
సాక్షి, హైదరాబాద్: చాలాకాలం తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరగనున్నాయి. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్, నిజామాబాద్ మాజీ మేయర్, ఎంపీ డీఎస్ తనయుడు ధర్మపురి సంజయ్, భూపాలపల్లి జిల్లా బీజేపీ నేత గండ్ర సత్యనారాయణలు త్వరలోనే కాంగ్రెస్‌లో చేరనున్నారు. మంగళవారం ఉదయం ఈ ముగ్గురు నేతలు టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ తాము త్వరలోనే కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. కొండాతో రేవంత్ ఏకాంత చర్చలు రేవంత్‌రెడ్డి మంగళవారం చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో భేటీ అయ్యారు. కొండా నివాసానికి వెళ్లిన రేవంత్ ఏకాంతంగా సమావేశమయ్యారు. అనంతరం ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. కొండా రాజీనామా చేసింది కాంగ్రెస్ పార్టీకేనని, పార్టీ సిద్ధాంతాలకు కాదని రేవంత్ వ్యాఖ్యానించారు. ఆయన ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలోకి రావొచ్చునన్నారు. విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ రేవంత్ పీసీసీ అధ్యక్షుడు కావాలని అటు పార్టీలో, ఇటు బయట చాలా కొట్లాడానని చెప్పారు. ఆయన పీసీసీ అధ్యక్షుడు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే నిరుద్యోగ దీక్షలో పాల్గొంటానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరతాననేది త్వరలోనే చెబుతానని కొండా అన్నారు. కాంగ్రెస్‌లో అందరికీ న్యాయం: రేవంత్ కాంగ్రెస్ పార్టీలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందని రేవంత్‌రెడ్డి చెప్పారు. మంగళవారం ఉదయం తన నివాసంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మున్నూరుకాపు, ముదిరాజ్, వెలమ సామాజిక వర్గాలకు చెందిన ముగ్గురు నేతలు తమ పార్టీలోకి రావడం సంతోషదాయకమన్నారు. ఇతర పార్టీల నేతలు చాలామంది టచ్‌లోకి వస్తున్నారని చెప్పారు. రెండు, మూడు రోజుల్లో పార్టీ అధికార ప్రతినిధులను నియమిస్తామని తెలిపారు. -
త్వరలోనే కాంగ్రెస్‌లో చేరతా: ధర్మపురి సంజయ్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌లో పుట్టి పెరిగా.. మా నాన్న కోసమే మధ్యలో టీఆర్ఎస్లో చేరాను అన్నారు డి.శ్రీనివాస్ తనయుడు, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపర్చడం కోసం తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సంజయ్ స్పష్టం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో మహబూబ్‌నగర్ బీజేపీ అధ్యక్షుడు ఎర్ర శేఖర్. ధర్మపురి సంజయ్‌లు మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ధర్మపురి సంజయ్ మాట్లాడుతూ.. ‘‘రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయినందుకు మనస్ఫూర్తిగా అభినందించాను. త్వరలోనే ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతా.. పార్టీకి పూర్వ వైభవం వస్తుంది. కాంగ్రెస్‌లో పుట్టి పెరిగిన నేను మా నాన్న కోసమే టీఆర్ఎస్లో చేరాను. గులాబీ కండువా ఒక గొడ్డలి లాంటిది. టీఆర్ఎస్ రాజకీయ పార్టీ కాదు.. జిల్లా ప్రెసిడెంట్‌కు గుర్తింపు లేదు’’ అన్నారు. కాంగ్రెస్‌లోకి ఎర్ర శేఖర్, గండ్ర సత్య నారాయణ బీజేపీ మహబూబ్ నగర్ అధ్యక్షుడు ఎర్ర శేఖర్ పార్టీ సభ్యత్వానికి, జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే కాంగ్రెస్ లో చేరుతానని ఆయన ప్రకటించారు. మంచిరోజు చూసుకొని నియోజకవర్గంలో సభ ఏర్పాటు చేస్తానని ఎర్రశేఖర్ తెలిపారు. ఎర్రశేఖర్‌తో పాటు మాజీ టీడీపీ నేత గండ్ర సత్యనారాయణ కూడా కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. -
రైతులను దగా చేశారు..వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: ఓట్ల కోసం రైతులను నమ్మించి దగా చేశారంటూ నిజామాబాద్ ఎంపీ డి.అరవింద్‌పై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. గెలిచిన వెంటనే పసుపు బోర్డు తెస్తానన్న హామీతో బాండ్ పేపరు కూడా రాసిచ్చి, ఆ తర్వాత రైతులను మోసం చేశారని మండిపడ్డారు. శుక్రవారం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని తన కార్యాలయంలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన వైఎస్సార్ అభిమానులు, సానుభూతిపరులతో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పసుపు ఉత్పత్తిలో నిజామాబాద్ దేశంలోనే నంబర్ వన్ అని, ప్రతి గడపకు పూసే పసుపు, అందరి నోటిని తీపి చేసే చెరుకు పండించే ప్రాంతం నిజామాబాద్ అని పేర్కొన్నారు. అలాంటి ప్రాంతంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ కశ్మీర్ అయిన ఆదిలాబాద్ జిల్లా.. పచ్చటి అడవులు, కుంటాల జలపాతంతో పర్యాటకులను ఆకట్టుకుంటోందని చెప్పారు. కానీ జలియన్‌వాలా బాగ్ని తలపించే ఇంద్రవెల్లి ఘటన ఇంకా మనసులను రగిలిస్తూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. భైంసా మతకల్లోలకు కారణం ఎవరని ప్రశ్నించారు. ప్రాజెక్ట్‌ల రీడిజైన్ పేరుతో ప్రస్తుత పాలకులు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు అన్యాయం చేస్తున్నారన్నారు. ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టు తలమానికం ఆదిలాబాద్‌కు ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్ట్ తలమానికమని షర్మిల అన్నారు. వైఎస్సార్ హయాంలో మేజర్ ప్రాజెక్టులు పూర్తి చేశారని, ప్రస్తుతం ప్రాజెక్ట్ పనులు మందకొడిగా సాగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాజన్న సంక్షేమం కోసం నిలబడతానని స్పష్టం చేశారు. అందుకు అందరి సలహాలు, సూచనలు కావాలని కోరారు. షర్మిలకు మద్దతుగా 10 మంది సర్పంచ్‌లు వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెజ్జింకి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఉభయ ఉమ్మడి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వైఎస్సార్ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. ఈ సందర్భంగా నాగోబా వంశీయులు, గోండు జాతి ఆదివాసీలు షర్మిలకు మద్దతు పలికారు. తెలంగాణ బిడ్డ షర్మిలమ్మ నాయకత్వంలో పని చేయడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. నాగోబా ఆలయ కమిటీ చైర్మన్‌తో పాటు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 10 మంది సర్పంచ్‌లు వైఎస్ షర్మిలకు మద్దతు తెలిపారు. -
సంజయ్ బెయిల్‌పై విడుదల
నిజామాబాద్: రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ కుమారుడు, నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్ శుక్రవారం బెయిల్‌పై విడుదల అయ్యారు. నర్సింగ్ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో సంజయ్‌పై ఈ నెల 12న పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెల్సిందే. అప్పటి నుంచి సంజయ్ 20 రోజుల పాటు సారంగపూర్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. నిన్న(గురువారం) ఎస్సీ ఎస్టీ కోర్టు సంజయ్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి గురువారం, శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో హాజరు కావాలని ఆదేశించింది. -
డీఎస్ తనయుడికి ఊరట
సాక్షి, నిజామాబాద్ : నర్సింగ్ విద్యార్థినిలపై లైంగిక వేధింపుల కేసులో సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ తనయుడు ధర్మపురి సంజయ్‌కి ఊరట లభించింది. గురువారం జిల్లా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 18రోజుల పాటు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన రేపు జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రతి గురువారం, సోమవారం పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. లైంగిక వేధింపుల కేసులో సంజయ్‌ని అరెస్ట్ చేసి పోలీసు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తన కుమారుడిని ఏపీ పోలీస్ మాన్యువల్ ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్ చేశారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఐదు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు పోలీసు మాన్యువల్ తయారు చేయలేదని ఆయన పేర్కొన్న సంగతి విదితమే. అయితే తర్వాత ఈ పిటిషన్‌ను ఆయన ఉపసంహరించుకున్నారు. -
సంజయ్ కేసు.. హైకోర్టులో డీఎస్ పిటిషన్
హైదరాబాద్: నర్సింగ్ విద్యార్థినిలపై లైంగిక వేధింపుల కేసులో తన కుమారుడు సంజయ్‌ని అరెస్ట్ చేసి పోలీసు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన కుమారుడిని ఏపీ పోలీస్ మాన్యువల్ ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్ చేశారు..తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఐదు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు పోలీసు మాన్యువల్ తయారు చేయలేదని పేర్కొన్నారు. నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్‌పై పెట్టిన కేసులు చెల్లవని హైకోర్టులో డీఎస్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. -
ధర్మపురి సంజయ్ అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు!
నిజమాబాద్ నర్సింగ్ విద్యార్థినులను లైంగికంగా వేధించిన కేసులో ధర్మపురి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం విచారణకు హాజరైన అనంతరం సంజయ్‌ను పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. ఆయనను సుదీర్ఘంగా మూడు గంటల పాటు విచారించారు. మధ్యలో ఓసారి బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత మరోసారి విచారించారు. అనంతరం అతనిని అరెస్టు చేశారు. ఆ తర్వాత అతనిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆదివారం కావడంతో ఆయనను న్యాయమూర్తి ముందు హాజరుపరిచి అనంతరం రిమాండుకు తరలించనున్నారు. విద్యార్థినుల ఫిర్యాదుతో ధర్మపురి సంజయ్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. సంజయ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ శాంకరీ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు ఆరోపించారు. ఈ కేసులో 41- సీఆర్పీసీ ప్రకారం పోలీసులు సంజయ్‌కు నోటీసులు జారీచేశారు. ఈ కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీసులు ఈ నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో అజ్ఞాతంలోకి వెళ్లిన సంజయ్ ఎట్టకేలకు ఆదివారం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. -
లైంగిక వేధింపులు: ఎట్టకేలకు విచారణకు సంజయ్!
సాక్షి, నిజామాబాద్: నర్సింగ్ విద్యార్థినులను లైంగికంగా వేధించిన కేసులో సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ తనయుడు సంజయ్ ఆదివారం విచారణకు హాజరయ్యారు. విద్యార్థినుల ఫిర్యాదుతో ధర్మపురి సంజయ్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. సంజయ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ శాంకరీ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు ఆరోపించారు. ఈ కేసులో 41- సీఆర్పీసీ ప్రకారం పోలీసులు సంజయ్‌కు నోటీసులు జారీచేశారు. ఈ కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీసులు ఈ నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో అజ్ఞాతంలోకి వెళ్లిన సంజయ్ ఎట్టకేలకు ఆదివారం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. సంజయ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ 11 మంది నర్సింగ్ విద్యార్థినులు గురువారం తెలంగాణ హోం శాఖా మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాయిని సూచన మేరకు ఈ ఉదయం నిజామాబాద్ సీపీని కలిసి విద్యార్థులు మరోసారి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో సంజయ్‌పై నిర్భయ యాక్ట్ కింద కేసును పోలీసులు నమోదు చేశారు. సంజయ్‌ను ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే తాను ఎవరినీ వేధించలేదంటూ సంజయ్ ఆ ఆరోపణలను ఖండించారు. విద్యార్థినులపై సంజయ్ లైంగిక వేధింపులు పాల్పడటంపై మహిళా సంఘాలు భగ్గమంటున్నాయి. తక్షణమే సంజయ్‌ను అరెస్ట్ చేయాలనీ, శాంకరి నర్సింగ్ కాలేజీ మూసివేయాలని విద్యార్థులు, మహిళా సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని హోంమంత్రి నాయిని డీజీపీని ఆదేశించారు కూడా. -
డీఎస్ కుమారుడికి నోటీసులు
సాక్షి, నిజామాబాద్ : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు నేడు విచారణకు హాజరుకావాలని శనివారం నిజామాబాద్ పోలీసులు ఆదేశించారు. శాంకరీ నర్సింగ్ కళాశాల విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అతనిపై కేసు నమోదైన విషయం తెలిసింది. గత వారం రోజులుగా సంజయ్ పోలీసుల కంటపడకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తనపై ఇటీవల నమోదైన లైంగిక వేధింపులు కేసుపై ప్రభుత్వం విచారిస్తే తప్పకుండా సహారికరిస్తానని ఇటీవల ప్రకటించిన మాజీ మేయర్ పోలీసులు తప్పించుకుని తిరుగుతున్నారు. తమపై లైంగిక వేధింపుల వేధింపులకు పాల్పడ్డారని పలువురు విద్యార్థినులు ఫిర్యాదు చేయడంతో అతనిపై నిర్భయ కేసుతో సహా, పలు సెక్షలపై కేసు నమోదైంది. కాగా ప్రస్తుతం అతని కోసం ఆరు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. -
‘సంజయ్‌కు మాకు ఎలాంటి సంబంధం లేదు’
సాక్షి, నిజామాబాద్ : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ధర్మపురి సంజయ్‌కు తమకు ఎలాంటి సంబంధం లేదని డీయస్ చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ స్పష్టం చేశారు. ఆయనది వేరే పార్టీ అని, తనది వేరే పార్టీ అంటూ చెప్పుకొచ్చాడు. శుక్రవారం ‘సాక్షి’తో ముచ్చటిస్తూ.. సంజయ్‌పై లైంగిక వేధింపుల కేసు నిరూపణ అయితే కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. తాను టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడుతున్నానని పేర్కొన్నారు. టీఆర్ఎస్ రైతుల వ్యతిరేక ప్రభుత్వమని ఆరోపించారు. గజ్వేల్, సిద్ధిపేట రైతులు బాగుంటే సరిపోతుందా.. మిగతా రైతుల కష్టాలు పట్టవా అని ప్రశ్నించారు. నిజామాబాద్ రైతుల సంక్షేమం కోసం ఒత్తిడి తెస్తామని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం కేవలం మాటలు చెబుతుందని దుయ్యబట్టారు. భవిష్యత్తులో ప్రజలు టీఆర్ఎస్కు బుద్ది చెబుతారంటూ ఎద్దేవా చేశారు. -
సంజయ్ కోసం గాలింపు వేగవంతం
నిజామాబాద్ క్రైం(నిజామాబాద్ అర్బన్) : శాంకరీ నర్సింగ్ కళాశాల విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నిజామాబాద్ మాజీ మేయర్ డి. సంజయ్ పోలీసుల కేసు నమోదు చేశారు. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తనపై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై తనను ప్రభుత్వం విచారిస్తే విచారణకు తాను పూర్తి సహకారాలు అందిస్తానని చెప్పిన ఆయన తనపై పోలీసులు నిర్భయ కేసుతో పాటు పలు సెక్షన్లు నమోదు చేసిన విషయం తెలుసుకుని అజ్ఞాతనంలోకి వెళ్లిపోయారు. సంజయ్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు శుక్రవారం రాత్రి ఆయన ఇంటికి వెళ్లగా అప్పటికే ఆయన పరారయ్యాడు. పోలీసుల విచారణకు సహకరిస్తానన్న సంజయ్ వ్యాఖ్యలతో పోలీసులు ఆయనకు ఫోన్ చేయగా ఫోన్ స్వీచ్ఛాఫ్ వచ్చింది. దాంతో నిజామాబాద్‌లో ఆయన తలదాచుకునేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో పోలీసులు గాలింపు శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు తీవ్రంగా శ్రమించారు. అనంతరం ఇక్కడ ఆయన లేరన్న విషయ తెలుసుకున్న పోలీస్‌లు ఆరు బృందాల్లో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రకు వెళ్లినట్లు తెలిసింది. ముందస్తు బెయిల్‌కు యత్నాలు.. పోలీసులు తనను అరెస్టు చేయకుండా సంజయ్ ముందస్తు బెయిల్ కోసం అజ్ఞాతంలో ఉండే ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు సమాచారం. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్‌గా ఎన్నికైనప్పటి నుంచి సంజయ్ పలు వివాదాలలో ఇరుక్కున్నారు. ఈ వివాదాలతో ఎప్పుడు ఆయన పోలీస్ స్టేషన్ల మెట్లు ఎక్కలేదు. గతంలో ఎల్లమ్మగుట్ట కాలనీవాసులు పోలీస్‌లైన్ నుంచి నడుస్తుండటంపై క్వాటర్ట్స్ ప్రహరీని మూడివేశారు. దాంతో ఎల్లమ్మగుట్ట వాసులు నిరసనకు దిగారు. అప్పటి మేయర్ సంజయ్ కాలనీవాసులకు అండగా ఉండేందుకు పోలీసులు మూసిన ప్రహరీని కూల్చివేశారు. దీనిపై అప్పటి ఎస్పీ రాజేష్ సంజయ్‌పై కేసు నమోదు చేసి ఆయనను అరెస్టు చేసేందుకు యత్నించారు. అయితే సంజయ్ పోలీసుల చేతికి చిక్కకుండా తప్పించుకున్నారు. కొద్ది నెలల క్రితం ఓ కానిస్టేబుల్ సంజయ్ ఇంటికి కొద్ది దూరంలో మూత్రం చేస్తుండటంతో సంజయ్ ఆ కానిస్టేబుల్‌ను పట్టుకుని కొట్టినట్లు తెలిసింది. దీనిపై ఆ కానిస్టేబుల్ నాల్గోటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు యత్నించాడు. వెంటనే రాజ్యసభ సభ్యుడు డీఎస్ తన తనయుడు సంజయ్‌పై పోలీసులు కేసు నమోదు కాకుండా చూశారు. దీంతో వివాదం సద్దుమణిగిందని అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా ఇప్పుడు తనపై చేసిన లైంగిక ఆరోపణలతో నమోదు చేసిన కేసులతో పోలీసులు అరెస్టు చేయకుండా ముందస్తుగా యాంటిసిప్టరీ బెయిల్ పొందెందేందుకు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలిసింది. పోలీసులు మాత్రం ఆయన ఎక్కడున్న పట్టుకుని అరెస్టు చేసేందుకు తీవ్రంగా గాలింపు చర్యల్లో ఉన్నారు. -
రెండవ రోజు అజ్ఞాతంలో సంజయ్
సాక్షి, నిజామాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత డీ శ్రీనివాస్ కుమారుడు, నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. శుక్రవారం లైంగిక వేధింపుల కేసులో పోలీసులు ఆయన్ని అరెస్టు చేయాలనుకున్న నేపథ్యంలో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. శనివారం కూడా ఆయన అజ్ఞాతంలోనే ఉండటంతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నిజామాబాద్‌తో పాటు హైదరాబాద్, మహారాష్ట్ర , విజయవాడలలో పోలీసులు గాలిస్తున్నారు. నాలుగు బృందాలుగా ఏర్పడ్డ నిజామాబాద్ పోలీసులు గాలింపు చేపట్టారు. కాగా సంజయ్ మందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సంజయ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ శాంకరీ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు ఆరోపించిన విషయం తెలిసిందే. వారి ఫిర్యాదు మేరకు ఆయనపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు అయ్యింది. -
డీఎస్ తనయుడి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
-
అజ్ఞాతంలోకి సంజయ్.. పోలీసుల గాలింపు
సాక్షి, నిజామాబాద్: సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ తనయుడు సంజయ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. లైంగిక వేధింపుల కేసులో అతన్ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. విద్యార్థినుల ఫిర్యాదుతో ధర్మపురి సంజయ్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు అయ్యింది. సంజయ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ శాంకరీ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసు నమోదుకాగా, అరెస్ట్ చేయడానికి శుక్రవారం సాయంత్రం పోలీసులు సంజయ్ ఇంటికి వెళ్లారు. అయితే సంజయ్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు గాలింపు చేపట్టారు. (శాంకరి కాలేజీ వేరే వాళ్లకు ఇచ్చాం) సంజయ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ 11 మంది నర్సింగ్ విద్యార్థినులు గురువారం తెలంగాణ హోం శాఖా మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నాయిని సూచన మేరకు ఈ ఉదయం నిజామాబాద్ సీపీని కలిసి విద్యార్థులు మరోసారి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో సంజయ్‌పై నిర్భయ యాక్ట్ కింద కేసును పోలీసులు నమోదు చేశారు. సంజయ్‌ను ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే తాను ఎవరినీ వేధించలేదంటూ సంజయ్ ఆ ఆరోపణలను ఖండించిన విషయం విదితమే. విద్యార్థినులపై సంజయ్ లైంగిక వేధింపులు పాల్పడటంపై మహిళా సంఘాలు భగ్గమంటున్నాయి. తక్షణమే సంజయ్‌ను అరెస్ట్ చేయాలనీ, శాంకరి నర్సింగ్ కాలేజీ మూసివేయాలని విద్యార్థులు, మహిళా సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని హోంమంత్రి నాయిని డీజీపీని ఆదేశించారు కూడా. 'అది టీఆర్ఎస్ అంతర్గత వ్యవహారం' -
'లైంగిక ఆరోపణలు.. టీఆర్ఎస్ అంతర్గత వ్యవహారం'
సాక్షి, నిజామాబాద్ : టీఆర్ఎస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) కుమారుడు సంజయ్‌పై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో మరో కుమారుడు బీజేపీనేత ధర్మపురి అరవింద్ స్పందించారు. సంజయ్ మీద వచ్చిన ఆరోపణలు టీఆర్ఎస్ అంతర్గత వ్యవహారమని అరవింద్ అన్నారు. సంజయ్‌పై వస్తున్న ఆరోపణలు తనకు వ్యక్తిగతంగా డ్యామేజీ జరుగుతుందని అనుకోవడం లేదన్నారు. తాము విడిపోయి 20 ఏళ్లు దాటిపోయిందని అరవింద్ తెలిపారు. 'రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం నెలకొంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులు 10 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. శ్రీరాంసాగర్ నుంచి వెంటనే సాగునీరు విడుదల చేయాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేకంగా మారిపోయింది. మంత్రి ఎక్కడ ఉన్నారో ఎందుకు నిజామాబాద్ వైపు రారో తెలియదు. షుగర్ ఫ్యాక్టరీ కోసం రైతులు ఎదురుచూస్తుంటే రైతు ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు ఎంపీ కవిత ఐటీ హబ్ తెర మీదకు తెస్తారు. టీఆర్ఎస్ వాళ్లు యువత చెవుల్లో ఐటీ హబ్ పేరుతో గులాబీ పువ్వులు పెడుతున్నారు. విద్యార్థుల మీద ప్రేమ ఉంటే తెలంగాణ యూనివర్సిటీని ఎందుకు అభివృద్ధి చేయరు. ఎంతమంది విద్యార్థులను ఎంపీ కవిత అమెరికా పంపారు' అని ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. సంబంధిత వార్తలు : ఎవరితో సహజీవనం చేయడం లేదు : డీఎస్ కుమారుడు డీఎస్ తనయుడి లైంగిక వేధింపులు! -
ఎవరితోనూ సహజీవనం చేయడం లేదు
సాక్షి, నిజామాబాద్ : తనపై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో టీఆర్ఎస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) కుమారుడు సంజయ్ స్పందించారు. 'నాపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేవు. శాంకరి నర్సింగ్ కాలేజీ వేరే వాళ్లకు ఇచ్చాము. అక్కడికి నేను వెళ్ళలేదు. అడ్మిషన్లతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ కాలేజీలో ఎవరు చదువుతున్నారో కూడా తెలియదు. నాకు భార్య పిల్లలు ఉన్నారు. ఎవరితో సహజీవనం చేయడం లేదు. ఎవరో విద్యార్థినులతో అలా చెప్పించారు. రాజకీయంగా దెబ్బ తీయడానికే ఇవన్నీ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఎవరో తెలియదు కానీ మా ఫ్యామిలీని టార్గెట్ చేశారు. ఎన్నికలు వస్తున్న సందర్భంగా ఇలాంటివి జరుగుతున్నాయి. రాజకీయ దురుద్దేశంతోనే ఇలా చేస్తున్నారు' అని ధర్మపురి సంజయ్ పేర్కొన్నారు. కాగా, డీఎస్ తనయుడు తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ శాంకరి నర్సింగ్ కాలేజీ విద్యార్థులు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి గురువారం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆరు నెలలుగా తమను సంజయ్ లైంగికంగా వేధిస్తున్నాడని 11 మంది విద్యార్థులు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు చెందిన శాంకరి కాలేజీలో చదువుతున్న విద్యార్థినులపై సంజయ్ లైంగిక వేధింపులు పాల్పడటంపై మహిళా సంఘాలు భగ్గమంటున్నాయి. తక్షణమే సంజయ్‌ను అరెస్ట్ చేయాలనీ, శాంకరి నర్సింగ్ కాలేజీ మూసివేయాలని విద్యార్థులు, మహిళా సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని హోంమంత్రి నాయిని డీజీపీని ఆదేశించారు. -
విద్యార్థినులపై డీఎస్ తనయుడి లైంగిక వేధింపులు!
-
విద్యార్థినులపై డీఎస్ తనయుడి లైంగిక వేధింపులు!
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) కుమారుడు సంజయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. డీఎస్ తనయుడు తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ శాంకరి నర్సింగ్ కాలేజీ విద్యార్థులు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి గురువారం ఫిర్యాదు చేశారు. ఆరు నెలలుగా తమను సంజయ్ లైంగికంగా వేధిస్తున్నాడని 11 మంది విద్యార్థులు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు చెందిన శాంకరి కాలేజీలో చదువుతున్న విద్యార్థినులపై సంజయ్ లైంగిక వేధింపులు పాల్పడటంపై మహిళా సంఘాలు భగ్గమంటున్నాయి. తక్షణమే సంజయ్‌ను అరెస్ట్ చేయాలనీ, శాంకరి నర్సింగ్ కాలేజీ మూసివేయాలని విద్యార్థులు, మహిళా సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని హోంమంత్రి నాయిని డీజీపీని ఆదేశించారు.