సాక్షి, నిజామాబాద్: నర్సింగ్ విద్యార్థినులను లైంగికంగా వేధించిన కేసులో సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ తనయుడు సంజయ్ ఆదివారం విచారణకు హాజరయ్యారు. విద్యార్థినుల ఫిర్యాదుతో ధర్మపురి సంజయ్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. సంజయ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ శాంకరీ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు ఆరోపించారు. ఈ కేసులో 41- సీఆర్‌పీసీ ప్రకారం పోలీసులు సంజయ్‌కు నోటీసులు జారీచేశారు. ఈ కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీసులు ఈ నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో అజ్ఞాతంలోకి వెళ్లిన సంజయ్ ఎట్టకేలకు ఆదివారం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
సంజయ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ 11 మంది నర్సింగ్ విద్యార్థినులు గురువారం తెలంగాణ హోం శాఖా మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాయిని సూచన మేరకు ఈ ఉదయం నిజామాబాద్ సీపీని కలిసి విద్యార్థులు మరోసారి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో సంజయ్‌పై నిర్భయ యాక్ట్ కింద కేసును పోలీసులు నమోదు చేశారు. సంజయ్‌ను ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
అయితే తాను ఎవరినీ వేధించలేదంటూ సంజయ్ ఆ ఆరోపణలను ఖండించారు. విద్యార్థినులపై సంజయ్ లైంగిక వేధింపులు పాల్పడటంపై మహిళా సంఘాలు భగ్గమంటున్నాయి. తక్షణమే సంజయ్‌ను అరెస్ట్ చేయాలనీ, శాంకరి నర్సింగ్ కాలేజీ మూసివేయాలని విద్యార్థులు, మహిళా సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని హోంమంత్రి నాయిని డీజీపీని ఆదేశించారు కూడా.
Comments
Please login to add a commentAdd a comment