సైకిల్ జిల్లా సారథిగా సత్తన్న | tdp district, the captain of sattana | Sakshi
Sakshi News home page

సైకిల్ జిల్లా సారథిగా సత్తన్న

Published Thu, Oct 1 2015 1:51 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

tdp district, the captain of sattana

జాతీయ ప్రధాన కార్యదర్శిగా ‘రేవూరి’
పొలిట్‌బ్యూరో సభ్యునిగా ‘ఎర్రబెల్లి’
రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా సీతక్క
త్వరలో పూర్తి స్థాయిలో జిల్లా కమిటీ

 
వరంగల్ :  తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా గండ్ర సత్యనారాయణరావు(సత్తన్న) నియమితులయ్యారు. నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న టీడీపీ జిల్లా అధ్యక్ష పదవిలో  గండ్ర సత్యనారాయణరావు నియమించినట్లు పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. బుధవారం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ క్యాంపు కార్యాలయంలో టీడీపీ పొలిట్‌బ్యూరో, జాతీయ, తెలంగాణ రాష్ట్రాల పార్టీ కమిటీల నియామక వివరాలు చంద్రబాబు వెల్లడించారు. మన జిల్లాకు చెందిన 14 మంది నాయకులకు టీడీపీ జాతీయ, రాష్ట్ర కమిటీల్లో చోటు దక్కింది. పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇన్నాళ్లు తెలంగాణలో పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉండగా తాజాగా ఈ పదవి దక్కలేదు. కొత్త కమిటీలో పార్టీ జాతీయ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా నియమితులయ్యారు. రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. మాజీ ఎమ్మెల్యే ధనసరి అనసూయ(సీతక్క) పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, చాడ సురేష్‌రెడ్డి ఉపాధ్యక్షుడిగా, వేం నరేందర్‌రెడ్డి అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. కార్యనిర్వాహక కార్యదర్శులుగా ఎంపీ గుండు సుధారాణి, గట్టు ప్రసాద్‌బా బు, బానోత్ మోహన్‌లాల్, జాటోత్ నెహ్రూ, దొమ్మాటి సాంబయ్యలకు చోటు కల్పించా రు. లింగాల వెంకటనారాయణగౌడ్, ఈగ మల్లేషం, నెమురుగొమ్ముల ప్రవీణ్‌కుమార్ కార్యదర్శులుగా నియమితులయ్యారు.

సత్తన్న ప్రస్థానం
గండ్ర సత్యనారాయణరావుది గణపురం మండలం బుద్దారం గ్రామం. టీడీపీ ఆవి ర్భావంతో పార్టీలో చేరి పలు పదవులు నిర్వహించారు. 1982-85వరకు గ్రామపార్టీ అధ్యక్షునిగా.. 1985-96 వరకు మండల పార్టీ అధ్యక్షుడి గా.. 1997-2001 వరకు జిల్లా పార్టీ ప్రచార కార్యదర్శిగా.. 2001-03 వరకు జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శిగా.. 2003-05 గా జిల్లా పార్టీ కార్యదర్శిగా.. 2005-09 వరకు జిల్లా ఉపాధ్యక్షులుగా.. 2009 నుంచి నేటి వరకు భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జీగా కొనసాగుతున్నారు. 1988-95 వరకు బుద్దారం సర్పంచ్‌గా, 1995-2000 వరకు గణపురం జెడ్పీటీసీ సభ్యుడిగా పదవులు నిర్వహించారు. గత ఎన్నికల్లో భూపాలపల్లి ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement