టీడీపీ జిల్లా అధ్యక్షుడి ఎన్నిక నేటికి వాయిదా
మంత్రి పదవిపై ఆశతో అధ్యక్ష పదవిపై మొదట విముఖత చూపిన బీకే
జిల్లా పగ్గాలు చేజిక్కించుకునేందుకు ప్రభాకర్ చౌదరి తీవ్ర యత్నం
చౌదరిని వ్యతిరేకించిన పలువురు కీలక నేతలు
చంద్రబాబు ఆదేశంతో బీకేను సారథిగా నియమించేందుకు పయ్యావుల మంత్రాంగం
అధ్యక్షుడిగా బీకే, ప్రధాన కార్యదర్శిగా సూరి దాదాపు ఖరారు
నేడు అధికారిక ప్రకటన
(సాక్షి ప్రతినిధి, అనంతపురం) : తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడి ఎన్నిక వాయిదా పడింది. మూడోసారి జిల్లా అధ్యక్షుడిగా బీకే పార్థసారథిని నియమించాలని అధిష్టానం భావించడం.. అయితే బాధ్యతలు తీసుకునేందుకు ఆయన విముఖత చూపడం.. ప్రభాకర్ చౌదరి రేసులోకి రావడం.. ఆయనపై పార్టీలో వ్యతిరేకత వెల్లువెత్తడంతో శనివారం జిల్లా కమిటీ ఎన్నికకు బ్రేక్ పడింది. దీంతో ఆదివారానికి వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల పరిశీలన కమిటీ సభ్యులు ప్రకటించారు. ఇటు ఆంధ్రప్రదేశ్‌తో పాటు అటు తెలంగాణలో శనివారం టీడీపీ జిల్లా కమిటీల ఎన్నిక నిర్వహించారు.
ఇందులో భాగంగా అనంతపురం జిల్లా కమిటీని ఎన్నిక చేసేందుకు పార్టీ అధిష్టానం మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎంపీ సీఎం రమేశ్‌లను పరిశీలకులుగా పంపింది. బీకే పార్థసారథిని మూడోసారి అధ్యక్షుణ్ని చేయాలని చంద్రబాబు భావించారు. ఇదే విషయాన్ని ఎన్నికల పరిశీలకులకు చెప్పి ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని సూచించారు. ఈ మేరకు శనివారం నగరంలోని ఆర్‌కే ఫంక్షన్ హాలులో సమావేశం నిర్వహించారు.
పార్టీ పగ్గాలు చేపట్టేందుకు బీకే పార్థసారథి అనాసక్తి ప్రదర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చినతర్వాత బీకే మంత్రి పదవి ఆశించారు. బీసీ కోటాలో మంత్రి పదవి ఖాయమని భావించారు. చంద్రబాబు మాత్రం జిల్లాలో రెండు మంత్రి పదవులనూ ఓసీ సామాజిక వర్గానికే కట్టబెట్టారు. ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణలోనైనా పదవి దక్కించుకోవాలని మొదట్నుంచీ బీకే తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ కారణంతోనే జిల్లా అధ్యక్ష పదవిని తిరస్కరించినట్లు తెలుస్తోంది.
రేసులోకి చౌదరి
జిల్లా అధ్యక్ష పదవికి తానూ పోటీలో ఉన్నట్లు అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కొద్దిరోజుల కిందట పార్టీ నేతల వద్ద మనసులో మాటను బయటపెట్టినట్లు తెలుస్తోంది. బీకే పార్థసారథితో పాటు చౌదరి, ఏడీసీసీబీ మాజీ చైర్మన్ సరిపూటి సూర్యనారాయణ అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్లు, వాయిస్ మెసేజ్ ద్వారా కార్యకర్తల అభిప్రాయాలు సేకరించనున్నట్లు పార్టీ ప్రకటించింది. ఇదిలా ఉండగా... బీకే పార్థసారథినే అధ్యక్షుడిగా నియమించాలని ముందే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇందుకు ఆయన విముఖత చూపడంతో తనకు మార్గం సుగమమైందని చౌదరి భావించారు. అయితే.. ఆయన్ను మంత్రి పరిటాల సునీత, మేయర్ స్వరూపతో పాటు పలువురు కీలక నేతలు వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పరిశీలకులు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో చంద్రబాబు బీకేను ఒప్పించే బాధ్యతను పయ్యావుల కేశవ్‌కు అప్పగించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీకేతో కేశవ్ శనివారం ప్రత్యేకంగా సమావేశమై చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో ఎట్టకేలకు ఆయన ఒప్పుకున్నట్లు సమాచారం.
నేడు అధికారిక ప్రకటన
జిల్లా కమిటీ ఎన్నిక కొలిక్కి రావడంతో జిల్లా అధ్యక్షుడిగా బీకే పార్థసారథి, ప్రధాన కార్యదర్శిగా ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరిని నియమించేందుకు అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. వీరి పేర్లను ఆదివారం అధికారికంగా వెల్లడించనున్నారు.
ఊరించి.. ఉసూరుమనిపించారు
అనంతపురం సిటీ : టీడీపీ జిల్లా అధ్యక్షుణ్ని ఎన్నుకుంటామని ఊరించారు. ఉక్కపోతలో అందర్నీ ఉడికించారు. చివరకు ఆదివారం ప్రకటిస్తామంటూ ఉసూరుమనిపించారు. శనివారం అనంతపురంలోని ఆర్‌కె ఫంక్షన్ హాల్లో ఉదయం 11.30 గంటలకు పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి అధ్యక్షతన జిల్లా కార్యవర్గం, అనుబంధ సంఘాల కమిటీల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. పరిశీలకులుగా రాష్ట్ర అటవీ శాఖా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షరీఫ్ హాజరయ్యారు.
మంత్రి పరిటాల సునీత, ఎంపీ నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్సీ శమంతకమణి, చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు, విప్ యామినీబాల, మాజీ ఎమ్మెల్యే పయ్యావులకేశవ్, జడ్పీ చైర్మన్ చమన్, నగర మేయర్ స్వరూపతో పాటు జిల్లా నలుమూలల నుంచి కార్యకర్తలు హాజరయ్యారు. మధ్యాహ్న భోజన సమయం వరకు నాయకుల ప్రసంగాలకే సరిపోయింది. భోజనానంతరం దాదాపు రెండు గంటల పాటు ఒక గదిలో చర్చలు జరిపారు. ఎంతకూ కొలిక్కి రాలేదు. తుదకు సాయంత్రం 4.30 గంటలకు పరిస్థితిని ముఖ్యమంత్రికి వివరించామని, ఆదివారం మీడియా ద్వారా జిల్లా అధ్యక్షుడిని ప్రకటిస్తామని సీఎం రమేష్ ప్రకటించారు.
పార్థుడే ‘సారథి’!
Published Sun, May 17 2015 2:09 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM
Advertisement