
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై తెలంగాణ టీడీపీ నేతలమధ్య వాడీ, వేడీ చర్చ జరిగింది. గురువారం ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఆధ్వర్యంలో పార్టీ ముఖ్యనేతల సమావేశం నిర్వహించారు. ముఖ్య నేతలంతా హైదరాబాద్‌కే పరిమితం అవుతున్నారని, జిల్లాల్లో తిరగకుండా, నియోజకవర్గాల్లో కార్యక్రమాల్లేకుండా ఎలా బలపడతామని ఈ సందర్భంగా కొందరు నాయకులు ప్రశ్నించినట్టు తెలిసింది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని, వచ్చే ఎన్నికల్లో అధికారం టీడీపీదే అని పదే పదే ప్రకటనలు చేస్తున్నా, పార్టీని బలోపేతం చేసే దిశలో పెద్దగా ప్రయత్నాలు జరగడం లేదన్న అభిప్రాయం వ్యక్తమైనట్టు సమాచారం. పనిచేయకుండా ఎలా అధికారంలోకి వస్తామని పలువురు నేతలు ప్రశ్నించారు. పార్టీ రెండు వర్గాలుగా విడిపోయిందని, వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తని.., కాంగ్రెస్‌తో పొత్తని రకరకాల ప్రచారం జరుగుతోందని, దీనిపై పార్టీ నేతలే కార్యకర్తల్లో అయోమయం సృష్టిస్తున్నారని కొందరు నాయకులు నిలదీశారని తెలిసింది.
కాగా, పార్టీ అధినేత చంద్రబాబు ఈ సమావేశానికి హాజరవుతానని ముందుగా సమయం ఇచ్చినా ఆయన హాజరు కాలేదు. పొలిట్‌బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లాల అధ్యక్షులు పాల్గొన్న ఈ సమావేశంలో సంస్థాగత ఎన్నికల నిర్వహణ, భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించారు. దీపావళి తరువాత రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వ విధానాలపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ సమావేశం అనంతరం మీడియాకు చెప్పారు. కాగా, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు నిధుల ఖర్చు, అభివృద్ధి పనులపై ఎలాంటి స్వేచ్ఛ లేదని, రాష్ట్ర సంపదంతా ఒకే కుటుంబం అనుభవిస్తోందని, తెలంగాణ వచ్చాక కూడా రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదని పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం బడుగు బలహీనవర్గాలను అణచివేస్తోందని, కేసీఆర్ వ్యతిరేకశక్తుల పునరేకీకరణ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment