సాక్షి, హైదరాబాద్ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దళితులను మోసం చేస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. పెద్ద మాదిగ అని చెప్పుకునే బాబుకు దళితులపై ఏమాత్రం ప్రేమ లేదని పేర్కొన్నారు. మహానాడుకు తనను పిలవకుండా మాదిగలను, దళితులను అవమానపరిచారని విమర్శించారు. శుక్రవారం ఆయన బేగంపేటలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. గురువారం జరిగిన మహానాడుకు తనను ఆహ్వానించకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘పార్టీకి 30 ఏళ్లుగా సేవ చేస్తున్న నన్ను మహానాడుకు పిలవలేదు. నాకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. సీనియర్ లీడర్‌కు ఇచ్చే గౌరవం ఇదేనా? ఎస్సీ వర్గీకరణ సభ కోసం నిజామాబాద్ వెళ్తుండగా ఇద్దరు బిడ్డలున్న ఓ తండ్రి రోడ్డు ప్రమాదంలో చనిపోతే చంద్రబాబు ఆదుకోలేదు. పెద్ద మాదిగ అని చెప్పుకునే బాబుకు దళితులపై ఉన్న ప్రేమ ఇదా? ఆంధ్రాలోనూ దళితులున్నారు జాగ్రత్త! పెద్ద మాదిగ అన్న మీరు వర్గీకరణపై ఎందుకు తీర్మానం చెయ్యలేదు. కేసీఆర్ ఎప్పుడో అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు తీర్మానం చేసి పార్లమెంట్‌కు పంపినా మీరెందుకు చెయ్యలేదో చెప్పాలి’’అని నిలదీశారు.
ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు కనీసం చాయ్‌కి కూడా సమయం ఇవ్వలేదని, ఆయనా దళితులకు న్యాయం చేసేది అని ప్రశ్నించారు. తాను చేసిన తప్పేంటో ఇప్పటికైనా బాబు చెప్పాలని, తప్పుంటే ముక్కు నేలకు రాస్తానని, లేదంటే ఆంధ్రాలో అన్ని జిల్లాలు తిరిగి నా తప్పేంటని అడుగుతానని స్పష్టంచేశారు. ‘‘రేవంత్ రెడ్డి బిడ్డ పెళ్లికి పోయావ్.. ఎంగేజ్‌మెంట్‌కు కేబినెట్ అంతా తీసుకొని వెళ్లావ్.. కానీ నా బిడ్డ పెళ్లికి పిలవంగా పిలవంగా సాయంత్రం వచ్చారు. అదే కేసీఆర్ ఇంటికి వెళ్లి.. నా ఇంట్లో బిడ్డ పెళ్లి ఉందనగానే ఆత్మీయంగా స్వాగతం పలికారు. పెళ్లికి కూడా వచ్చారు’’అని పేర్కొన్నారు.
తెలంగాణలో పార్టీ శ్మశానంలా తయారైంది
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ శ్మశానంలా తయారైందని, ఆంధ్రప్రదేశ్‌లోనూ వస్తదో, రాదో అన్న పరిస్థితి ఉందని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డిలాంటి మూర్ఖులను ప్రోత్సహించి, నిబద్ధత గల తన వంటి నాయకులను చిన్నచూపు చూడటంతోనే పార్టీ సర్వనాశనం అయిందన్నారు. పార్టీలో నీతి లేని నాయకులను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని, దళితులను ముఖ్యంగా మాదిగలను విస్మరిస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘పార్టీలో డబ్బు, కులానికే ప్రాధాన్యత పెరిగింది. అందుకే పార్టీ పతనావస్థకు చేరుతోంది. దీనిపై ఇప్పటికైనా చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోవాలి’’అని వ్యాఖ్యానించారు.
మళ్లీ చెబుతున్నా.. కేసీఆర్‌తో కలిసిపోదాం..
కేసీఆర్‌తో కలిసి పోదాం అన్నందుకే తనను పక్కన పెడుతున్నారని మోత్కుపల్లి వాపోయారు. ‘‘మళ్లీ చెబుతున్నా.. కేసీఆర్ మన మిత్రుడే. ఆయన కేబినెట్‌లో ఉన్నవారు మనవారే. వారితో జతకట్టడం మనకు మంచిదే. టీఆర్‌ఎస్‌లో పార్టీని విలీనం చేయాలన్న వ్యాఖ్యలను సమర్థించుకుంటున్నా’’అని చెప్పారు. ఇప్పటికీ తాను టీడీపీలోనే ఉన్నానని, బాబు తనను పిలిచి మాట్లాడాలని అన్నారు. తనను పిలవకుంటే రాజకీయ భవిష్యత్తు ఏంటన్నది కాలమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కూలదోసుంటే చెప్పుతో కొట్టేవారు
ఓటుకు కోట్లు కేసులో రేవంత్‌రెడ్డి అప్రూవర్‌గా మారతాడని చంద్రబాబు భయపడ్డారని, అందుకే బ్లాక్ మెయిల్ చేసినా ఆయనపై చర్యలు తీసుకోలేదని మోత్కుపల్లి చెప్పారు. ఒకవేళ కుట్రతో టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కూలదోసుంటే ప్రజలు టీడీపీని చెప్పుతో కొట్టేవారని, నాదెండ్ల భాస్కర్‌రావు మాదిరే తిరుగుబాటు చేసేవారని వ్యాఖ్యానించారు. రాజ్యసభ ఎన్నికల్లో పైసా, పరపతి లేనివారికి సీఎం కేసీఆర్ టిక్కెట్లు ఇచ్చారని, ఆ పని మీరెందుకు చేయలేకపోయారని బాబు ను నిలదీశారు. పార్టీ నుంచి తనను మెడపట్టి బయటకు గెంటేసే ప్రయత్నం జరుగుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment