నా కళ్లల్లో చూసే ధైర్యం లేక ...
హైదరాబాద్ : అసెంబ్లీలో తాను మాట్లాడితే నా కళ్లలో చూసే ధైర్యం లేకే తనను టార్గెట్ చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కేబినెట్ సహాచరులపై టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఉదయం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఆసెంబ్లీ ఆవరణలో సాక్షితో రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడారు.
ఎల్బీనగర్ మీటింగ్ నుంచి వేట మొదలైందన్నారు. కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలపై నమ్మకం లేక ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని మంత్రులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అలాగే రాజకీయ ప్రయోజనాల కోసం కుట్రలు చేస్తున్నారంటూ కేసీఆర్పై రేవంత్రెడ్డి మండిపడ్డారు. ఓ పార్టీ గుర్తుపై గెలిచి... మరో పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేల అంశంలో అనర్హత పిటిషన్పై హైకోర్టు వెలువరించిన తీర్పు స్పీకర్కు సూచనగా భావిస్తున్నామని రేవంత్రెడ్డి అభిప్రాయపడ్డారు.
కేసీఆర్ మంత్రి వర్గంలో కొనసాగుతున్న తలసాని శ్రీనివాసయాదవ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 8 నెలలు అయిందని... అయినా తెలంగాణ శాసన సభ స్పీకర్ తలసాని రాజీనామాను ఆమోదించ లేదన్నారు. పీజీ చదువుతున్న విద్యార్థులను కాల్చి చంపడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని రేవంత్ ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
గులాబీ పార్టీ నేతలు ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు తేడా తెలియకుండా వ్యహరిస్తున్నారని విమర్శించారు. అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారంటూ...పోలీసులపై రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. మీ విధులు మీరు నిర్వహించండి... టీఆర్ఎస్ ప్రభుత్వం శాశ్వతం కాదంటూ పోలీసులకు రేవంత్రెడ్డి హితవు పలికారు.