లోక్‌సభా పక్ష నేతగా జితేందర్?
పరిశీలనలో వినోద్‌కుమార్ పేరు
పార్లమెంటరీ పార్టీ నేతగా కేకేనే!
హస్తిన నుంచి తిరిగొచ్చిన కేసీఆర్
హైదరాబాద్/న్యూఢిల్లీ: లోక్‌సభలో టీఆర్‌ఎస్ పక్ష నేత ఎవరన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. 11 మంది టీఆర్‌ఎస్ లోక్‌సభ సభ్యుల్లో సీనియర్లయిన ఎ.పి.జితేందర్‌రెడ్డి (మహబూబ్‌నగర్), బి.వినోద్‌కుమార్ (కరీంనగర్) పేర్లు గట్టిగా విన్పిస్తున్నాయి. మోడీ నేతృత్వంలో కొలువుదీరిన ఎన్డీఏ ప్రభుత్వంలోని చాలామంది ముఖ్యులతో జితేందర్‌రెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయి. వినోద్‌కు కూడా జాతీయ స్థాయిలోని నేతలతో పరిచయాలున్నాయి. పైగా పార్టీ అధినేత కేసీఆర్‌కు ఆయన అత్యంత సన్నిహితుడని కూడా పేరుంది. కాకపోతే సామాజిక సమతూకం తదితరాల కోణంలో జితేందర్‌రెడ్డికే అవకాశం దక్కవచ్చంటున్నారు. మంగళవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో దీనిపై కేసీఆర్‌ను ప్రశ్నించగా, ‘తొందరేముంది? హైదరాబాద్‌లో ఎంపీలంతా సమావేశమై ఎన్నుకుంటారు’ అంటూ స్పందించారు.
ఇక తాను రాజీనామా చేసిన మెదక్ లోక్‌సభ స్థానం బరిలో ఎవరిని నిలపాలన్న దానిపైనా చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అనంతరం కేసీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. పార్టీ ఎంపీలు, ఇతర నేతలు కూడా ఆయనతో పాటు తిరిగొచ్చారు. ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం ఆయన ఢిల్లీ రావడం తెలిసిందే. ఇక టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా మాత్రం పార్టీ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు వ్యవహరించనున్నారు.