హిరోషి ససాకి, నవోమి వతనబి (ప్లస్–సైజ్ ఉద్యమకారిణి)
టోక్యో ఒలింపిక్స్ కమిటీ నుంచి మళ్లీ ఇంకొకాయన దిగిపోయారు! పేరు హిరోషి ససాకి. తీరు బాయిష్ టాక్. వయసు 66. బుద్ధి వికసించని మగపిల్లలు.. ఎదుగుతున్న వయసులోని ఆడపిల్లల్ని బాడీ షేమింగ్ చేస్తుంటారు. అలా ఈయన నవోమి వతనబి అనే 33 ఏళ్ల ‘చబ్బీ అండ్ క్యూట్’ మూవ్‌మెంట్ సెలబ్రిటీని ‘ఒలిం–పిగ్’ అనేశాడు! అన్నది ఎప్పుడో. ఇప్పుడు బయట పడింది. ‘లైవ్’ అనే చాట్ గ్రూప్ లో.. ‘ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీకి ఆ ఒలిం–పిగ్ ని ఆహ్వానిద్దాం‘ అన్నారట హిరోషి. ఒలింపిక్స్ ప్రారంభ, ముగింపు ఉత్సవాల నిర్వహణ కమిటీకి క్రియేటివిటీ హెడ్ ఆయన. క్రియేటివిటీ కాస్త మితి, మతి తప్పినట్లుంది... అంత మాట అనేసి, అపాలజీ చెబుతూ తన పదవికి రాజీనామా చేశారు. కొద్ది రోజుల క్రితమే యెషిరో అనే 83 ఏళ్ల పెద్ద మనిషి.. ‘ఈ మహిళలున్నారే మీటింగ్స్‌లో అధిక ప్రసంగం చేస్తారు’ అని కామెంట్ చేసి, ‘స్టెప్ డౌన్’ అయ్యారు. ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు ఆయన! అసలు ఈ మగాళ్లకు ఏమైంది! ఎందుకిలా ‘బాయ్స్’ లా మాట్లాడతారు? ఇందుకు వాళ్లేం (పురుషులు) చెబుతున్నారు? వీళ్లేం (మహిళలు) అంటున్నారు.
నవోమి వతనబి ప్లస్–సైజ్ కమెడియన్. వసపిట్ట. మాటలతో పొట్టల్ని చెక్కలు చేస్తారు. ఆమెను చూడగానే నవ్వు గుర్తుకు రావడానికి ఆమె మాటలతో పాటు ఆమె రూపం కూడా కొంత కారణం. లావుగా ఉంటారు నవోమి. ప్లస్–సైజ్‌లో! ఆమె నవ్వింపులు, కవ్వింపుల టాపిక్ కూడా అదే.. ప్లస్ సైజ్. లావుగా ఉండటాన్ని తను సీరియస్‌గా తీసుకోరు, ఎవర్నీ తీసుకోనివ్వరు కూడా. బాడీ షేమింగ్ చేసేవాళ్లని తన మృదువైన చిరునవ్వు పలుకులతో బాది పడేస్తారు. జపాన్ రాజధాని టోక్యోలో ఏ పెద్ద ఈవెంట్ జరిగినా ఉల్లాసభరితమైన ఆమె స్వాగత వచనాలతో అది ప్రారంభం కావడం కానీ, ముగింపునకు రావడం కానీ జరుగుతుంది. అంతగా ఆమె పావులర్ అవడానికి ఇంకొక కారణం ‘పొచాకవాయి’! ఈ మాటను ఇంగ్లిష్‌లోకి అనువదిస్తే ‘చబ్బీ అండ్ క్యూట్’ అనే అర్థం వస్తుంది. బొద్దుగా, ముద్దుగా అని. లావుగా ఉన్నవాళ్లలో సాధారణంగా ఉండే చిన్నబుచ్చుకునే స్వభావాన్ని పోగొట్టి, లావుగా ఉన్నవాళ్లను చిన్నబుచ్చే వాళ్లను ‘కాస్త విశాలంగా ఆలోంచించండి’ అని చెప్పడానికి నవోమి చేపట్టిన ఉద్యమం పేరే.. పొచాకవాయి. అలా ఉద్యమకారిణిగా కూడా జపాన్‌లో నవోమికి పేరుంది, గౌరవం ఉంది. అంతటి మనిషిని పట్టుకుని హిరోషి ససాకి (66) అనే పెద్ద మనిషి పిగ్ అనేశాడు! సరిగ్గా ఆయన అన్న మాటైతే.. ‘ఒలిం–పిగ్’ అని! పెద్దమనుషులు ఎక్కడైనా అలా అంటారా? ‘‘నోరు జారాను సారీ’’ అన్నారు కనుక హిరోషిని పెద్దమనిషి అనే అనుకోవాలి. అంతేకాదు తన పదవికి బుధవారం రాత్రి రాజీనామా చేశారు. చిన్న పదవి కాదు ఆయనది. టోక్యోలో ఈ ఏడాది జరగబోతున్న ఒలింపిక్స్‌కి ప్రారంభ, ముగింపు ఉత్సవాలను నిర్వహించే కమిటికీ క్రియేటివ్ హెడ్!
సికొ హషిమొటో, ఒలింపిక్స్ కమిటీ కొత్త అధ్యక్షురాలు
ఆయన అలా అన్నందుకు నవోమీ ఏమీ బాధపడలేదు. పురుషుల గుణగణాలు ఆమెకు తెలియనివేవీ కాదు. హిరోషి మాత్రం పశ్చాత్తాపంతో కుమిలిపోయినంత పని చేశాడు. ‘నేను ఆమెను అవమానపరిచాను. అలా అని ఉండాల్సింది కాదు’ అంటూ.. రాజీనామా సమర్పణకు ముందు ఆమెకు సారీ చెబుతూ ఒక ప్రకటన చేశారు. ‘ఒలిం–పిగ్’ అని హిరోషి ఇప్పుడు అన్నమాట కాదు. గత ఏడాది ఆఖరులో.. టోక్యో ఒలింపిక్స్ ప్రారంభోత్సవాలకు ఎవరెవర్ని పిలవాలో టీమ్ అంతా కలిసి, మెసేజింగ్ యామ్ ‘లైన్’లో గ్రూప్ చాటింగ్ చేస్తున్నప్పుడు.. ‘ఆమె ఉంది కదా నవోమీ.. ఆమెకు ఒలింపిగ్ రోల్ ఇద్దాం. సరిగ్గా సరిపోతుంది’ అన్నారు హిరోషి. ఆమె లావుగా ఉంటుంది కనుక, తను క్రియేటివ్ హెడ్డు కనుక ఆమె లావును, తన క్రియేటివిటీని కలిపి ఒలిం–పిగ్ అనే మాటను వాడేశారు హిరోషి. దాన్నిప్పుడు ఒక పత్రిక బయట్టేసింది! ఆ మాట చివరికి అతడికే తలవంపులు తెచ్చిపెట్టింది. తల దించుకుని మెట్లు దిగి వెళ్లిపోయాడు. నవోమి కమెడియన్ మాత్రమే కాదు, నటి, ఫ్యాషన్ డిజైనర్ కూడా. తనని పిగ్ అన్నందుకు ఆమె రాద్ధాంతం ఏమీ చెయ్యలేదు. ‘‘పురుషులు ఎందుకనో ఇలాగే ఉంటారు. సంస్కారవంతులు అనుకున్నవాళ్లు కూడా తమ సమూహంలో ఉన్నప్పుడు ఆడవాళ్లను తేలిగ్గా మాట్లాడతారు. అది గొప్ప అనుకుంటారు’’ అని ఈ చేదు సందర్భంలోనూ తియ్యగా నవ్వించారు నవోమి. హిరోషి కూడా.. ‘‘ఆరోజు నాకేమయిందో తెలియదు. నా ఆలోచనలు సరిగా లేవు. ఒక స్త్రీని నేను అలా అనగలనని ఇప్పటికీ అనుకోలేకపోతున్నాను. మాట జారాను. నేను ఇక ఈ సీట్లో ఉండేందుకు తగినవాడిని కాదు’’ అని ఏమాత్రం సంకోచించకుండా తన గురించి చెప్పుకున్నారు. ‘పురుషజాతి ప్రక్షాళనకు ఆ ఒప్పుకోలు మాట ఒక్కటి చాలు’ అనిపించేటంతగా ఆయన తనని మన్నించమని మహిళా లోకాన్ని వేడుకున్నారు.
ఐ యామ్ వెరీ సారీ
యొషిరొ మొరి: తన విపరీత వ్యాఖ్యలతో కొత్త అధ్యక్షురాలు రావడానికి కారణమైన పాత అధ్యక్షుడు.
టోక్యో ఒలింపిక్స్ నిర్వహణ కమిటీలో ఇది రెండో అతిపెద్ద రాజీనామా. అది కూడా ఒక నెల వ్యవధిలో జరిగిన మహాభినిష్క్రమణ. ఫిబ్రవరి రెండో వారంలో కమిటీ ముఖ్యాధ్యక్షుడు యొషిరొ మొరి (83).. మహిళల మీద తగని వ్యాఖ్యాలు చేసినందుకు గద్దె దిగి వెళ్లిపోవలసి వచ్చింది. ఒలింపిక్స్ నిర్వహణకు అనేక కమిటీలు ఉంటాయి. వాటన్నిటిపైన ఉండే అత్యున్నత కమిటీకి యొషిరో అధ్యక్షులు. ఆ రోజు ఏదో కీలకమైన సమావేశం ఉంది. అది పూర్తయ్యాక ఆ వివరాలు ఇవ్వడం కోసం యొషిరో మీడియా ముందుకు వచ్చారు. మీడియా వాళ్లు సహజంగానే వెయ్యవలసిన ప్రశ్నే వేశారు. ‘‘మీ కమిటీలో నామమాత్రంగా కూడా మహిళలు ఉన్నట్లు లేరు. కారణం ఏమిటి?’’ అని అడిగారు. యోషిరో వెంటనే.. ‘‘ఆడవాళ్లు మీటింగులలో అధిక ప్రసంగం చేస్తారు. సమయం వృధా అవుతుంది. అందుకే వాళ్లను కమిటీలోకి తీసుకునే ఉద్దేశం లేదు’’ అనేశారు! అది దెబ్బకొట్టేసింది ఆయన ప్రతిష్టని. దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు, యూనివర్సిటీ విద్యార్థులు, విద్యావంతులు నిరసన ప్రదర్శనలు జరిపారు. తక్షణం ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో పెద్దవాళ్ల నుంచి కూడా ఒత్తిడి రావడంతో చివరికి ఆయన తన పదవిని త్యజించవలసి వచ్చింది. ఆయన స్థానంలోకి సికో హషిమొటొ అనే మహిళ వచ్చారు. వచ్చీ రావడంతోనే కమిటీ ఎగ్జిక్యూటివ్ బోర్డులోకి పన్నెండు మంది మహిళల్ని తీసుకున్నారు. ‘‘నేను అన్న ఉద్దేశం వేరు. మహిళలు కమిటీలో ఉంటే వాళ్లు మాట్లాడుతున్నప్పుడు ఒకే అంశంపై వాళ్లను ఉంచలేము. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని అలా అన్నాను తప్ప మహిళల్ని కించపరచాలని కాదు. నాకసలు అలాంటి ఆలోచనే లేదు’’ అని యొషిరో అననైతే అన్నారు కానీ మూల్యమైతే చెల్లించుకోవలసి వచ్చింది.
పురుషులు అనే ఇటువంటి మాటల్ని ‘సెక్సిస్టు కామెంట్స్’ అంటారు. తెలుగులో ఈ మాటకు సులువైన అర్థం.. ‘నేను మగాణ్ణి. ఏమైనా అంటాను’ అనే ధోరణితో కూడిన వ్యాఖ్యలు. నిజానికి అది ధోరణి కాదు. తరాలుగా జీర్ణించుకుపోయిన పురుషాధిక్య భావన. ఏమైనా పురుషులు ఇప్పుడిప్పుడు మహిళల మనోభాలు దెబ్బతినకుండా మాట్లాడ్డం నేర్చుకుంటున్నారు. ఆ ప్రయత్నంలోనే.. మాట అన్నాక ఏ మాత్రం రోషానికి పోకుండా మాటను వెనక్కు తీసుకుంటున్నారు. క్షమాపణ చెబుతున్నారు. ‘మారేందుకు సమయం పట్టడం సహజమే’ అని మహిళలూ సహనంగా వేచి చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment