ఏక్‌నాథ్‌ షిండే రాజీనామా | Eknath Shinde Resigns As Maharashtra Chief Minister, Submits Resignation To Maha Governor CP Radhakrishnan | Sakshi
Sakshi News home page

ఏక్‌నాథ్‌ షిండే రాజీనామా

Published Wed, Nov 27 2024 4:27 AM | Last Updated on Wed, Nov 27 2024 9:48 AM

Eknath Shinde resigns as Maharashtra chief minister

ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్‌ వినతి

కొత్త సీఎం ఎంపికపై నేడు స్పష్టత!  

ముంబై:  మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే  తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని మంగళవారం రాష్ట్ర గవర్నర్‌ సి.పి.రాధాకృష్ణన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా షిండే వెంట ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్‌ పవార్‌ ఉన్నారు. నూతన సీఎం ప్రమాణ స్వీకారం చేసే వరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని షిండేను గవర్నర్‌ కోరారు. మహారాష్ట్రలో ప్రస్తుత ప్రభుత్వ పదవీ కాలం మంగళవారం ముగిసింది. సాధ్యమైనంత త్వరగా నూతన ప్రభుత్వం కొలువుదీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.  

ఎడతెగని ఉత్కంఠ 
మహారాష్ట్ర కొత్త సీఎం ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మహాయుతి భాగస్వామ్యపక్షాలు ఇంకా ఏకాభిప్రాయానికి రాలేదని సమాచారం. ముఖ్యమంత్రి ఎంపికపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాలదే తుది నిర్ణయమని ఆయా పార్టీలు చెబుతున్నాయి. వారు ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని పేర్కొంటున్నాయి. సీఎం పోస్టు కోసం బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన(షిండే) నుంచి ఏక్‌నాథ్‌ షిండ్, ఎన్సీపీ(అజిత్‌పవార్‌) నుంచి అజిత్‌ పవార్‌ పోటీ పడుతున్నారు. ముఖ్యమంత్రి రేసు నుంచి తప్పుకోవడానికి అజిత్‌ పవార్‌ అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. కొత్త సీఎం ఎవరన్నదానిపై బుధవారం ఉదయం కల్లా స్పష్టత వచ్చే అవకాశం ఉందని శివసేన(షిండే) అధికార ప్రతినిధి సంజయ్‌ సిర్సాత్‌ చెప్పారు.

మరోవైపు కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్‌ను ముఖ్యమంత్రిగా నియమించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలిపారు. కానీ, అధికారికంగా ఆయన పేరు ఇంకా ఖరారు చేయలేదని అన్నారు. ఏ పార్టీకి ఎన్ని మంత్రిపదవులు, ఎవరెవరికి ఏయే శాఖలు ఇవ్వాలో నిర్ణయించిన తర్వాతే కొత్త సీఎంను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు బీజేపీని సీనియర్‌ నేత ఒకరు వెల్లడించారు. సీఎం ఎంపిక విషయంలో తమ పార్టీ అధిష్టానం తొందరపడడం లేదని తెలిపారు. మహాయుతిలో ఘర్షణకు తావులేకుండా సామరస్యపూర్వకంగా ముందుకు సాగాలన్నది తమ ఉద్దేశమని వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement