బెంగళూరు: మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా) కుంభకోణం వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో మైసూరు పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ మరిగౌడ తన పదవికి రాజీనామా చేశారు. ఆరోగ్య కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
కాగా మరిగౌడ సీఎం సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడంటూ పేరుంది. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. గత నెలలో మరిగౌడ కారులో బెంగళూరుకు వెళ్తున్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను బెంగళూరులోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం మైసూరుకు తరలించారు. ప్రస్తుతం అనారోగ్యం కారణంగానే రాజీనామా చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే ముడా స్కామ్‌లో చిక్కుకున్న సీఎంపై విచారణ కొనసాగుతున్న వేళ.. మరిగౌడ రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కాగా విజయనగర్‌లోని అప్‌మార్కెట్ మైసూరు ఏరియాలో ఉన్న 14 ప్లాట్‌ల భూమిని తన భార్యకు అక్రమంగా కేటాయించిందన్న ఆరోపణలపై సిద్ధరామయ్య విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కుంభకోణం వ్యవహారానికి సంబంధించి ఈడీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో సీఎం సిద్దరామయ్యసతీమణి పార్వతి తమ భూములను తిరిగి ముడా సంస్థకు ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు.
అవినీతి మరకలేని తన భర్త రాజకీయ జీవితానికి ముప్పు తెస్తున్న ‘ముడా’కు చెందిన 14 ప్లాట్లు తిరిగి అదే సంస్థకు ఇచ్చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. తాను దర్యాప్తుకు కూడా సహకరిస్తానని తెలిపారు. ఇక ఈ స్థలాలను వెనక్కి తీసుకునేందుకు ముడా అధికారులు కూడా అంగీకరించారు.
ఇదిలా ఉండగాా సీఎం సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ అనుమతివ్వడాన్ని హైకోర్టు సమర్ధించిన విషయం తెలిసిందే. కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో సీబీఐ విచారణకు ఆదేశించింది. అనంతరం ఈ కుంభకోణంలో సిద్ధరామయ్యపై విచారణ జరపాలని లోకాయుక్త పోలీసులను ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఈ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా.. సెంట్రల్ ఏజెన్సీ సిద్ధరామయ్యతో పాటు మరికొందరిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR) ద్వారా కేసు నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment