నేడు మహిళల వెయిట్‌లిఫ్టింగ్ 49 కేజీల విభాగం బరిలో భారత స్టార్
గత టోక్యో ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన మీరాబాయి
రాత్రి గం.11:00 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం
పారిస్: మూడేళ్ల క్రితం టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో... పోటీలు ప్రారంభమైన తొలి రోజే భారత్‌కు పతకం అందించి సంబరాల్లో ముంచెత్తిన భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను... బుధవారం ‘పారిస్’ క్రీడల బరిలోకి దిగనుంది. 49 కేజీల విభాగంలో గత ఒలింపిక్స్‌లో 202 కేజీలు (87 కేజీలు+115 కేజీలు) బరువెత్తి రజతం గెలిచిన మీరాబాయిపై ఈసారి కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే కొంతకాలంగా ఫిట్‌నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న చాను.. ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందనేది ఆసక్తికరం. ఒలింపిక్స్ వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో ఇప్పటి వరకు భారత్‌కు రెండు పతకాలు దక్కగా... ఆ రెండూ మహిళా లిఫ్టర్లే గెలిచారు. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో దిగ్గజ లిఫ్టర్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కరణం మల్లీశ్వరి కాంస్య పతకం సాధించగా... టోక్యోలో మీరాబాయి రజతం నెగ్గింది. గత ఒలింపిక్స్‌లో మెరుపులు మెరిపించిన మీరాబాయి.. ఆ తర్వాత గాయాల బారిన పడి అదే స్థాయి ప్రదర్శన కొనసాగించలేకపోయింది.
2022 కామన్వెల్త్ క్రీడల్లో మాత్రమే 200 కేజీల మార్కు దాటగ లిగింది. ఇక తాజాగా ‘పారిస్’ క్రీడల్లో మీరాబాయి ఎంట్రీ వెయిట్ 200 కేజీలుగా నమోదు చేసుకుంది. ఒలింపిక్ డిఫెండింగ్ చాంపియన్ హో జీహుయి (చైనా), డెలాక్రజ్ (అమెరికా), సురోచన ఖామ్‌బో (థాయ్‌లాండ్), మిహేలా కామ్‌బెయి (రొమేనియా) మీరాకన్నా మెరుగైన ఎంట్రీ వెయిట్ నమోదు చేసుకున్నారు. ఈసారి పోటీల తీవ్రతను బట్టి చూస్తే.. మీరాబాయి తన అత్యుత్తమ ప్రదర్శన (205 కేజీలు) కనబర్చగలిగితేనే పతకం రేసులో నిలిచే అవకాశాలు ఉన్నాయి.
చైనా లిఫ్టర్ హో జీహుయి మరోసారి స్వర్ణంపై గురి పెట్టింది. మీరాబాయి గాయం నుంచి పూర్తిగా కోలుకుందని కోచ్ విజయ్ శర్మ పేర్కొన్నారు. ‘మీరా 200 కేజీలు సునాయాసంగా దాటగలదు. టోక్యో ఒలింపిక్స్‌లో ఎత్తిన 202 కేజీల బరువును మించిన ప్రదర్శన చేస్తుంది. సవాలు స్వీకరించేందుకు చాను సిద్ధంగా ఉంది’ అని విజయ్ శర్మ అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment