
బడ్జెట్‌పై భారీ ఆశలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ :
సుమారు నెల రోజుల పాటు కొనసాగే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తొలి బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. సుదీర్ఘ పోరాటాలు, ఉద్యమాల ఫలితంగా ఏర్పడిన రాష్ట్ర తొలి బడ్జెట్ ప్రతిపాదనలపై జన సామాన్యంలో భారీ ఆశలు నెలకొన్నాయి. ‘బంగారు తెలంగాణ’ కల నెరవేర్చే దిశగా బడ్జెట్‌లో ప్రభుత్వ ప్రతిపాదనలపై ఆసక్తి నెలకొంది. కరువు, కరెంటు కోతలు, గిట్టుబా టు ధరలు తదితర అంశాలపై ప్రజాప్రతిని ధుల స్పందన కీలకం కానున్నది.
సాగు కలిసిరాక ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులకు పరిహారం చెల్లింపుపై ప్రకటన కోసం బాధిత కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. వాటర్ గ్రి డ్, చెరువుల పునరుద్ధరణ, రోడ్ల మరమ్మతు వంటి భారీ ప్రణాళికలు ఓ వైపు భవిష్యత్తుపై భరోసా కల్పిస్తున్నాయి. పింఛన్లు, రేషను కా ర్డుల జారీ ప్రక్రియ ప్రహసనంగా మారడంపై లబ్ధిదారుల్లో అసంతృప్తి పెల్లుబుకుతోంది. ఈ నేపథ్యంలో సాగుతున్న అసెంబ్లీ తొలి బడ్జెట్ సమావేశంలో చర్చించే అంశాలు, ప్రతిపాదనలపై అన్ని వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
రోడ్ల నిర్మాణానికి నిధుల కోసం ప్రయత్నిస్తా
తొలి బడ్జెట్ తెలంగాణ ప్రజల భవిష్యత్తుకు పునాది. బడ్జెట్ ప్రతిపాదనల్లో జిల్లాకు పెద్దపీట వేస్తారని భావిస్తున్నా. పెండింగు ప్రాజెక్టులు పూర్తి చేయడంతో పాటు జడ్చర్ల నియోజకవర్గానికి మేలు జరిగేలా కేటాయింపులుంటాయి. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా నియోజకవర్గానికి సాగునీరు అందించే అవకాశముంది. రోడ్ల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించేలా ప్రయత్నిస్తా.
-సి.లక్ష్మారెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే
ఎక్కువ నిధులివ్వాలని కోరతా
అన్ని నియోజకవర్గాల కంటే జిల్లా కేంద్రానికే ఎక్కువ నిధులు మంజూరు చెయ్యాలని కోరతా. నీటి సమస్య పరిష్కారానికి గతంలో పంపిన ప్రణాళికలను మంజూరు చేయించుకొని, వాటి ద్వారా చేపట్టాల్సిన పనులు పూర్తి చేసేందుకు కృష చేస్తా. నియోజకవర్గ పరిధిలో ఎక్కడా నీటి సమస్య తలెత్తకుండా చూస్తా. రోడ్లు, ఇతరత్రా అభివృ్ధకి కావాల్సిన నిధులను ఈ బడ్జెట్‌లోనే మంజూరయ్యేలా సీఎంను కోరతా.
-శ్రీనివాస్‌గౌడ్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే
విద్యుత్ సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీస్తా
కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి బడ్జెట్ కేటాయింపులు లేకపోవడంతో గడువు పూర్తయినా పనులు పూర్తి కావడం లేదు. వాటర్‌గ్రిడ్‌లో కలపకుండా ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తించాలని కోరతా. కొత్తగా పాల కేంద్రాల ఏర్పాటు, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఒత్తిడి తెస్తా. విద్యుత్ సమస్య తీర్చేందుకు శాశ్వత ప్రాతిపదికన తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తా.
-చల్లా వంశీచంద్‌రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే
రైతు సమస్యలు ప్రస్తావిస్తా
పంటలు నష్టపోయి ఆర్థికంగా చితికిపోయిన రైతుల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా. నాగర్‌కర్నూల్ తాలుకాను కరువు ప్రాంతంగా ప్రకటించే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, నాగర్‌కర్నూల్‌లో ఇంజనీరింగ్ కళాశాల, డ్రైనేజీ, సీసీరోడ్లు వంటి సమస్యలను ప్రస్తావిస్తా. 220 కేవీ, 132 కేవీ సబ్‌స్టేషన్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుపై మాట్లాడుతా.
-మర్రి జనార్దన్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే
రోడ్ల నిర్మాణానికి నిధులు కోరతా
జిల్లా, నియోజకవర్గ అృవద్ధికి తొలి బడ్జెట్ పునాది వేస్తుందని ఆశిస్తున్నా. రోడ్ల నిర్మాణానికి నిధులు కోరతా. కోయిల్‌సాగర్, రామన్‌పాడు, శంకరసముద్రం రిజర్వాయర్ల పూర్తికి నిధులు ఇవ్వాలని ఇప్పటికే ప్రతిపాదించా. సాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వాన్ని సాయం కోరతా. చెరువుల పునరుద్ధరణకు అవసరమైన నిధులు సాధిస్తా. పాలమూరు ఎత్తిపోతల పథకానికి నిధులు రాబడతాం.
ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే
రైతు రుణమాఫీ గురించి ప్రస్తావిస్తా
రైతుల రుణమాఫీ గురించి ప్రశ్నిస్తా. ఆంధ్రప్రదేశ్ లో అనంతపూర్ జిల్లాకు రుణమాఫీలో కొంత వెసులుబాటు దక్కింది. అదే తరహాలో మన జిల్లాకు కూడా నిబంధనలు సడలించి రుణమాఫీ ద్వారా రైతులను ఆదుకునే అంశాన్ని ప్రస్తావిస్తా. అనంతపూర్‌లో 10ఎకరాలు మాగాణి లేదా 5ఎకరాలు తరి పొలం ఉన్న రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ వర్తించేలా చర్యలు తీసుకొంది.
-రేవంత్‌రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే
జూరాల-పాకాలను వ్యతిరేకిస్తా
విద్యుత్ కొరత మూలంగా పంటలు ఎండి రైతులు తీవ్రంగా నష్టపోయారు. తాగునీటి కొరత కూడా తీవ్రంగా ఉంది. పాలమూరు ఎత్తిపోతల పథకం చేపట్టేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి అనుమతి ఇస్తూ కృష్ణా జలాల్లో ఎనిమిది టీఎంసీల వాటా కేటాయించారు. అయితే ప్రభుత్వం కొత్తగా జూరాల-పాకాల అంటూ చేస్తున్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తాం. రుణమాఫీపై నిలదీస్తాం.
- రాజేందర్‌రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే
సాగు, తాగునీటిపై చర్చిస్తా
నియోజకవర్గంలో నెలకొన్న సాగు, తాగునీటి సమస్య పరిష్కారానికి అసెంబ్లీలో మాట్లాడతా. అచ్చంపేటలో వంద పడకల అస్పత్రి నిర్మాణం, భూత్పూర్ నుంచి శ్రీశైలం వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం, పాలెం అగ్రికల్చర్ రీచర్స్ సెంటర్ ఏర్పాటుతో పాటు హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిలో ఇండస్టీయల్ కారిడార్ ఏర్పాటును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా.
-గువ్వల బాలరాజు, అచ్చంపేట ఎమ్మెల్యే
రోడ్ల విస్తరణపై మాట్లాడతా
వనపర్తి పట్టణంలోని ప్రధాన రహదారులను నాలుగు లేన్లుగా విస్తరించాల్సిన ఆవశ్యకతను ప్రస్తావిస్తా. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని గుడిపల్లి గట్టు నుంచి గోపాల్‌పేట, ఖిల్లాఘణపురం మండలాలలకు సాగు నీరందించేందుకు నిధులు రాబడతా. వాటర్‌గ్రిడ్ ద్వారా వనపర్తి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు తాగునీటి పథకాలు, గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణలో భాగంగా నిధులు కోరతా.
- జి.చిన్నారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే
సాగు, తాగునీరు, విద్యుత్‌పై మాట్లాడతా
అసెంబ్లీ సమావేశాల్లో తాగు, సాగునీరు, విద్యుత్, రుణమాఫీ పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల విషయాన్ని ప్రస్తావిస్తా. భీమా ప్రాజెక్టు, చంద్రఘడ్, నాగిరెడ్డిపల్లి, బెక్కర్‌పల్లి లిఫ్టిరిగేషన్‌ల పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. నియోజకవర్గంలో రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణంతో పాటు గ్రామాల్లో డ్రైనేజీలు, సీసీరోడ్ల నిర్మాణానికి నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తా.
- చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే
కరువు ప్రాంతంగా ప్రకటించేలా కృషి
ఎత్తై ప్రాంతంలో ఉండడంతో నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. వర్షాభావ పరిస్థితుల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నియోజకవర్గంలోని అన్ని మండలాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరతా. షాద్‌నగర్ పట్టణంలో మెట్రో వాటర్ వర్క్స్ ద్వారా తాగు నీరు అందించాలని కోరతా.
- అంజయ్య యాదవ్, షాద్‌నగర్ ఎమ్మెల్యే
విప్ హోదాలో సమస్యలు లేవనెత్తుతా :
ఆర్డీఎస్ అంశంతో పాటు రాష్ట్ర విభజన మూలంగా సరిహద్దు నియోజకవర్గంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఆర్టీసీ డిపో, ఫైర్ స్టేషన్, విద్యుత్ సబ్‌స్టేషన్లు, గ్రామీణ రోడ్ల నిర్మాణం, 2009 వరదల్లో నష్టపోయిన వారి పునరావాసం వంటి అంశాలను అసెంబ్లీలో ప్రస్తావిస్తా. కాంగ్రెస్ లెజిస్లేచర్ విప్ హోదాలో ఇతర సమస్యలను లేవనెత్తుతా.
- సంపత్‌కుమార్, అలంపూర్ ఎమ్మెల్యే
అభివృద్ధిపై మాట్లాడతా
అభివృద్ధి అంశాలపై సమావేశంలో మాట్లాడతా. విద్య, వైద్యం, రోడ్లు, పర్యాటకం, తాగు, సాగునీటి సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తా. కొల్లాపూర్ నుంచి పెబ్బేరు, కొల్లాపూర్ నుంచి వనపర్తి వరకూ డబుల్‌లైన్ రహదారుల నిర్మాణాలకు నిధుల మంజూరు కోరతా. కొల్లాపూర్‌లో పీజీ, డీగ్రీ కళాశాల భవనాల నిర్మాణం, ఎంజీఎల్‌ఐ ప్రాజెక్టు పనులపై చర్చిస్తా.
-జూపల్లి కృష్ణారావు, కొల్లాపూర్ ఎమ్మెల్యే