The first budget session
-
బడ్జెట్‌పై భారీ ఆశలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : సుమారు నెల రోజుల పాటు కొనసాగే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తొలి బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. సుదీర్ఘ పోరాటాలు, ఉద్యమాల ఫలితంగా ఏర్పడిన రాష్ట్ర తొలి బడ్జెట్ ప్రతిపాదనలపై జన సామాన్యంలో భారీ ఆశలు నెలకొన్నాయి. ‘బంగారు తెలంగాణ’ కల నెరవేర్చే దిశగా బడ్జెట్లో ప్రభుత్వ ప్రతిపాదనలపై ఆసక్తి నెలకొంది. కరువు, కరెంటు కోతలు, గిట్టుబా టు ధరలు తదితర అంశాలపై ప్రజాప్రతిని ధుల స్పందన కీలకం కానున్నది. సాగు కలిసిరాక ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులకు పరిహారం చెల్లింపుపై ప్రకటన కోసం బాధిత కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. వాటర్ గ్రి డ్, చెరువుల పునరుద్ధరణ, రోడ్ల మరమ్మతు వంటి భారీ ప్రణాళికలు ఓ వైపు భవిష్యత్తుపై భరోసా కల్పిస్తున్నాయి. పింఛన్లు, రేషను కా ర్డుల జారీ ప్రక్రియ ప్రహసనంగా మారడంపై లబ్ధిదారుల్లో అసంతృప్తి పెల్లుబుకుతోంది. ఈ నేపథ్యంలో సాగుతున్న అసెంబ్లీ తొలి బడ్జెట్ సమావేశంలో చర్చించే అంశాలు, ప్రతిపాదనలపై అన్ని వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. రోడ్ల నిర్మాణానికి నిధుల కోసం ప్రయత్నిస్తా తొలి బడ్జెట్ తెలంగాణ ప్రజల భవిష్యత్తుకు పునాది. బడ్జెట్ ప్రతిపాదనల్లో జిల్లాకు పెద్దపీట వేస్తారని భావిస్తున్నా. పెండింగు ప్రాజెక్టులు పూర్తి చేయడంతో పాటు జడ్చర్ల నియోజకవర్గానికి మేలు జరిగేలా కేటాయింపులుంటాయి. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా నియోజకవర్గానికి సాగునీరు అందించే అవకాశముంది. రోడ్ల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించేలా ప్రయత్నిస్తా. -సి.లక్ష్మారెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే ఎక్కువ నిధులివ్వాలని కోరతా అన్ని నియోజకవర్గాల కంటే జిల్లా కేంద్రానికే ఎక్కువ నిధులు మంజూరు చెయ్యాలని కోరతా. నీటి సమస్య పరిష్కారానికి గతంలో పంపిన ప్రణాళికలను మంజూరు చేయించుకొని, వాటి ద్వారా చేపట్టాల్సిన పనులు పూర్తి చేసేందుకు కృష చేస్తా. నియోజకవర్గ పరిధిలో ఎక్కడా నీటి సమస్య తలెత్తకుండా చూస్తా. రోడ్లు, ఇతరత్రా అభివృ్ధకి కావాల్సిన నిధులను ఈ బడ్జెట్లోనే మంజూరయ్యేలా సీఎంను కోరతా. -శ్రీనివాస్‌గౌడ్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే విద్యుత్ సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీస్తా కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి బడ్జెట్ కేటాయింపులు లేకపోవడంతో గడువు పూర్తయినా పనులు పూర్తి కావడం లేదు. వాటర్‌గ్రిడ్‌లో కలపకుండా ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తించాలని కోరతా. కొత్తగా పాల కేంద్రాల ఏర్పాటు, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఒత్తిడి తెస్తా. విద్యుత్ సమస్య తీర్చేందుకు శాశ్వత ప్రాతిపదికన తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తా. -చల్లా వంశీచంద్‌రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే రైతు సమస్యలు ప్రస్తావిస్తా పంటలు నష్టపోయి ఆర్థికంగా చితికిపోయిన రైతుల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా. నాగర్‌కర్నూల్ తాలుకాను కరువు ప్రాంతంగా ప్రకటించే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, నాగర్‌కర్నూల్‌లో ఇంజనీరింగ్ కళాశాల, డ్రైనేజీ, సీసీరోడ్లు వంటి సమస్యలను ప్రస్తావిస్తా. 220 కేవీ, 132 కేవీ సబ్‌స్టేషన్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుపై మాట్లాడుతా. -మర్రి జనార్దన్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే రోడ్ల నిర్మాణానికి నిధులు కోరతా జిల్లా, నియోజకవర్గ అృవద్ధికి తొలి బడ్జెట్ పునాది వేస్తుందని ఆశిస్తున్నా. రోడ్ల నిర్మాణానికి నిధులు కోరతా. కోయిల్‌సాగర్, రామన్‌పాడు, శంకరసముద్రం రిజర్వాయర్ల పూర్తికి నిధులు ఇవ్వాలని ఇప్పటికే ప్రతిపాదించా. సాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వాన్ని సాయం కోరతా. చెరువుల పునరుద్ధరణకు అవసరమైన నిధులు సాధిస్తా. పాలమూరు ఎత్తిపోతల పథకానికి నిధులు రాబడతాం. ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే రైతు రుణమాఫీ గురించి ప్రస్తావిస్తా రైతుల రుణమాఫీ గురించి ప్రశ్నిస్తా. ఆంధ్రప్రదేశ్ లో అనంతపూర్ జిల్లాకు రుణమాఫీలో కొంత వెసులుబాటు దక్కింది. అదే తరహాలో మన జిల్లాకు కూడా నిబంధనలు సడలించి రుణమాఫీ ద్వారా రైతులను ఆదుకునే అంశాన్ని ప్రస్తావిస్తా. అనంతపూర్‌లో 10ఎకరాలు మాగాణి లేదా 5ఎకరాలు తరి పొలం ఉన్న రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ వర్తించేలా చర్యలు తీసుకొంది. -రేవంత్‌రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే జూరాల-పాకాలను వ్యతిరేకిస్తా విద్యుత్ కొరత మూలంగా పంటలు ఎండి రైతులు తీవ్రంగా నష్టపోయారు. తాగునీటి కొరత కూడా తీవ్రంగా ఉంది. పాలమూరు ఎత్తిపోతల పథకం చేపట్టేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి అనుమతి ఇస్తూ కృష్ణా జలాల్లో ఎనిమిది టీఎంసీల వాటా కేటాయించారు. అయితే ప్రభుత్వం కొత్తగా జూరాల-పాకాల అంటూ చేస్తున్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తాం. రుణమాఫీపై నిలదీస్తాం. - రాజేందర్‌రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే సాగు, తాగునీటిపై చర్చిస్తా నియోజకవర్గంలో నెలకొన్న సాగు, తాగునీటి సమస్య పరిష్కారానికి అసెంబ్లీలో మాట్లాడతా. అచ్చంపేటలో వంద పడకల అస్పత్రి నిర్మాణం, భూత్పూర్ నుంచి శ్రీశైలం వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం, పాలెం అగ్రికల్చర్ రీచర్స్ సెంటర్ ఏర్పాటుతో పాటు హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిలో ఇండస్టీయల్ కారిడార్ ఏర్పాటును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. -గువ్వల బాలరాజు, అచ్చంపేట ఎమ్మెల్యే రోడ్ల విస్తరణపై మాట్లాడతా వనపర్తి పట్టణంలోని ప్రధాన రహదారులను నాలుగు లేన్లుగా విస్తరించాల్సిన ఆవశ్యకతను ప్రస్తావిస్తా. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని గుడిపల్లి గట్టు నుంచి గోపాల్పేట, ఖిల్లాఘణపురం మండలాలలకు సాగు నీరందించేందుకు నిధులు రాబడతా. వాటర్‌గ్రిడ్ ద్వారా వనపర్తి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు తాగునీటి పథకాలు, గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణలో భాగంగా నిధులు కోరతా. - జి.చిన్నారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే సాగు, తాగునీరు, విద్యుత్‌పై మాట్లాడతా అసెంబ్లీ సమావేశాల్లో తాగు, సాగునీరు, విద్యుత్, రుణమాఫీ పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల విషయాన్ని ప్రస్తావిస్తా. భీమా ప్రాజెక్టు, చంద్రఘడ్, నాగిరెడ్డిపల్లి, బెక్కర్‌పల్లి లిఫ్టిరిగేషన్ల పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. నియోజకవర్గంలో రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణంతో పాటు గ్రామాల్లో డ్రైనేజీలు, సీసీరోడ్ల నిర్మాణానికి నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తా. - చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే కరువు ప్రాంతంగా ప్రకటించేలా కృషి ఎత్తై ప్రాంతంలో ఉండడంతో నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. వర్షాభావ పరిస్థితుల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నియోజకవర్గంలోని అన్ని మండలాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరతా. షాద్‌నగర్ పట్టణంలో మెట్రో వాటర్ వర్క్స్ ద్వారా తాగు నీరు అందించాలని కోరతా. - అంజయ్య యాదవ్, షాద్‌నగర్ ఎమ్మెల్యే విప్ హోదాలో సమస్యలు లేవనెత్తుతా : ఆర్డీఎస్ అంశంతో పాటు రాష్ట్ర విభజన మూలంగా సరిహద్దు నియోజకవర్గంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఆర్టీసీ డిపో, ఫైర్ స్టేషన్, విద్యుత్ సబ్స్టేషన్లు, గ్రామీణ రోడ్ల నిర్మాణం, 2009 వరదల్లో నష్టపోయిన వారి పునరావాసం వంటి అంశాలను అసెంబ్లీలో ప్రస్తావిస్తా. కాంగ్రెస్ లెజిస్లేచర్ విప్ హోదాలో ఇతర సమస్యలను లేవనెత్తుతా. - సంపత్‌కుమార్, అలంపూర్ ఎమ్మెల్యే అభివృద్ధిపై మాట్లాడతా అభివృద్ధి అంశాలపై సమావేశంలో మాట్లాడతా. విద్య, వైద్యం, రోడ్లు, పర్యాటకం, తాగు, సాగునీటి సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తా. కొల్లాపూర్ నుంచి పెబ్బేరు, కొల్లాపూర్ నుంచి వనపర్తి వరకూ డబుల్‌లైన్ రహదారుల నిర్మాణాలకు నిధుల మంజూరు కోరతా. కొల్లాపూర్‌లో పీజీ, డీగ్రీ కళాశాల భవనాల నిర్మాణం, ఎంజీఎల్‌ఐ ప్రాజెక్టు పనులపై చర్చిస్తా. -జూపల్లి కృష్ణారావు, కొల్లాపూర్ ఎమ్మెల్యే -
ఎన్నో ఆశలు..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : కొత్త రాష్ట్రం.. కొత్త ఆశలు.. తొలి బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ఇందూరుకు ఏ మేరకు ప్రాతినిధ్యం కల్పిస్తుందన్న చర్చ సర్వత్రా సాగుతోంది. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మిగతా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీకి చెందిన వారే కాగా, జిల్లా ప్రజల పక్షాన అసెంబ్లీలో మాట్లాడే ప్రతిపక్షం లేకుండా పోయింది. తెలంగాణ తొలి అసెంబ్లీకి అందరూ కొత్తవారే కాగా, ఎమ్మెల్యేలుగా మొదటిసారి ఎన్నికైన నలుగురు కొత్తగా శాసనసభలో అడుగుపెట్టనున్నారు. ఆర్మూరు, నిజామాబాద్ అర్బన్, బోధన్, బాల్కొండ నియోజకవర్గాల నుంచి ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బిగాల గణేశ్‌గుప్త, షకీల్ అహ్మద్, వేముల ప్రశాంత్‌రెడ్డిలు తొలిసారిగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారిలో ఉన్నారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నిజామాబాద్ రూరల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గంప గోవర్ధన్, ఏనుగు రవీందర్‌రెడ్డి, హన్మంత్‌సింధేలు ఇదివరకు ఎమ్మెల్యేలుగా శాసనసభలకు వెళ్లిన వారే. కాగా శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాల్లో ఉన్న పెండింగ్ సమస్యలపై ఎమ్మెల్యేలు జాబితా రూపొందించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు అసంపూర్తి, పెండింగ్ పనులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అధికారి పార్టీ ఎమ్మెల్యేలైనా అసెంబ్లీ వేదికగా చేసుకోవాలని భావించారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, ఏనుగు రవీందర్‌రెడ్డి, బిగాల గణేశ్‌గుప్తా, హన్మంత్‌సింధే, గంప గోవర్ధన్, మహ్మద్ షకీల్, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, వి.ప్రశాంత్‌రెడ్డిలు భేటీ అయ్యారు. జిల్లాకు సంబంధించిన పలు సమస్యలు, అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదిలా వుంటే శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో జిల్లాకు చెందిన ఏ అంశాలు ప్రస్తావనకు వస్తాయి? నిత్యకృత్యంగా మారిన అంటువ్యాధులు, మరణాలకు పరిష్కారం కోరుతారా? ఉచిత కరెంట్, విద్యుత్ కోతలు, అసంపూర్తి ప్రాజెక్టులపై మన ఎమ్మెల్యేలు ఏం మాట్లాడతారు? అన్న చర్చ సర్వత్రా సాగుతోంది. -
మీపైనే.. ఆశ
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : వైద్యం అందక జ్వరాల బారిన పడి పిట్టల్లా రాలుతున్న జనం.. కనీస మద్దతు ధరల కోసం రోడ్డెక్కుతున్న అన్నదాతలు.. రోడ్లు, తాగు నీరు వంటి కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోని గిరిజనం.. ఖరీఫ్‌ను కాటేసిన కరువు.. రైతుల బలవన్మరణాలు.. ఇలా జిల్లా వాసులు పలు సమస్యలతో సతమతమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర తొలి బడ్జెట్‌పై జిల్లా వాసులు కోటి ఆశలు పెట్టుకున్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో తమ సమస్యలపై ఎమ్మెల్యేలు గళం విప్పాలని కోరుతున్నారు. జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న రాష్ట్ర అటవీ శాఖ మంత్రిగా జోగు రామన్న తన శాఖకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. కొత్తగా ఎన్నికైన ఐదుగురు ఎమ్మెల్యేలు రేఖా శ్యాంనాయక్ (ఖానాపూర్), రాథోడ్ బాపురావు (బోథ్), జి.విఠల్ రెడ్డి (ముథోల్), దుర్గం చిన్నయ్య (బెల్లంపల్లి), కోవ లక్ష్మి (ఆసిఫాబాద్)లకు ఇది తొలి సమావేశాలు కావడం గమనార్హం. జిల్లా ఎమ్మెల్యేలంతా అధికార పార్టీకి చెందిన వారే కావడంతో సమస్యలపై ఏ మేరకు గళం విప్పుతారో వేచిచూడాల్సి ఉంది. మంచం పట్టిన గోండు గూడాలు.. జిల్లాలో జ్వర మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. డెంగీ, మలేరియా, విష జ్వరాల బారిన పడి పదుల సంఖ్యలో నిరుపేదలు మరణిస్తున్నారు. ముఖ్యంగా గోండు గూడాలు మంచం పట్టాయి. ఇంటికి ఒకరిద్దరు చొప్పున జ్వరాలతో బాధపడుతున్నారు. నిరుపేదలకు వైద్యం అందించాల్సిన సర్కారు చేతులెత్తేస్తోంది. ఇప్పటివరకు డెంగీతో పదుల సంఖ్యలో మరణాలు సంభవించినప్పటికీ అసలు డెంగీ మరణాలే లేవని డిప్యూటీ సీఎం, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.రాజయ్య ఇటీవల జిల్లా పర్యటనలో ప్రకటించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. క్షేత్ర స్థాయిలో వైద్య సేవలు అందించే పీహెచ్‌సీల్లో సుమారు 50కి పైగా వైద్యాధికారుల పోస్టులు ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. చాలీ చాలని మందుల బడ్జెట్‌తో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రాథమిక చికిత్సకు కూడా గిరిజనులు నోచుకోవడం లేదు. దేవుడిపైనే భారం వేస్తున్నారు. ఈ బడ్జెట్లో గిరిజనులకు వైద్యసేవలు అందించడం పై ప్రత్యేక దృష్టిసారించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పడిపోయిన దిగుబడి.. అందని మద్దతు.. తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని పంటలు పండించిన రైతులకు దిగుబడి రాక తీవ్రంగా నష్టపోయారు. సోయా ఎకరానికి రెండు క్వింటాళ్లు కూడా దిగుబడి రాలేదు. నకిలీ విత్తనాలతో నష్టపోయిన ఈ రైతాంగాన్ని ఆదుకోవాలని ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఇటీవల జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్కు ఫిర్యాదు చేశారంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మరోవైపు పత్తికి కనీస మద్దతు ధర దక్కడం లేదు. నాణ్యత పేరుతో సీసీఐ చేతులెత్తేయగా, దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేటు వ్యాపారులు దోపిడీ చేస్తున్నారు.ఎంఎస్పీలో క్వింటాలుకు రూ.500 వరకు కోత విధించి పత్తిని కోనుగోలు చేస్తున్నారు. దీంతో పెట్టిన పెట్టుబడులు కూడా అందడం లేదని వాపోతున్నారు. ప్రకృతి వైపరీత్యాలకు తోడు.. మద్దతు ధర దక్కకపోవడం.. దిగుబడులు పడిపోయి.. అప్పుల భారం పెరగడంతో మనస్థాపం చెందుతున్న అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గత ఐదు నెలల్లో జిల్లాలో సుమారు 32 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రాష్ట్ర సర్కారు స్పందించాలని రైతులు కోరుతున్నారు. మౌలిక సదుపాయాలు కరువు.. జిల్లాలో మారుమూల ప్రాంతాల వాసులు కనీస సదుపాయాలకు నోచుకోవడం లేదు. ఇప్పటికీ కరెంట్ లేని గోండు గూడాలున్నాయి. పైగా రహదారుల పరిస్థితి దారుణంగా ఉంది. తాగునీటి కోసం గిరిజనులు కిలో మీటర్ల దూరం నడవాల్సి వస్తోంది. మౌళిక సదుపాయాల కల్పన కోసం వస్తున్న నిధులు సద్వినియోగం కాకపోవడంతో గిరిజనులు సమస్యలతోనే సహజీవనం చేయాల్సి వస్తోంది. ముఖ్యంగా రోడ్డు సౌకర్యం లేక అనేక గ్రామాలకు అంబులెన్సులు కూడా వెళ్ల లేని పరిస్థితి. అత్యవసర పరిస్థితుల్లో ఎడ్ల బండ్లపై బాధితులను ఆసుపత్రికి తరలించాల్సి వస్తోంది. మన ఊరు.. మన ప్రణాళిక..లో ఈ మౌళిక సదుపాయాల కోసం చేసిన ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. బడ్జెట్లో మౌళిక సదుపాయాలకు పెద్ద పీట వేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాగునీటి ప్రాజెక్టులు.. జలయజ్ఞంలో భాగంగా జిల్లాలో చేపట్టిన పలు సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడంతో అవి నిరుపయోగంగా ఉన్నాయి. కొద్ది మొత్తంలో నిధులు కేటాయించి పెండింగ్ పనులను పూర్తి చేస్తే ఆయకట్టుకు సాగునీరందే అవకాశాలున్నాయి. ముఖ్యంగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 90 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. అలాగే గొల్లవాగు ప్రాజెక్టు వంటి ప్రాజెక్టు పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈ బడ్జెట్ కేటాయింపుల్లో ఈ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి పనులను పూర్తి చేయడం ద్వారా ఆయకట్టుకు సాగు నీరందించవచ్చనే అభిప్రాయం ఆయకట్టు రైతుల నుంచి వ్యక్తమవుతోంది. -
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
-
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమైన అధికార, ప్రతిపక్షాలు 20న సాధారణ బడ్జెట్.. 22న వ్యవసాయ బడ్జెట్ హైదరాబాద్: అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహప్రతివ్యూహాల మధ్య సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ, శాసన మండలి తొలి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి చేయడానికి ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ సిద్ధమైంది. ఎలాంటి షరతులు లేకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయ, డ్వాక్రా రుణాలను రద్దు చేస్తామన్న హామీని నిలబెట్టుకోకుండా రెండున్నర నెలలుగా దాటవేత వైఖరిని ప్రదర్శించడాన్నే ప్రధాన అస్త్రంగా ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రతిపక్షం సిద్ధమైంది. ఈ సమావేశాలను వచ్చే నెల 12 వరకు నిర్వహించాలని ముందుగా భావించారు. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, స్పీకర్లతో ఆదివారం గవర్నర్ నిర్వహించిన సమావేశంలో జరిగిన చర్చల మేరకు సమావేశాలను కుదించారు. వచ్చే నెల 10వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో ఏపీ శాసన సభ సమావేశాలను 6వ తేదీతో ముగించాలని నిర్ణయించారు. రెండు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు ఒకేసారి జరిగితే అసౌకర్యం కలుగుతుందని గవర్నర్ నరసింహన్ ఇరు రాష్ట్రాల సీఎంలు, స్పీకర్ల సమావేశంలో ప్రస్తావించారు. తేదీల్లో మార్పులు చేసుకోవాలని, ఈ విషయంలో ఎటువంటి వివాదాలకు తావివ్వరాదని సూచించారు. దీనికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్పందిస్తూ వచ్చే నెల 6వ తేదీతో సమావేశాలు ముగిస్తామని, అదే రోజు సభను నిరవధికంగా వాయిదా వేస్తామని చెప్పారు. శనివారాలు కూడా సభ నిర్వహిస్తామని, ఆదివారాలు, వినాయక చవితికి మాత్రమే సెలవులుంటాయని, ఇలా చేస్తే నిబంధనల మేరకు సభ జరిగే రోజులు సరిపోతాయని తెలిపారు. సోమవారం ఉదయం 8 గంటలకు సభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశమవుతుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై చర్చిస్తుంది. 9 గంటలకు బడ్జెట్ సమావేశాలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభమవుతాయి. 20న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఏపీకి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవే శపెడతారు. మండలిలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 22న వ్యవసాయ బడ్జెట్ పేరుతో వ్యవసాయ అనుబంధ రంగాల కేటాయింపులతో కూడిన కార్యచరణ ప్రణాళికను వ్యవసాయ మంత్రి అసెంబ్లీలో ప్రవేశపెడతారు. సోమవారం ప్రభుత్వం మూడు ఆర్డినెన్స్‌ల స్థానంలో బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఆంధ్రప్రదేశ్ పోలీసు సంస్కరణల చట్టంలో సవరణలు, వ్యవసాయ మార్కెటింగ్ చట్టంలో సవరణలు, దేవాదాయ చట్టంలో సవరణలకు సంబంధించి గతంలో జారీ చేసిన ఆర్డినెన్స్‌ల స్థానంలో బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ సమావేశాల్లో సీఎం చంద్రబాబు విజన్-2029 డాక్యుమెంట్‌తో పాటు ఏడు రంగాల మిషన్లపై ప్రసంగించాలనే వ్యూహంలో ఉన్నారు.