ఎన్నో ఆశలు.. | telangana first budget meetings | Sakshi
Sakshi News home page

ఎన్నో ఆశలు..

Published Wed, Nov 5 2014 3:42 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

telangana first budget meetings

 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : కొత్త రాష్ట్రం.. కొత్త ఆశలు.. తొలి బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ఇందూరుకు ఏ మేరకు ప్రాతినిధ్యం కల్పిస్తుందన్న చర్చ సర్వత్రా సాగుతోంది. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మిగతా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు  అధికార పార్టీకి చెందిన వారే కాగా, జిల్లా ప్రజల పక్షాన అసెంబ్లీలో మాట్లాడే ప్రతిపక్షం లేకుండా పోయింది.

తెలంగాణ తొలి అసెంబ్లీకి అందరూ కొత్తవారే కాగా, ఎమ్మెల్యేలుగా మొదటిసారి ఎన్నికైన నలుగురు కొత్తగా శాసనసభలో అడుగుపెట్టనున్నారు. ఆర్మూరు, నిజామాబాద్ అర్బన్, బోధన్, బాల్కొండ నియోజకవర్గాల నుంచి ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బిగాల గణేశ్‌గుప్త, షకీల్ అహ్మద్, వేముల ప్రశాంత్‌రెడ్డిలు తొలిసారిగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారిలో ఉన్నారు.

మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నిజామాబాద్ రూరల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గంప గోవర్ధన్, ఏనుగు రవీందర్‌రెడ్డి, హన్మంత్‌సింధేలు ఇదివరకు ఎమ్మెల్యేలుగా శాసనసభలకు వెళ్లిన వారే. కాగా శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాల్లో ఉన్న పెండింగ్ సమస్యలపై ఎమ్మెల్యేలు జాబితా రూపొందించారు.

గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు అసంపూర్తి, పెండింగ్ పనులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అధికారి పార్టీ ఎమ్మెల్యేలైనా అసెంబ్లీ వేదికగా చేసుకోవాలని భావించారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, ఏనుగు రవీందర్‌రెడ్డి, బిగాల గణేశ్‌గుప్తా, హన్మంత్‌సింధే, గంప గోవర్ధన్, మహ్మద్ షకీల్, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, వి.ప్రశాంత్‌రెడ్డిలు భేటీ అయ్యారు.

 జిల్లాకు సంబంధించిన పలు సమస్యలు, అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదిలా వుంటే శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో జిల్లాకు చెందిన ఏ అంశాలు ప్రస్తావనకు వస్తాయి? నిత్యకృత్యంగా మారిన అంటువ్యాధులు, మరణాలకు పరిష్కారం కోరుతారా? ఉచిత కరెంట్, విద్యుత్ కోతలు, అసంపూర్తి ప్రాజెక్టులపై మన ఎమ్మెల్యేలు ఏం మాట్లాడతారు? అన్న చర్చ సర్వత్రా సాగుతోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement