ప్రతీకాత్మక చిత్రం
ఆర్మూర్ : దేశ చరిత్రలో మొట్ట మొదటిసారిగా పంటల సాగుకు పెట్టుబడి సాయం అందజేసిన ప్రభుత్వం.. అన్నదాతలకు తాజాగా రైతు బీమా పథకం పేరిట మరో కానుక తీసుకొచ్చింది. పగలు, రాత్రనే తేడా లేకుండా పంటపొలాల వెంట తిరిగే రైతులకు ‘బీమా’ ధీమా కల్పించాలని సర్కారు నిర్ణయించింది.
ఈ మేరకు సీఎం కేసీఆర్ నాయకత్వంలోని మంత్రిమండలి రైతు బీమా పథకానికి ఆమోదముద్ర వేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల జిల్లాలోని 2 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ పథకం ద్వారా రైతు సహజంగా మరణించినా, ప్రమాదవశాత్తు మరణించినా అతని కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల బీమా సొమ్ము అందనుంది.
రైతుబంధు పథకంలో జిల్లాలో 2,39,718 మంది రైతులకు పెట్టుబడి రూపంలో లబ్ధి చేకూరగా, బీమా సంస్థల నిబంధనల ప్రకారం జిల్లాలో సుమారు 2 లక్షల మంది రైతులకు రైతు బీమా పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. రాష్ట్ర ప్రభుత్వం, ఎల్‌ఐసీ సంయుక్తంగా ఈ రైతుబంధు పథకాన్ని అమలు చేయనున్నాయి.
బీమా సంస్థకు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏటా బడ్జెట్‌లో కేటాయించనుంది. రాష్ట్రంలోని ప్రతీ రైతు ఈ పథకం పరిధిలోకి వస్తాడు. కానీ, బీమా సంస్థల నిబంధనల ప్రకారం 18 సంవత్సరాల నుంచి 59 ఏళ్ల లోపు ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకం వర్తించనుంది.
దీంతో 18 సంవత్సరాల లోపు, 60 సంవత్సరాల పైబడిన రైతులను తొలగించగా జిల్లాలోని సుమారు 2 లక్షల మంది రైతులు ఈ పథకంలో లబ్ధిదారులుగా మారనున్నారు. గుంట విస్తీర్ణంలో వ్యవసాయ భూమి ఉన్న రైతు కూడా రైతు బీమా పథకానికి అర్హుడుగా పేర్కొంటున్నారు.
రైతు ప్రమాదవశాత్తు కానీ, సహజ మరణం గాని పొందిన సమయంలో అతను ఇదివరకే నామినీగా చూపించిన కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల బీమా మొత్తం అందనుంది. ఇందుకు గాను మృతి చెందిన రైతు కుటుంబ సభ్యులు పది రోజుల్లోగా డెత్ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది.
వ్యవసాయాధికారులు క్లస్టర్ల వారీగా రైతు బీమాకు అర్హుల జాబితాను తయారు చేయడమే కాకుండా ప్రతీ నెల అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. వ్యవసాయ భూముల అమ్మకం, కొనుగోలు చేసిన సమయంలో కొత్తగా భూమి కొన్న రైతుల వివరాలను వ్యవసాయాధికారులు రైతు బీమా పథకంలో చేర్చాల్సి ఉంటుంది.
ఈ పథకాన్ని ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి అధికారికంగా అమలు చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. 24 గంటల పాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను పొందుతున్న రైతులకు ఎకరానికి రూ.4 వేల పెట్టుబడి అందించడమే కాకుండా తాజాగా రైతు బీమా పథకాన్ని తీసుకొస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment