సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : వైద్యం అందక జ్వరాల బారిన పడి పిట్టల్లా రాలుతున్న జనం.. కనీస మద్దతు ధరల కోసం రోడ్డెక్కుతున్న అన్నదాతలు.. రోడ్లు, తాగు నీరు వంటి కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోని గిరిజనం.. ఖరీఫ్‌ను కాటేసిన కరువు.. రైతుల బలవన్మరణాలు.. ఇలా జిల్లా వాసులు పలు సమస్యలతో సతమతమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర తొలి బడ్జెట్‌పై జిల్లా వాసులు కోటి ఆశలు పెట్టుకున్నారు.
ఈ బడ్జెట్ సమావేశాల్లో తమ సమస్యలపై ఎమ్మెల్యేలు గళం విప్పాలని కోరుతున్నారు. జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న రాష్ట్ర అటవీ శాఖ మంత్రిగా జోగు రామన్న తన శాఖకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. కొత్తగా ఎన్నికైన ఐదుగురు ఎమ్మెల్యేలు రేఖా శ్యాంనాయక్ (ఖానాపూర్), రాథోడ్ బాపురావు (బోథ్), జి.విఠల్ రెడ్డి (ముథోల్), దుర్గం చిన్నయ్య (బెల్లంపల్లి), కోవ లక్ష్మి (ఆసిఫాబాద్)లకు ఇది తొలి సమావేశాలు కావడం గమనార్హం. జిల్లా ఎమ్మెల్యేలంతా అధికార పార్టీకి చెందిన వారే కావడంతో సమస్యలపై ఏ మేరకు గళం విప్పుతారో వేచిచూడాల్సి ఉంది.
మంచం పట్టిన గోండు గూడాలు..
జిల్లాలో జ్వర మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. డెంగీ, మలేరియా, విష జ్వరాల బారిన పడి పదుల సంఖ్యలో నిరుపేదలు మరణిస్తున్నారు. ముఖ్యంగా గోండు గూడాలు మంచం పట్టాయి. ఇంటికి ఒకరిద్దరు చొప్పున జ్వరాలతో బాధపడుతున్నారు. నిరుపేదలకు వైద్యం అందించాల్సిన సర్కారు చేతులెత్తేస్తోంది.
ఇప్పటివరకు డెంగీతో పదుల సంఖ్యలో మరణాలు సంభవించినప్పటికీ అసలు డెంగీ మరణాలే లేవని డిప్యూటీ సీఎం, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.రాజయ్య ఇటీవల జిల్లా పర్యటనలో ప్రకటించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. క్షేత్ర స్థాయిలో వైద్య సేవలు అందించే పీహెచ్‌సీల్లో సుమారు 50కి పైగా వైద్యాధికారుల పోస్టులు ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. చాలీ చాలని మందుల బడ్జెట్‌తో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రాథమిక చికిత్సకు కూడా గిరిజనులు నోచుకోవడం లేదు. దేవుడిపైనే భారం వేస్తున్నారు. ఈ బడ్జెట్‌లో గిరిజనులకు వైద్యసేవలు అందించడం పై ప్రత్యేక దృష్టిసారించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పడిపోయిన దిగుబడి.. అందని మద్దతు..
తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని పంటలు పండించిన రైతులకు దిగుబడి రాక తీవ్రంగా నష్టపోయారు. సోయా ఎకరానికి రెండు క్వింటాళ్లు కూడా దిగుబడి రాలేదు. నకిలీ విత్తనాలతో నష్టపోయిన ఈ రైతాంగాన్ని ఆదుకోవాలని ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఇటీవల జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్‌కు ఫిర్యాదు చేశారంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మరోవైపు పత్తికి కనీస మద్దతు ధర దక్కడం లేదు.
నాణ్యత పేరుతో సీసీఐ చేతులెత్తేయగా, దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేటు వ్యాపారులు దోపిడీ చేస్తున్నారు.ఎంఎస్‌పీలో క్వింటాలుకు రూ.500 వరకు కోత విధించి పత్తిని కోనుగోలు చేస్తున్నారు. దీంతో పెట్టిన పెట్టుబడులు కూడా అందడం లేదని వాపోతున్నారు. ప్రకృతి వైపరీత్యాలకు తోడు.. మద్దతు ధర దక్కకపోవడం.. దిగుబడులు పడిపోయి.. అప్పుల భారం పెరగడంతో మనస్థాపం చెందుతున్న అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గత ఐదు నెలల్లో జిల్లాలో సుమారు 32 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రాష్ట్ర సర్కారు స్పందించాలని రైతులు కోరుతున్నారు.
మౌలిక సదుపాయాలు కరువు..
జిల్లాలో మారుమూల ప్రాంతాల వాసులు కనీస సదుపాయాలకు నోచుకోవడం లేదు. ఇప్పటికీ కరెంట్ లేని గోండు గూడాలున్నాయి. పైగా రహదారుల పరిస్థితి దారుణంగా ఉంది. తాగునీటి కోసం గిరిజనులు కిలో మీటర్ల దూరం నడవాల్సి వస్తోంది. మౌళిక సదుపాయాల కల్పన కోసం వస్తున్న నిధులు సద్వినియోగం కాకపోవడంతో గిరిజనులు సమస్యలతోనే సహజీవనం చేయాల్సి వస్తోంది.
ముఖ్యంగా రోడ్డు సౌకర్యం లేక అనేక గ్రామాలకు అంబులెన్సులు కూడా వెళ్ల లేని పరిస్థితి. అత్యవసర పరిస్థితుల్లో ఎడ్ల బండ్లపై బాధితులను ఆసుపత్రికి తరలించాల్సి వస్తోంది. మన ఊరు.. మన ప్రణాళిక..లో ఈ మౌళిక సదుపాయాల కోసం చేసిన ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. బడ్జెట్‌లో మౌళిక సదుపాయాలకు పెద్ద పీట వేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సాగునీటి ప్రాజెక్టులు..
జలయజ్ఞంలో భాగంగా జిల్లాలో చేపట్టిన పలు సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడంతో అవి నిరుపయోగంగా ఉన్నాయి. కొద్ది మొత్తంలో నిధులు కేటాయించి పెండింగ్ పనులను పూర్తి చేస్తే ఆయకట్టుకు సాగునీరందే అవకాశాలున్నాయి. ముఖ్యంగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 90 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. అలాగే గొల్లవాగు ప్రాజెక్టు వంటి ప్రాజెక్టు పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈ బడ్జెట్ కేటాయింపుల్లో ఈ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి పనులను పూర్తి చేయడం ద్వారా ఆయకట్టుకు సాగు నీరందించవచ్చనే అభిప్రాయం ఆయకట్టు రైతుల నుంచి వ్యక్తమవుతోంది.
మీపైనే.. ఆశ
Published Wed, Nov 5 2014 2:59 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement