ఆశలు వర్షార్పణం
-
వర్షానికి దెబ్బతిన్న పంటలు
-
గోరంట్ల, బుక్కపట్టణం మండలాల్లో అరటి, మామిడికి నష్టం
-
బుక్కపట్టణం మండలంలో పిడుగుపాటుకు వ్యక్తి మృతి
అనంతపురం అగ్రికల్చర్: అకాల వర్షం అన్నదాతల ఆశలను చిదిమేసింది. భూగర్భజలాలు అంతంతమాత్రంగానే ఉన్న జిల్లాలో ప్రకృతికి ఎదురు నిలిచి సాగుచేసిన రైతన్నల కష్టాన్ని నేలపాలుచేసింది. మంగళవారం జిల్లాలో కురిసిన వర్షంతో పంటలకు నష్టం వాటిల్లగా..పిడుగుపాటుతో బుక్కపట్టణం మండలం కొత్తకోట గ్రామంలో జయచంద్ర (21) అనే విద్యార్థి మృత్యువాత పడ్డారు.
నేల రాలిన మామిడి
అకాల వర్షంతో పుట్టపర్తి మండలం వెంగలమ్మచెరువు గ్రామంలో మామిడి కాయలు నేలరాలడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా 100 ఎకరాలపైగానే మామిడి పంటకు నష్టం వాటినట్లు తెలుస్తోంది. ఇక గోరంట్ల మండలం కసిరెడ్డిపల్లి గ్రామంలో ఈదురుగాలులతో కూడిన వాన పడటంతో రైతు సదాశివరెడ్డికి చెందిన కాకర పంట నాశనమైంది. మొత్తమ్మీద మంగళవారం మధ్యాహ్నం పుట్టపర్తి మండలంలో అత్యధికంగా 45 మి.మీ వర్షపాతం నమోదు కాగా రొద్దం 35 మి.మీ, పరిగి 25 మి.మీ, సోమందేపల్లి 20 మి.మీ, కొత్తచెరువు, తాడిపత్రి, గోరంట్లలో 15 మి.మీ, పెనుకొండ, తనకల్లు, పుట్లూరు మండలాల్లో 10 మి.మీ మేర వర్షపాతం నమోదైంది. ఆయా గ్రామాల్లో అరటి, మామిడి పంటలకు తీవ్ర నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఇక ముదిగుబ్బ, చెన్నేకొత్తపల్లి, శింగనమల, నార్పల, తాడిమర్రి, బుక్కపట్టణం, మడకశిర, యల్లనూరు, చిలమత్తూరు, లేపాక్షి, ఓడీ చెరువు తదితర మండలాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి.