విశ్వసనీయత సరే.. తీరని ఆశల మాటేమిటి? | akkarpatel avalokanam | Sakshi
Sakshi News home page

విశ్వసనీయత సరే.. తీరని ఆశల మాటేమిటి?

Published Sun, Dec 27 2015 1:23 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

విశ్వసనీయత సరే.. తీరని ఆశల మాటేమిటి? - Sakshi

విశ్వసనీయత సరే.. తీరని ఆశల మాటేమిటి?

అవలోకనం
బరాక్ ఒబామా 2008లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు మీడియా మొఘల్ రూపర్ట్ మర్దోక్ మాట్లాడుతూ, గతంలోని అధ్యక్షులు తీసుకొచ్చిన గొప్ప మార్పులు వారు అధికారం చేపట్టిన తొలి ఆరు నెలల్లోనే సంభవించాయని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత వారు వ్యవస్థ చట్రంలో ఇరుక్కుపోయారని, ప్రతిఘటన కూడా చేయలేక, ఏ గొప్ప మార్పునైనా సరే తీసుకురాలేకపోయారని మర్దోక్ పేర్కొన్నారు. మరి ప్రధాని మోదీ మాటేమిటి?
 
 దశాబ్దాల కాలంలో అత్యంత ప్రాచుర్యం పొందిన, విశ్వసనీయమైన భారత నేతగా నరేంద్ర మోదీ తన స్థానాన్ని దృఢపర్చుకున్న సంవత్సరం 2015. ఇందిరా గాంధీ హయాంలోనే కాదు.. జవహర్‌లాల్ నెహ్రూ కాలంలో కూడా ఇంత ప్రజాదరణను, ఇంత జనాకర్షణను పొందిన నేతను మనం చూడలేదు. మహత్తర మార్పును వాగ్దానం చేస్తూ మోదీ అధికారంలోకి వచ్చారు. అయితే ఇంతవరకూ ఆ మార్పు జరగలేదు. నిజమే. మోదీ పాలనలో భారీ అవినీతి కుంభకోణాలపై చాలా తక్కువ కథనాలే వచ్చాయి. కానీ, మన్మోహన్ సింగ్ పాలన కంటే, అంతకు క్రితం పాలించిన వారికంటే  మోదీ పాలనలో భారత్ ఏమైనా విభిన్నంగా ఉందా?

 అధికారం చేపట్టినప్పుడు మోదీ ప్రారంభించిన కీలకమైన పథకాలు పరిశీ లకులనే నివ్వెరపరిచాయి. స్వచ్ఛభారత్ అనేది మరుగుదొడ్లను నిర్మించడానికి సంబంధించి దశాబ్దాలుగా అమలులో ఉన్న పథకాలకు పేరు మార్పిడీయేనా? అయితే మంచిదే. కానీ ప్రధాని చీపురు చేపట్టి వీధులను ఊడ్చారు. అంటే స్వచ్ఛ భారత్ కేవలం పరిశుభ్రతకు సంబంధించిందీ, ఆరోగ్యంగా ఉండవలసిందిగా భారతీయులను ప్రోత్సహించేదీ మాత్రమేనా? అదే అయితే సామాజిక సంస్కరణ చేయడమే ప్రభుత్వ విధి అని చెప్పవచ్చా? కుటుంబ నియంత్రణను ప్రోత్సహిం చడం, మద్యనిషేధం అమలు, ఆడ శిశువుల హత్యలను నిరోధించడం వగైరా రూపాల్లో ప్రభుత్వం ఇప్పటికే సామాజిక సంస్కరణను చేపట్టిందని ఎవరైనా వాదించవచ్చు. కానీ వాటితో పోలిస్తే పరిశుభ్రత అనేది తగ్గు స్థాయికి సంబంధిం చింది. స్వచ్ఛ భారత్ ఉద్దేశం అర్థవంతమైనదే అయినప్పటికీ, పన్ను రాబడిపై ఎందుకు దృష్టి కేంద్రీకరిస్తున్నారన్నది ఎవరూ చెప్పలేకపోతున్నారు.

 పైగా, పదేళ్ల మన్మోహన్ సింగ్ హయాంతో పోలిస్తే, సగటున ఆర్థిక వ్యవస్థ మందకొడి దిశగా వృద్ధి చెందుతోంది. ప్రభుత్వ చెల్లింపుల షీట్‌ను బలోపేతం చేయడానికి, పూర్తిగా పతనమైన ముడి చమురు ధరలను మోదీ బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నారు. లేకుంటే ఆర్థిక వ్యవస్థ నీరసించిపోయేది. తన వేగ వృద్ధి వల్ల కాకుండా చైనా వృద్ధి రేటు మందగిస్తున్న నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థగా భారత్ పేరు పొందుతోంది.

 మోదీ ప్రకటించిన భారీ పారిశ్రామిక విధానం మేక్ ఇన్ ఇండియా ఒక అద్భు తమైన లోగో. ఎంతో అట్టహాసంగా దీన్ని ప్రారంభించారు కానీ ఇక్కడ కూడా ఈ విధానం ఉద్దేశం ఏమిటన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. చివరికి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌తోపాటు అనేకమంది నిపుణులు సైతం వస్తూత్పత్తి రంగాన్ని చైనా నుంచి భారత్‌కు ఆకర్షించవచ్చన్న భావాన్నే తోసిపుచ్చారు. ఇక ప్రతీకాత్మకతకు సంబం ధించి చూస్తే, ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం (వల్లభ్ భాయ్ పటేల్‌ది) గుజరాత్‌లో నిర్మిస్తామని ప్రకటించారు. కానీ దాన్ని చైనీయులు నిర్మించబోతు న్నారని తర్వాత తెలిసింది. మొట్టమొదటి భారత బుల్లెట్ ట్రెయిన్ నిర్మాణం కోసం తేలికపాటి రుణాన్ని అందిస్తామని జపానీయులు ప్రతిపాదించారు కానీ,  99,000 కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టు వ్యయం గురించి నేను చదివిన ఏ ఆర్థికవేత్త కూడా ప్రస్తావించినట్లు లేదు.

 విదేశీ విధానానికి సంబంధించి, మోదీ రెండు కీలక అంశాలు పూర్తి చేశారు. అత్యంత భారీ జనాకర్షణ ద్వారా విదేశీ నగరాల్లోని ప్రవాస భారతీయులను ఆయన అద్భుతంగా  సమీకరించారు. ఈ భారీ జన సమీకరణ ప్రయోజనం ఏమి టన్నది స్పష్టం కావడం లేదు. దీనికి సంబంధించిన పొందికయిన వివరణ బహుశా భవిష్యత్తులో రావచ్చు. ఇక పాకిస్తాన్ విషయంలో నా అంచనా ప్రకారం మోదీ ప్రభుత్వం గత 18 నెలల కాలంలో తన వైఖరిని కనీసం 9 సార్లు మార్చు కుంది. దౌత్య నిపుణులతో సహా ఏ ఒక్కరికీ పాకిస్తాన్ పట్ల భారత్ విధానం ఏమిటి లేక అసలు అలాంటి విధానం ఏమైనా ఉందా అనేది నిజంగానే తెలీటం లేదు. ఇప్పటికైతే మనం పాక్‌తో మళ్లీ చర్చిస్తున్నట్లుగా కనిపిస్తుంది. కానీ ఇంతకు ముందే ఎందుకు చర్చించలేకపోయాం? లేక వచ్చే నెలలో మనం చర్చలు కొనసాగించగలుగుతామా? అని ఎవరూ చెప్పలేరు.

 ఎన్నికల ప్రచార సమయంలో మోదీ చేసిన కొన్ని వాగ్దానాలు మృదువుగా చెప్పాలంటే అసత్యాలుగా పరిణమించాయి. ఉదాహరణకు, నల్లధనాన్ని వెనక్కు తీసుకువస్తానని ఆయన ప్రకటించారు. మరో ఉదాహరణ.. అవినీతి ఆరోపణలకు గురైన ఎవరినైనా తాను కాపాడబోనని మోదీ తేల్చి చెప్పారు.

 తన వ్యవహారశైలిని అలా పక్కనబెడితే, మోదీ అత్యంత విశ్వసనీయత కలిగి ఉన్నారు. పైగా తిరుగులేని జనాకర్షణ ఉంది కూడా. ఆయన రేటింగులు 75 శాతం మార్కును చేరుకుంటున్నట్లు పోల్ సర్వేలు నిత్యం సూచిస్తున్నాయి. అంటే బీజేపీయేతర ఓటర్లనుంచే ఆయనకు మద్దతు అధికంగా వస్తోందని దీని అర్థం. (జాతీయ ఓటులో బీజేపీకి దక్కింది 32 శాతమే). ఆయన నిజంగానే శక్తివంతు డిగా, అర్థవంతమైన నేతగా, నిజాయితీపరుడిగా గుర్తింపు పొందారు.

 తన ఈ ప్రజాదరణనే మోదీ బిహార్ ఎన్నికల ప్రచారంలో దూకుడుగా ఉపయోగించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినప్పటికీ, ఆ ఎన్నికల్లో తన శక్తిమేరా ఆయన కృషి చేశారు. ఎన్నికల ప్రచారం పొడవునా ఆయన ఉపయో గించిన కటువైన పదజాలం ఫలితంగా కేంద్రాన్ని పనిచేయనివ్వడంలో ప్రతిపక్షం ఎలాంటి ప్రోత్సాహాన్ని అందివ్వలేదు.

 ఈ విషయంలో మాత్రం సోనియాగాంధీ కుటుంబం సంవత్సరం మొత్తం మీద పేలవమైన పనితీరునే ప్రదర్శించింది. పరాభవం నుంచి కోలుకోవడానికి స్పష్టమైన వ్యూహం వారికి లేకుండాపోయింది. తాము రంగంలో ఇంకా ఉన్నా మని చూపించుకునేందుకు వారు పార్లమెంటును అడ్డుకోవడం వంటి ఎత్తు గడలను ఉపయోగించారు. ఒక ఎత్తుగడగా ఇది బాగున్నా, ప్రధాని దార్శనికతకు ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదించలేక ఇది అసంపూర్తిగానే మిగిలిపోయింది.

 బిహార్, గుజరాత్‌లలో ఆయన పార్టీ కాస్త వెనుకబడినట్లు కనిపిస్తున్నప్పటికీ మోదీ మాత్రం ఇప్పటికీ అగ్రస్థానంలోనే ఉన్నారు. వందకోట్లమందికి పైగా భారతీయులు ఆయనలో ఇంకా విశ్వాసాన్ని, ఆశను కలిగి ఉంటున్నారు. మోదీ పదేళ్లపాటు అధికారంలో ఉంటారని కశ్మీర్ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి, అత్యంత అనుభవజ్ఞుడైన రాజకీయ నేత ముఫ్తీ మహమ్మద్ తేల్చి చెబుతున్నారు.

 ముఫ్తీ అభిప్రాయం నిజమే అయితే ప్రధానిగా 18 నెలల కాలం ఏమంత ముఖ్యమైనది కాదు. అయితే బరాక్ ఒబామా 2008లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు మీడియా మొఘల్ రూపర్ట్ మర్దోక్ మాట్లాడుతూ, గతంలోని అధ్యక్షులు తీసుకొచ్చిన గొప్ప మార్పులు వారు అధికారం చేపట్టిన తొలి ఆరు నెలల్లోనే సంభవించాయని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత వారు వ్యవస్థ చట్రంలో ఇరుక్కుపోయారని, ప్రతిఘటన కూడా చేయలేక, ఏ గొప్ప మార్పునైనా సరే తీసుకురాలేకపోయారని మర్దోక్ పేర్కొన్నారు.

 ఇది నిజమైతే, నవ్య భారత్‌ను రూపు దిద్దడానికి అసంపూర్ణమైన, చెదిరి పోయిన ఆవిష్కరణలను ప్రధాని మోదీ ప్రకటించడం కంటే తన ప్రజాదరణను, విశ్వసనీయతను ఉన్నత స్థాయిలో నిలుపుకోవడానికి ఇతర మార్గాలను కనుగొనవలసి ఉంటుంది.
http://img.sakshi.net/images/cms/2015-10/41445119145_625x300.jpg
 వ్యాసకర్త కాలమిస్టు, రచయిత: అకార్ పటేల్( aakar.patel@icloud.com)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement