![Semicon India 2022: PM Narendra Modi To Inaugurate SemiconIndia Conference 2022 - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/30/MODINA.jpg.webp?itok=3WygbUnI)
బెంగళూరు: పారిశ్రామికవేత్తలు, తయారీదార్లకు కేంద్రం విధానపరంగా పూర్తి అనుకూల వాతావరణం కల్పిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశాన్ని ప్రపంచ సెమికండక్టర్ల హబ్‌గా మార్చాలని పరిశ్రమ వర్గాలకు పిలుపునిచ్చారు. అత్యున్నత సాంకేతికత, నాణ్యత, విశ్వసనీయతకు పెద్దపీట వేయాలన్నారు. శుక్రవారం బెంగళూరులో ‘సెమికాన్ ఇండియా–2020’ సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధాని మాట్లాడారు. నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో, సవాళ్లను స్వీకరించే విషయంలో భారత్ ముందంజలో ఉంటుందన్నారు. 2026 నాటికి దేశీయంగా 80 బిలియన్ డాలర్ల విలువైన, 2030 నాటికి 110 బిలియన్ డాలర్ల విలువైన సెమికండక్లర్ల అవసరమన్నారు.
మరిన్ని ప్రోత్సాహకాలు
గత ప్రభుత్వాలు సెమికండక్టర్ల డిజైనింగ్ పరిశ్రమను ప్రోత్సాహించలేదని మోదీ ఆక్షేపించారు. ‘‘ఈ పరిశ్రలో దేశంలో ప్రతిభకు కొదవ లేదు. ప్రపంచంలో సెమికండక్టర్ల డిజైన్ ఇంజనీర్లలో 20 శాతం మన దగ్గరే ఉన్నారు. భారత్‌ను సెమికండక్టర్ హబ్‌గా మార్చడానికి ఆచరణ యోగ్యమైన సలహాలు, సూచనలివ్వండి. 130 కోట్ల మంది భారతీయులను అనుసంధానించడానికి డిజిటల్ మౌలిక సదుపాయాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. 6 లక్షల గ్రామాలను బ్రాడ్‌బ్యాండ్‌తో కలుపుతున్నాం’’ అని తెలిపారు. 5జీ టెక్నాలజీ త్వరలో అందుబాటులోకి రాబోతోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.
సిక్కులపై ప్రధాని ప్రశంసలు
న్యూఢిల్లీ: విదేశాలతో బంధాల బలోపేతానికి సిక్కు వర్గీయులు అనుసంధానంగా ఉన్నారంటూ మోదీ కొనియాడారు. ఇందుకు యావత్ దేశం గర్వపడుతోందన్నారు. సిక్కు ప్రతినిధి బృందానికి శుక్రవారం తన నివాసంలో ఆతిథ్యమిచ్చారు. ఈ సందర్భంగా ఎర్ర తలపాగా చుట్టుకొని ఆకర్షించారు.
Comments
Please login to add a commentAdd a comment