
వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్న మోదీ
సాక్షి, బెంగళూరు: భారత్‌లో రూపుదిద్దుకున్న సాంకేతిక ఆవిష్కరణలు ప్రపంచవ్యాప్తంగా వినియోగమయ్యే సమయం ఆసన్నమైందని, సాంకేతికతే భవిష్యత్ దిక్సూచి అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘ప్రస్తుత సమాచార, సాంకేతిక యుగంలో భారత్ ప్రత్యేక సానుకూల స్థానంలో ఉంది. అభివృద్ధిలో దూసుకెళ్లగల స్థానంలో ఉంది. అద్భుతమైన మేధస్సు ఉన్నవారు మన దగ్గర ఉన్నారు. అంతేకాదు, మన మార్కెట్ అతిపెద్దది. మన దగ్గర స్థానికంగా అభివృద్ధి చేసిన సాంకేతిక ఆవిష్కరణలు అంతర్జాతీయంగా విజయం సాధించగల సామర్ధ్యం ఉన్నవి’ అని పేర్కొన్నారు. ‘బెంగళూరు టెక్ సమ్మిట్–2020’ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని గురువారం ప్రారంభించారు.
ఈ సదస్సు బెంగళూరులో మూడు రోజుల పాటు జరగనుంది. భారత్‌లో డిజిటల్ ఇండియా ఇప్పుడు దేశ ప్రజల జీవన శైలిగా, జీవితంలో విభజించలేని భాగంగా మారిందని ప్రధాని వ్యాఖ్యానించారు. టెక్నాలజీ పరిశ్రమకు సహకరించే దిశగా తమ ప్రభుత్వ విధాన నిర్ణయాలు ఉన్నాయన్నారు. సైబర్ దాడుల నుంచి, వైరస్‌ల నుంచి డిజిటల్ ఉత్పత్తులను కాపాడే సమర్దవంతమైన సైబర్ సెక్యూరిటీ వ్యాక్సిన్లను రూపొందించే విషయంలో భారత యువత కీలక పాత్ర పోషించాల్సి ఉందన్నారు. దేశంలో ప్రతి ఇంటికి విద్యుత్ సరఫరా అవుతుందంటే దానికి సాంకేతికాభివృద్ధే కారణమని ప్రధాని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment