technology important
-
సాంకేతికతే భవిష్యత్ దిక్సూచి
సాక్షి, బెంగళూరు: భారత్‌లో రూపుదిద్దుకున్న సాంకేతిక ఆవిష్కరణలు ప్రపంచవ్యాప్తంగా వినియోగమయ్యే సమయం ఆసన్నమైందని, సాంకేతికతే భవిష్యత్ దిక్సూచి అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘ప్రస్తుత సమాచార, సాంకేతిక యుగంలో భారత్ ప్రత్యేక సానుకూల స్థానంలో ఉంది. అభివృద్ధిలో దూసుకెళ్లగల స్థానంలో ఉంది. అద్భుతమైన మేధస్సు ఉన్నవారు మన దగ్గర ఉన్నారు. అంతేకాదు, మన మార్కెట్ అతిపెద్దది. మన దగ్గర స్థానికంగా అభివృద్ధి చేసిన సాంకేతిక ఆవిష్కరణలు అంతర్జాతీయంగా విజయం సాధించగల సామర్ధ్యం ఉన్నవి’ అని పేర్కొన్నారు. ‘బెంగళూరు టెక్ సమ్మిట్–2020’ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని గురువారం ప్రారంభించారు. ఈ సదస్సు బెంగళూరులో మూడు రోజుల పాటు జరగనుంది. భారత్‌లో డిజిటల్ ఇండియా ఇప్పుడు దేశ ప్రజల జీవన శైలిగా, జీవితంలో విభజించలేని భాగంగా మారిందని ప్రధాని వ్యాఖ్యానించారు. టెక్నాలజీ పరిశ్రమకు సహకరించే దిశగా తమ ప్రభుత్వ విధాన నిర్ణయాలు ఉన్నాయన్నారు. సైబర్ దాడుల నుంచి, వైరస్ల నుంచి డిజిటల్ ఉత్పత్తులను కాపాడే సమర్దవంతమైన సైబర్ సెక్యూరిటీ వ్యాక్సిన్లను రూపొందించే విషయంలో భారత యువత కీలక పాత్ర పోషించాల్సి ఉందన్నారు. దేశంలో ప్రతి ఇంటికి విద్యుత్ సరఫరా అవుతుందంటే దానికి సాంకేతికాభివృద్ధే కారణమని ప్రధాని అన్నారు. -
పోలీసు విధుల్లో టెక్నాలజీ కీలకం
అనంతపురం సెంట్రల్ : టెక్నాలజీ పోలీసు విధుల్లో కీలకంగా మారిందని జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు అన్నారు. గురువారం డీటీసీలో విశాఖపట్నం, గుంటూరు తదితర ప్రాంతాలకు నుంచి వచ్చి శిక్షణ పొందుతున్న కానిస్టేబుళ్లతో ముఖాముఖి నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ టెక్నాలజీపై పరిజ్ఞానం పెంచుకుని ప్రజలకు మెరుగైన సేవలందించాలని ఆదేశించారు. ఇండోర్ శిక్షణలో భాగంగా ఐపీసీ ఎవిడెన్స్‌యాక్టు, పర్సనాలిటీ డెవలప్మెంట్, సీఆర్పీసీ, స్టేషన్‌హౌస్ మేనేజ్మెంట్, ఇన్వెస్టిగేషన్, ఫోరెన్సిక్‌సైన్స్, లా అండ్ ఆర్డర్, అవుట్‌డోర్‌లో భాగంగా యోగా, ధ్యానం, వెపన్ ట్రైనింగ్, క్రౌండ్ కంట్రోల్, ఫీల్డ్ క్రాప్ట్ తదితర అంశాలపై నిష్ణాతులతో శిక్షణ ఇప్పిస్తున్నట్లు వివరించారు. అనంతరం ఆయన రూరల్ మండలం కామారుపల్లి గ్రామ సమీపంలోని డీటీసీ(జిల్లా శిక్షణా కేంద్రం) కోసం కేటాయించిన స్థలాన్ని సందర్శించారు.కార్యక్రమంలో అదనపు ఎస్పీ మాల్యాద్రి, డీటీసీ డీఎస్పీ ఖాసీంసాబ్, ఏఆర్డీఎస్పీ చిన్నికృష్ణ, సీఐలు శివనారాయణస్వామి, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. -
2030లో స్మార్ట్‌సిటీలు ఎలా ఉంటాయి?
ప్రపంచంలోని 60 శాతం జనాభా 2030 నాటికి స్మార్ట్ సిటీలలో నివసిస్తారని మేధావులు భావిస్తున్నారు. అప్పటికి ప్రజల జీవన విధానం ఎలా ఉంటుంది? జీవన ప్రమాణాలు ఎలా ఉంటాయి? ఇప్పటిలాగే అప్పుడు కూడా రాజకీయ నాయకుల దయాదాక్షిణ్యాలు, వారి నిర్ణయాలపైనే ప్రజల జీవితాలు ఆధారపడతాయా? అన్న అంశంపై ప్రపంచంలోని సాంకేతిక నిపుణులు, మేధావుల మధ్య చర్చ నడుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానమే ప్రజల జీవితాలను నిర్దేశిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పట్టణ ప్రణాళికలను అమలు చేయగా, స్మార్ట్ సిటీల్లో ప్రజల అవసరాల కన్నా సాంకేతిక పరిజ్ఞానానికే ఎక్కువ విలువనిస్తారు. ముందస్తు ప్రణాళికల ద్వారా ఇంతకుముందు పట్టణాలను నిర్మించగా స్మార్ట్ సిటీలను అప్పటికప్పుడు కావల్సిన అవసరాలకు అనుగుణంగా నిర్మిస్తుంటారు. అన్ని సమస్యలకు సాంకేతిక పరిష్కారాలే ఉంటాయి. ఉదాహరణకు చైనా రాజధాని బీజింగ్ నగరంలోలాగా వాయు కాలుష్యం తీవ్రంగా ఉంటే వాయువులోని కాలుష్యాన్ని గ్రహించి స్వచ్ఛమైన వాయువును వదిలే టవర్లు ప్రతి అపార్ట్మెంట్లో, ప్రతి ఇంటిలో ఉంటాయి. బీజింగ్ వాయు కాలుష్యాన్ని నిర్మూలించేందుకు 23 అడుగుల ఎత్తయిన టవర్ ద్వారా ప్రయోగాలు జరుపుతున్న విషయం తెలిసిందే. చెట్లు, పుట్టలతో గ్రామీణ వాతావరణం కనుమరుగై పట్టణాల పేరుతో కాంక్రీట్ నగరాలు ఏర్పడ్డాయి. దానివల్ల పర్యావరణ పరిస్థితులు కూడా దెబ్బతిన్నాయి. సాంకేతిక పరిజ్ఞానం వల్ల కాంక్రీట్ కట్టడాలే స్మార్ట్ సిటీల్లో పచ్చని చెట్లతో కళకళలాడే రోజులు వస్తాయి. ఈ రోజు నగరంలో ఉష్ణోగ్రత ఎంతుంది? వాయుకాలుష్యం శాతమెంత? ధ్వని కాలుష్యం ఎంతుంది? ట్రాఫిక్ ఎక్కడెక్కువుంది? ఎక్కడ తక్కువుంది? ఇలాంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి పంపించే సెన్సర్లు ఉంటాయి. ఆ డేటాను బట్టి రియల్ టైమ్‌లో, రియల్ పరిష్కారాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. ఇలా పలు పరిస్థితులను ఒకే పరికరం అంచనా వేసే పద్ధతి ఇప్పటికే చికాగో నగరంలో ప్రవేశపెట్టారు. ఈ పరికరాలు అక్కడ వీధి విద్యుత్ స్తంభాలకు ఏర్పాటు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల అపార్ట్మెంట్ కల్చర్ కూడా మారవచ్చని, మళ్లీ ప్రజలు సమూహాలుగా జీవించే అవసరం రావచ్చని నిపుణులు భావిస్తున్నారు. రాజకీయ నాయకులు ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా సాంకేతిక పరిజ్ఞానంపైనే ఆధారపడాల్సి వస్తుందని అంటున్నారు.