స్మార్‌‌ట కలేనా? | Smart City State capitals no chansa | Sakshi
Sakshi News home page

స్మార్‌‌ట కలేనా?

Published Sun, Sep 21 2014 3:42 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

స్మార్‌‌ట కలేనా? - Sakshi

స్మార్‌‌ట కలేనా?

  • స్మార్ట్ సిటీలుగా రాష్ర్ట రాజధానులకు నో ఛాన్‌‌స
  •  జనాభా ప్రాతిపదికన ఆ సిటీల ఎంపిక
  •  10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాలకే అవకాశం
  •  రాష్ర్టంలో ఒక్క నగరానికీ దక్కని అవకాశం
  •  అవరోధంగా మారిన  కేంద్రం విధి విధానాలు
  •  రాష్ట్రం నష్ట పోతుందని  కేంద్రానికి రాష్ర్ట ప్రభుత్వం లేఖ
  • సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ‘ఈ రోజు కర్ణాటక చెప్పింది...రేపు దేశమంతా ఆచరించాలి’...ఈ వ్యాఖ్యానమెవరిదో కాదు...తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూది. సైన్స్, టెక్నాలజీ...ఇలా ఏ రంగంలోనైనా కర్ణాటక ముందుంటుంది అని చెప్పడానికి ఆయనీరకంగా వ్యాఖ్యానించారు.

    అలాంటి కర్ణాటకకు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన స్మార్ట్ సిటీ... ఎండమావిగా మారే ప్రమాదం ఏర్పడింది. ఎందుకంటే... స్మార్ట్ సిటీ నిర్మాణం కోసం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ రూపొందించిన విధి విధానాలే దీనికి కారణం. పది లక్షల నుంచి 40 లక్షల జనాభా కలిగిన 44 నగరాలను, 40 లక్షలు, ఆపైబడిన జనాభా కలిగిన తొమ్మిది శాటిలైట్ నగరాలను స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద ఎంపిక చేస్తున్నట్లు కేంద్రం పంపిన సర్క్యులర్‌లో పేర్కొంది.

    ఇంత జనాభా కలిగిన నగరం ఒక్కటి కూడా రాష్ట్రంలో లేదు. కేంద్రం ప్రతిపాదించిన వంద స్మార్ట్ సిటీలలో 53 నగరాలకు విధి విధానాలను రూపొందించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ 53 స్మార్ట్ సిటీలలో రాష్ట్రానికి ఒక్కటి కూడా దక్కే అవకాశం లేదు. 84.25 లక్షల జనాభా కలిగిన బెంగళూరు కూడా దీని పరిధిలోకి రాదు. రాష్ట్రాల రాజధానులు, కేంద్ర పాలిత ప్రాంతాలు వేరే ప్రత్యేక కేటగిరీ కిందికి వస్తాయి. స్మార్ట్ సిటీ అర్హత కోసం రూపొందించిన ఈ నిబంధనల వల్ల రాష్ట్రం నష్ట పోతుందని రాష్ర్ట ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది.

     రాష్ట్రంలో బెంగళూరు తర్వాతి స్థానాల్లో హుబ్లీ-ధార్వాడ (9.43 లక్షల జనాభా), మైసూరు (8.87లక్షలు), గుల్బర్గ (5.3 లక్షలు), బెల్గాం (4.88 లక్షలు), మంగళూరు (4.84 లక్షలు), దావణగెరె (4.35 లక్షలు), బళ్లారి (4.09 లక్షలు), శివమొగ్గ (3.22) లక్షలు ఉన్నాయి. పక్కనున్న కేరళలో పది లక్షల జనాభా కలిగిన నగరాలు ఐదు ఉన్నాయి.

    మహారాష్ట్రలో ఆరు నగరాలున్నాయి. రాష్ర్టంలో దశాబ్దాల తరబడి బెంగళూరుపైనే దృష్టి కేంద్రీకృతమైనందున, ద్వితీయ శ్రేణి నగరాలు పెద్దగా అభివృద్ధి చెందలేదు. ఏ రాష్ట్రంలోనైనా పట్టణ ఆర్థికాభివృద్ధితో పాటు ఉపాధి కల్పనకు అవకాశాలున్న నగరాలే ముందుకు దూసుకు పోతున్నాయి. ఇక రెండో కేటగిరీలో ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాధాన్యత కలిగిన పది నగరాలను స్మార్ట్ సిటీల కోసం ఎంపిక చేస్తారు. యాభై వేల నుంచి లక్ష వరకు జనాభా కలిగిన 20 నగరాలను కూడా ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇందులోనైనా రాష్ట్రానికి అవకాశం లభిస్తుందా అనేది కూడా సందేహమే. ఎందుకంటే... దేశ వ్యాప్తంగా ఉన్న ఇతర నగరాలతో పోటీ పడాల్సి ఉంటుంది.

    మోడీ సారథ్యంలో ఏర్పడిన ఎన్‌డీఏ ప్రభుత్వం తొలి బడ్జెట్‌లోనే స్మార్ట్ సిటీలను ప్రతిపాదించింది. 24 గంటలూ విద్యుత్, నీటి  సరఫరా, మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ, అధునాతన సదుపాయాలు, ఈ-గవర్నెన్స్, పరిశుభ్రమైన పర్యావరణ లాంటి హంగులన్నీ స్మార్ట్ సిటీలో ఉంటాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్తమాన ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో దీనికి రూ. ఏడు వేల కోట్లను కేటాయించిన సంగతి తెలిసిందే.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement