akaar patel
-
కీచక పర్వం అంతానికి నాంది పలుకుదాం!
ప్రోత్సాహకర వాతావరణం ఉంటే లైంగిక వేధింపులకు, హింసకు గురైన భారత బాధిత మహిళలు కూడా, అమెరికాలోలాగే ఆ నేరాలపైకి సమాజం దృష్టిని మళ్లించగలుగుతారు. ఈ బాధ్యతను బాధిత మహిళలపైనే పెట్టడం క్రూరత్వమే. లైంగిక వేధింపులకు అంతం పలకడానికి లేదా కనీస స్థాయికి తగ్గేలా చేయడానికి నిజమైన పరిష్కారం.. చట్టం తక్షణం నేరస్తులను శిక్షించడమే. హాలీవుడ్ నిర్మాత హార్వే విన్స్టీన్ లైంగికపరమైన తప్పుడు నడవడికను గురించిన కథనాన్ని అక్టోబర్ 5న న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రచురించింది. హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విన్స్టీన్ అత్యంత శకివంతుడైన వ్యక్తి, ది కింగ్స్ స్పీచ్ వంటి ఆస్కార్ అవార్డులను గెలుచుకున్న సినిమాలను నిర్మించినవాడు. అతగాడి లైంగిక వేధింపు లకు, దాడులకు గురైన మహిళల సొంత కథనాలను ఆ పత్రిక పేర్కొంది. ఆ కథనం Ðð లువడ్డాక, విన్స్టీన్ లైంగిక దాడుల గురించి వెల్లడించడానికి మరింత మంది మహిళలు ముందుకు వచ్చారు. అక్టోబర్ మాసాంతానికి అలా ఆరోపణలు చేసినవారి జాబితా 80కి మించిపోయింది. ఈ నెల రోజుల కాలంలో మరింత మంది మహిళలు.. వారిలో చాలామంది ప్రముఖులు కూడా.. తమ కథనాలను బహిరంగంగా చెప్పడం మొదలెట్టారు. దీంతో, శక్తివంతులైన ఇతర పెద్దమనుషుల పైకి దృష్టి మళ్లింది. జేమ్స్ టోబాక్ (228 మందికి పైగా మహిళల ఆరోపణలకు గురైనవాడు), నటులు డస్టిన్ హాఫ్‌మ్యాన్, కెవిన్ స్పేసీ, స్టీవెన్ సీగల్, బెన్ అఫ్లెక్, రాజకీయ విశ్లేషకుడు మార్క్ హాల్పెరిన్, మాజీ అమెరికా అధ్యక్షుడు హెడబ్ల్యూ బుష్ (సీనియర్)లు వారిలో ఉన్నారు. రిపబ్లికన్ సెనేట్ అభ్యర్థి, మాజీ న్యాయమూర్తి రాయ్ మూర్స్పైన, డెమోక్రటిక్ పార్టీ సెనేటర్ అల్ ఫ్రాంకెన్ పైన కూడా ఆరో పణలు వచ్చాయి. బుష్ సహా వీరిలో చాలా మంది తమ ప్రవర్తనకు క్షమాపణలు చెప్పారు. మహిళలు చూపిన తెగువే ఈ అంటువ్యాధిని వెలుగులోకి తెచ్చిందనేది స్పష్టమే. సంపన్నులు, పలుకుబడిగలవారైన ప్రముఖ మగవాళ్ల అనుచిత ప్రవర్తన వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు. అయినా, అమెరికాలో ఏదో మార్పు వచ్చినట్టు అనిపిస్తోంది. 2014లోనే సుప్రసిద్ధ విదూషకుడు బిల్ కాస్బీ డజన్ల కొద్దీ మహిళలకు మత్తు మందులిచ్చి, వారిపై అత్యాచారాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుల్లో చాలా వరకు చట్టం పరిమితులకు ఆవల ఉన్నవే (అమెరికాలో, రాష్ట్రాన్ని బట్టి నేరం జరిగిన తర్వాత 3 నుంచి 30 ఏళ్ల తర్వాత అది వెలుగులోకి వస్తే దాన్ని విచారించడానికి వీలు ఉండదు). అయినా కాస్బీకి వ్యతిరేకంగా ఒక కేసు కోర్టులో ఉంది. కాస్బీ కేసు విస్తృతంగా ప్రచారం పొందినా, విన్స్టీన్ కేసులోలాగా ఇంత విస్త్రుతమైన సార్వత్రిక ప్రతిస్పందన అప్పుడు రాలేదు. ఇప్పుడు ప్రతిరోజూ ఒకరిద్దరు ప్రముఖ పురుషుల లీలలు బయటపడుతున్నాయి. అమెరికన్ మహిళ ధిక్కారానికి తగు సమయం ఆసన్నమైనందన్నట్టుగా ఈ అంశంపై ట్వీటర్ వేదికగా అంతర్జాతీయ ఉద్యమం సాగుతోంది. మరి దీని పట్ల భారత్ ప్రతిస్పందన ఎలా ఉంది? లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు ఆరోపణలకు గురైన ప్రముఖ విద్యావేత్తలు అంటే ప్రొఫెసర్లు, ఉపాధ్యాయుల జాబితాను వెల్ల డించడంతో అది ప్రారంభమైంది. ఆ ఆరోపణలు చేసిన బాధితులు అజ్ఞాతంగానే ఉన్నా, ఆ జాబితాను రచ్చకెక్కించిన అమెరికాలోని విద్యార్థి రాయా సర్కార్‌కు వారెవరో తెలుసనేది స్పష్టమే. ఆ జాబితాలో ఉన్న ఒకరు, నవంబర్ 16న మద్రాస్ మ్యూజిక్ అకాడమీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనా మాకు కారణం ఆ ఆరోపణలో, కాదో ఇంకా స్పష్టంగా తెలియలేదు. జాబితాలోని బాధితుల పేర్లను గోప్యంగా ఉండటంపై విమర్శల దాడి జరుగుతోంది. అయితే, మన దేశంలోని లైంగిక హింస చరిత్రను బట్టి చూస్తే, బాధితులు పేర్లు చెప్పకుండా అజ్ఞాతంగా ఉండటంలో ఆశ్చర్యమేమీ లేదు. దేశంలోని లైంగిక హింస బాధితుల్లో 99 శాతం నేరాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయరని ప్రభుత్వ గణాంకాలే చెబు తున్నాయి. అమెరికాలో సైతం, బాధితుల్లో దాదాపు మూడో వంతే ఫిర్యాదు చేస్తుంటారు. లైంగిక దాడి వ్యక్తిగతంగా జరిగే దాడి, ఆ వివరాలను చెప్పడానికి బాధితులు ఇబ్బంది పడుతుంటారు. మన దేశంలోనైతే, ఇంకా పలు ఇతర అంశాలు కూడా పని చేస్తుంటాయి. ఒకటి, మహిళలపై జరిగే హింసకు తరచుగా వారినే తప్పు పట్టే సామాజిక, సాంస్కృతిక వాతావరణం ఉండటం. మనది, ‘పరువు’ ప్రతిష్టలనే భావాల భారాన్ని అన్యాయంగా మహిళలపై మోపే సమాజం. అంతేకాదు, శక్తివంతులైన వారు ఏ తప్పు చేసినాగానీ, దాదాపుగా ఎన్నడూ ఎలాంటి శిక్షకూ గురికాని సమాజం మనది. బాలీవుడ్లో, పలుకుబడంతా కొందరు పురుషుల చేతుల్లోనే అత్యధికంగా పోగుబడి ఉంది. వాళ్లు నటులు లేదా నిర్మాతలు లేదా దర్శకులు ఎవ రైనా కావచ్చు, అత్యంత శక్తివంతులు. వారిపైన ఆరోపణ చేసిన మహిళ ఇక మళ్లీ సినిమా పరిశ్రమలో పని చేయడం మాట మరిచిపోవాల్సిందే. పైగా, అవమా నాలకు గురి కావాల్సి వస్తుంది. ఆ మగాళ్లు మాత్రం దాదాపుగా ఎలాంటి చికాకూ లేకుండా తప్పించుకోగలుగుతారు. రాజకీయాల్లో ఈ పరిస్థితి మరింత అధ్వానం. మహిళలను వేటాడే శక్తివంతులైన రాజకీయవేత్తలకు వ్యతిరేకంగా న్యాయాన్ని పొందడం అసాధ్యం. వ్యక్తుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడం పట్ల రాజ కీయ పార్టీలకు ఏ సంకోచమూ ఉండదు. రహస్యంగా చొరబడి వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించి రికార్డ్ చేసే ‘సెక్స్ టేప్ స్కాండల్స్’లో లాగా... కేవలం ప్రేమలో పడ్డ నేరానికి అమాయక మహిళలను బాధితులను చేస్తారు. ఇంత తలనొప్పి ఉన్నా, ఇది పరిస్థితులను మార్చే కీలక మలుపు కాగలిగితే అద్భుతంగా ఉంటుంది. ప్రోత్సాహకరమైన వాతావరణం ఉండేట్టయితే, లైంగిక వేధింపులకు, హింసకు గురైన భారత బాధిత మహిళలు కూడా, అమెరికాలోని బాధిత మహిళల వలెనే ఆ నేరాలపైకి సమాజం దృష్టిని మళ్లించగలుగుతారు. ఈ బాధ్యతను బాధిత మహిళలపైనే పెట్టడం క్రూరత్వమే. లైంగిక వేధింపులకు అంతం పలకడానికి లేదా కనీస స్థాయికి తగ్గేలా చేయడానికి నిజమైన పరిష్కారం.. చట్టం తక్షణం నేరస్తులను శిక్షించడమే. అయితే, సమస్య, కొంత వరకు సాంస్కృతికమై నది కూడా అయినప్పుడు, సరైన సమయం గొప్ప మార్పును తేగలుగుతుంది. ఇలాంటి సమయాల్లోనే మన జనాభాలో పెద్ద భాగం ఈ అంశంపైకి దృష్టిని మళ్లించి ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని చేజారిపోనివ్వడం అవమానకరం. అనువైన ఈ సమయంలోనే సమాజాన్ని బాధితులపట్ల మరింత సున్నితంగా, సానుభూతితో ఉండేలా చేయగలుగుతాం. బాధితురాలిదే తప్పని తేల్చే పరిస్థితిని సృష్టించిన సామాజిక, సాంస్కృతిక విలువలను పక్కకు నెట్టేయడానికి సమాజం ఇప్పుడైతేనే సుముఖంగా ఉంటుంది. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత‘ aakar.patel@icloud.com -
వీడక వెన్నాడుతూనే ఉండే సమస్య
అవలోకనం స్వాతంత్య్రానికి ముందు నుంచి పాఠశాల విద్యా బోధనకు మాధ్యమంగా ఉండాల్సిన భాషపై వాదోపవాదాలు సాగుతూనే ఉన్నాయి. గోవా ఎన్నికల్లో కొంకణి, మరాఠీ మాద్యమాలకు ప్రాధాన్యాన్నిస్తామన్న బీజేపీ, అధికారంలోకి వచ్చాక అది ఆచరణ సాధ్యం కాదని గుర్తించింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఈ సంక్లిష్ట సమస్యకు పరిష్కారంగా కొన్ని సబ్జెక్టులను గుజరాతీలో, కొన్నిటిని ఇంగ్లిష్‌లో బోధించాలని సూచించారు. అది అమలయ్యేదో, కాదో తెలియకపోయినా అది చక్కటి పరిష్కారం అనిపించింది. ‘భారత బాలల పాఠశాల విద్యా బోధన ఏ భాషా మాధ్యమం ద్వారా జర గాలి?’ సమాధానం చెప్పడం తేలికేం కాదు. ఈ సమస్యకు తన పరిష్కారమే మిటో కొన్నేళ్ల క్రితం- ఇంకా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా నరేంద్ర మోదీ నాతో చెప్పారు. దాన్ని మీకు చెబుతాను. ఇటీవల వెలువడ్డ నాలుగు కథనాల కారణంగా నేనిది రాస్తున్నాను. ఒకటి, గోవాలోని బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించినందుకు గానూ ఆ రాష్ట్ర రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధిపతిని పదవి నుంచి తొలగించడం. ఆర్ఎస్ఎస్ స్థానిక విభాగం గోవాలోని ఇంగ్లిష్ మీడియం పాఠశాలలకు, నిర్దిష్టంగా చర్చి నడిపే 127 ఇంగ్లిష్ మీడియం స్కూళ్లకు ప్రభుత్వ ఆర్థిక సహాయం అందించడాన్ని వ్యతిరేకించింది. గోవా ఎన్నికల్లో గెలవడానికి ముందు బీజేపీ కూడా గోవాలో కొంకణి, మరాఠి మాధ్యమాలకు ప్రాధాన్యమిస్తామని వాగ్దానం చేసింది. కానీ గెలి చాక అది ఆచరణ సాధ్యం కాదని గుర్తించి, ఆ అంశంపై మెతక వైఖరిని చేపట్టింది. స్పష్టమైన సమాధానం లేని ఈ సమస్య సంక్లిష్టమైనదని బీజేపీ గుర్తించింది. స్వాతంత్య్రానికి ముందు నుంచి పాఠశాల విద్యా బోధనకు భాష అనే అంశంపై వాదోపవాదాలు సాగాయి. రవీంద్రనాథ్ టాగూర్, గాంధీ మాతృభాషలోనే విద్యా బోధన జరగాలని అభిప్రాయపడ్డారు. భారత విద్యార్థులకు విదేశీ భాషలో విద్యా బోధన జరిగితే వారిలోని కళాత్మక ప్రతిభ, సృజనాత్మకత అభివృద్ధి చెందవని భావించారు. కాగా, గాంధీ అలా భావించడానికి కారణాలు చాలా వరకు దేశభక్తికి చెందినవి. నెహ్రూ, కేఎం మున్షీలు ఈ చర్చలో ఎదుటి పక్షంగా ఉన్నారు. టాగూర్, గాంధీలు చెప్పినవాటిని వారిరువురూ వ్యతిరేకించలేదుగానీ ఇంగ్లిష్ భాషవల్ల భారత్‌కు కలిగిన ప్రయోజనాలను కోల్పోతామని ఆందోళన చెందారు. బయటి ప్రపంచంలోని జ్ఞానాన్ని, ఆధునిక చట్టపరమైన వ్యవస్థను ఇంగ్లిష్ అందు బాటులోకి తేవడం ఆ ప్రయోజనాల్లో ఒకటి. ఈ నలుగురూ ద్విభాషా ప్రవీణులే కాబట్టి సమస్యను రెండు కోణాల నుంచీ మదింపు చేయగల వారే. చివరికి వారు తమ ప్రాధాన్యాలను బట్టే తమ వైఖరులను నిర్ణయించుకున్నారు. ఇక దీనికి సంబంధించిన రెండవ వార్తా కథనం అటల్ బిహారీ వాజపేయి విశ్వవిద్యాలయం నుంచి వచ్చినది. హిందీ భాషలో మాత్రమే బోధించే ఈ విశ్వవిద్యాలయం తన కోర్సులకు విద్యార్థులను ఆకర్షించడంలో తంటాలు పడు తోంది. ప్రత్యేకించి ఈ సమస్య ఇంజనీరింగ్ కోర్సుల విషయంలో కనబడుతోం దని ఆ వార్తా నివేదిక తెలిపింది. ఆ డిగ్రీతో తమకు ఉద్యోగాలు రావని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పైగా తమకు అప్పటికే సుపరిచితమైన ప్రాథమిక ఇంజనీరింగ్ పదజాలానికి బదులు కొత్తగా రూపొందించిన హిందీ పదజాలంతో విద్యా బోధన సాగే కోర్సులో చేరాలంటే భయపడుతున్నారు. అందువల్ల నగర్ (సివిల్), విద్యుత్ (ఎలక్ట్రికల్), యాంత్రిక్ (మెకానికల్) విభాగాలలో ఈ ఏడాది డజను మంది విద్యార్థులు మాత్రమే చేరారు. అయితే ఆ విశ్వవిద్యాలయం నిరుత్సాహపడలేదు. ‘‘ఒక్క విద్యార్థి చేరినా ఈ ఏడాది ఈ కోర్సులను ప్రారం భించడానికి సిద్ధంగా ఉన్నాం. మేం ఏటికి ఎదురీదుతున్నాం. ఇంగ్లిష్ వేళ్లూను కొనడానికి 250 ఏళ్లు పట్టింది. హిందీకి కొన్నేళ్లయినా పడుతుంది’’ అని ఏబీవీ హెచ్వీ వైస్-చాన్స్‌లర్ ప్రొఫెసర్ మోహన్‌లాల్ చ్చీపా అన్నట్టు అది పేర్కొంది. ఇక మూడో వార్తా నివేదిక హిందీలో ప్రచురితమైన చట్టాలు లేకపోవడం. చట్టాలన్నిటినీ ఇంగ్లిష్‌లో చేసి, హిందీలోకి తర్జుమా చేయాల్సి ఉంది. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి దాదాపు 200 చట్టాలున్నాయి. ‘ఆ చట్టాలు, నిబంధన లన్నీ ఆన్‌లైన్‌లోనూ, కొత్తగా డిజిటలైజ్ చేసిన భారత గెజిట్ వెబ్సైట్లోనూ కూడా అందుబాటులో ఉన్నాయి. హాయిగా మీరు ఏ చట్టం కోసమైన శోధించ వచ్చు. కాకపోతే అవన్నీ ఇంగ్లిష్‌లోనే ఉన్నాయి’ అని అది తెలిపింది. అందుకు ఒక కారణం ప్రజలు ఇంగ్లిష్ పదజాలంతో సుపరిచితులై ఉంటారు. అప్పటికే సుప రిచిత మై, అందుబాటులో ఉన్నవాటిని మార్పు చేస్తే గందరగోళం ఏర్పడుతుంది. హిందీలో చట్టాలు కావాలనే వారు కొరవడటం కూడా కారణం కావచ్చు. ఇక నాలుగవ కథనం బిహార్‌కు చెందిన ఒక బాలుడు మోదీకి ప్రభుత్వ పాఠ శాలల్లోని అధ్వాన పరిస్థితులను వివరిస్తూ, ఇంగ్లిష్‌ను తప్పనిసరి బోధనాంశంగా ప్రవేశ పెట్టాలని కోరుతూ రాసిన లేఖ. ‘‘నా తండ్రి సంపాదన అంతంత మాత్రం. కాబట్టి మేం మా ప్రాథమిక విద్యను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకోవాల్సి వస్తోంది. ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్‌ను బోధించమని మీరు బిహార్ ప్రభు త్వాన్ని కోరాలని నా విన్నపం. లేకపోతే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులం ఉన్నత తరగతులలో చాలా ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని రాశాడా బాలుడు. ఇది, మోదీ అన్ని కోణాల నుంచి అర్థం చేసుకోగలిగిన సమస్య. గుజరాత్ ప్రభుత్వ పాఠశాలల్లో 5వ తరగతి వరకు ఇంగ్లిష్ బోధనను ఆర్ఎస్ఎస్ అడ్డుకుంది. కొన్ని సబ్జెక్టులను గుజరాతీలో, కొన్నిటిని ఇంగ్లిష్‌లో బోధించాలనేది మోదీ నాకు వివ రించిన పరిష్కారం. నాకు సరిగ్గానే గుర్తున్నట్టయితే ఆయన గణితం, విజ్ఞానశాస్త్రా లను ఇంగ్లిష్‌లోనూ, చరిత్ర, భౌగోళికశాస్త్రాలను గుజరాతీలోనూ బోధించాల న్నారు. ఆర్ఎస్ఎస్ ఒత్తిడికి చివరికది అమలయ్యేనా అనేది తెలియకపోయినా నాకైతే అది చక్కటి పరిష్కారం అనిపించింది. అయితే ఇక్కడ కూడా సమస్య పిల్లలకు ఇంగ్లిష్ బోధించేది ఎవరు అనే సమాధానం లేని ప్రశ్న, అది బోధించడానికి తగినంతగా ఇంగ్లిష్‌ను ఎరిగినవారు కొద్ది మందే ఉన్న దేశమిది. అలా అని మనకేమీ పదుల లక్షలలో అర్హులైన వ్యక్తులు అవసరం కారు. నేను ఇంతకు ముందే చెప్పినట్టు ఇది సమాధానం చెప్పడం కష్ట మైన సమస్య. చాలా సుదీర్ఘ కాలం పాటూ ఈ సమస్య మనల్ని వెన్నాడుతూనే ఉంటుంది. ఎందుకంటే మనది ఉన్నత వర్గాల వారంతా ఒక విదేశీ భాషలో మాట్లాడే ఏకైక ముఖ్య దేశం. వ్యాసకర్త:ఆకార్ పటేల్ కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
విశ్వసనీయత సరే.. తీరని ఆశల మాటేమిటి?
అవలోకనం బరాక్ ఒబామా 2008లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు మీడియా మొఘల్ రూపర్ట్ మర్దోక్ మాట్లాడుతూ, గతంలోని అధ్యక్షులు తీసుకొచ్చిన గొప్ప మార్పులు వారు అధికారం చేపట్టిన తొలి ఆరు నెలల్లోనే సంభవించాయని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత వారు వ్యవస్థ చట్రంలో ఇరుక్కుపోయారని, ప్రతిఘటన కూడా చేయలేక, ఏ గొప్ప మార్పునైనా సరే తీసుకురాలేకపోయారని మర్దోక్ పేర్కొన్నారు. మరి ప్రధాని మోదీ మాటేమిటి? దశాబ్దాల కాలంలో అత్యంత ప్రాచుర్యం పొందిన, విశ్వసనీయమైన భారత నేతగా నరేంద్ర మోదీ తన స్థానాన్ని దృఢపర్చుకున్న సంవత్సరం 2015. ఇందిరా గాంధీ హయాంలోనే కాదు.. జవహర్లాల్ నెహ్రూ కాలంలో కూడా ఇంత ప్రజాదరణను, ఇంత జనాకర్షణను పొందిన నేతను మనం చూడలేదు. మహత్తర మార్పును వాగ్దానం చేస్తూ మోదీ అధికారంలోకి వచ్చారు. అయితే ఇంతవరకూ ఆ మార్పు జరగలేదు. నిజమే. మోదీ పాలనలో భారీ అవినీతి కుంభకోణాలపై చాలా తక్కువ కథనాలే వచ్చాయి. కానీ, మన్మోహన్ సింగ్ పాలన కంటే, అంతకు క్రితం పాలించిన వారికంటే మోదీ పాలనలో భారత్ ఏమైనా విభిన్నంగా ఉందా? అధికారం చేపట్టినప్పుడు మోదీ ప్రారంభించిన కీలకమైన పథకాలు పరిశీ లకులనే నివ్వెరపరిచాయి. స్వచ్ఛభారత్ అనేది మరుగుదొడ్లను నిర్మించడానికి సంబంధించి దశాబ్దాలుగా అమలులో ఉన్న పథకాలకు పేరు మార్పిడీయేనా? అయితే మంచిదే. కానీ ప్రధాని చీపురు చేపట్టి వీధులను ఊడ్చారు. అంటే స్వచ్ఛ భారత్ కేవలం పరిశుభ్రతకు సంబంధించిందీ, ఆరోగ్యంగా ఉండవలసిందిగా భారతీయులను ప్రోత్సహించేదీ మాత్రమేనా? అదే అయితే సామాజిక సంస్కరణ చేయడమే ప్రభుత్వ విధి అని చెప్పవచ్చా? కుటుంబ నియంత్రణను ప్రోత్సహిం చడం, మద్యనిషేధం అమలు, ఆడ శిశువుల హత్యలను నిరోధించడం వగైరా రూపాల్లో ప్రభుత్వం ఇప్పటికే సామాజిక సంస్కరణను చేపట్టిందని ఎవరైనా వాదించవచ్చు. కానీ వాటితో పోలిస్తే పరిశుభ్రత అనేది తగ్గు స్థాయికి సంబంధిం చింది. స్వచ్ఛ భారత్ ఉద్దేశం అర్థవంతమైనదే అయినప్పటికీ, పన్ను రాబడిపై ఎందుకు దృష్టి కేంద్రీకరిస్తున్నారన్నది ఎవరూ చెప్పలేకపోతున్నారు. పైగా, పదేళ్ల మన్మోహన్ సింగ్ హయాంతో పోలిస్తే, సగటున ఆర్థిక వ్యవస్థ మందకొడి దిశగా వృద్ధి చెందుతోంది. ప్రభుత్వ చెల్లింపుల షీట్‌ను బలోపేతం చేయడానికి, పూర్తిగా పతనమైన ముడి చమురు ధరలను మోదీ బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నారు. లేకుంటే ఆర్థిక వ్యవస్థ నీరసించిపోయేది. తన వేగ వృద్ధి వల్ల కాకుండా చైనా వృద్ధి రేటు మందగిస్తున్న నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థగా భారత్ పేరు పొందుతోంది. మోదీ ప్రకటించిన భారీ పారిశ్రామిక విధానం మేక్ ఇన్ ఇండియా ఒక అద్భు తమైన లోగో. ఎంతో అట్టహాసంగా దీన్ని ప్రారంభించారు కానీ ఇక్కడ కూడా ఈ విధానం ఉద్దేశం ఏమిటన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. చివరికి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌తోపాటు అనేకమంది నిపుణులు సైతం వస్తూత్పత్తి రంగాన్ని చైనా నుంచి భారత్‌కు ఆకర్షించవచ్చన్న భావాన్నే తోసిపుచ్చారు. ఇక ప్రతీకాత్మకతకు సంబం ధించి చూస్తే, ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం (వల్లభ్ భాయ్ పటేల్‌ది) గుజరాత్లో నిర్మిస్తామని ప్రకటించారు. కానీ దాన్ని చైనీయులు నిర్మించబోతు న్నారని తర్వాత తెలిసింది. మొట్టమొదటి భారత బుల్లెట్ ట్రెయిన్ నిర్మాణం కోసం తేలికపాటి రుణాన్ని అందిస్తామని జపానీయులు ప్రతిపాదించారు కానీ, 99,000 కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టు వ్యయం గురించి నేను చదివిన ఏ ఆర్థికవేత్త కూడా ప్రస్తావించినట్లు లేదు. విదేశీ విధానానికి సంబంధించి, మోదీ రెండు కీలక అంశాలు పూర్తి చేశారు. అత్యంత భారీ జనాకర్షణ ద్వారా విదేశీ నగరాల్లోని ప్రవాస భారతీయులను ఆయన అద్భుతంగా సమీకరించారు. ఈ భారీ జన సమీకరణ ప్రయోజనం ఏమి టన్నది స్పష్టం కావడం లేదు. దీనికి సంబంధించిన పొందికయిన వివరణ బహుశా భవిష్యత్తులో రావచ్చు. ఇక పాకిస్తాన్ విషయంలో నా అంచనా ప్రకారం మోదీ ప్రభుత్వం గత 18 నెలల కాలంలో తన వైఖరిని కనీసం 9 సార్లు మార్చు కుంది. దౌత్య నిపుణులతో సహా ఏ ఒక్కరికీ పాకిస్తాన్ పట్ల భారత్ విధానం ఏమిటి లేక అసలు అలాంటి విధానం ఏమైనా ఉందా అనేది నిజంగానే తెలీటం లేదు. ఇప్పటికైతే మనం పాక్‌తో మళ్లీ చర్చిస్తున్నట్లుగా కనిపిస్తుంది. కానీ ఇంతకు ముందే ఎందుకు చర్చించలేకపోయాం? లేక వచ్చే నెలలో మనం చర్చలు కొనసాగించగలుగుతామా? అని ఎవరూ చెప్పలేరు. ఎన్నికల ప్రచార సమయంలో మోదీ చేసిన కొన్ని వాగ్దానాలు మృదువుగా చెప్పాలంటే అసత్యాలుగా పరిణమించాయి. ఉదాహరణకు, నల్లధనాన్ని వెనక్కు తీసుకువస్తానని ఆయన ప్రకటించారు. మరో ఉదాహరణ.. అవినీతి ఆరోపణలకు గురైన ఎవరినైనా తాను కాపాడబోనని మోదీ తేల్చి చెప్పారు. తన వ్యవహారశైలిని అలా పక్కనబెడితే, మోదీ అత్యంత విశ్వసనీయత కలిగి ఉన్నారు. పైగా తిరుగులేని జనాకర్షణ ఉంది కూడా. ఆయన రేటింగులు 75 శాతం మార్కును చేరుకుంటున్నట్లు పోల్ సర్వేలు నిత్యం సూచిస్తున్నాయి. అంటే బీజేపీయేతర ఓటర్లనుంచే ఆయనకు మద్దతు అధికంగా వస్తోందని దీని అర్థం. (జాతీయ ఓటులో బీజేపీకి దక్కింది 32 శాతమే). ఆయన నిజంగానే శక్తివంతు డిగా, అర్థవంతమైన నేతగా, నిజాయితీపరుడిగా గుర్తింపు పొందారు. తన ఈ ప్రజాదరణనే మోదీ బిహార్ ఎన్నికల ప్రచారంలో దూకుడుగా ఉపయోగించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినప్పటికీ, ఆ ఎన్నికల్లో తన శక్తిమేరా ఆయన కృషి చేశారు. ఎన్నికల ప్రచారం పొడవునా ఆయన ఉపయో గించిన కటువైన పదజాలం ఫలితంగా కేంద్రాన్ని పనిచేయనివ్వడంలో ప్రతిపక్షం ఎలాంటి ప్రోత్సాహాన్ని అందివ్వలేదు. ఈ విషయంలో మాత్రం సోనియాగాంధీ కుటుంబం సంవత్సరం మొత్తం మీద పేలవమైన పనితీరునే ప్రదర్శించింది. పరాభవం నుంచి కోలుకోవడానికి స్పష్టమైన వ్యూహం వారికి లేకుండాపోయింది. తాము రంగంలో ఇంకా ఉన్నా మని చూపించుకునేందుకు వారు పార్లమెంటును అడ్డుకోవడం వంటి ఎత్తు గడలను ఉపయోగించారు. ఒక ఎత్తుగడగా ఇది బాగున్నా, ప్రధాని దార్శనికతకు ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదించలేక ఇది అసంపూర్తిగానే మిగిలిపోయింది. బిహార్, గుజరాత్‌లలో ఆయన పార్టీ కాస్త వెనుకబడినట్లు కనిపిస్తున్నప్పటికీ మోదీ మాత్రం ఇప్పటికీ అగ్రస్థానంలోనే ఉన్నారు. వందకోట్లమందికి పైగా భారతీయులు ఆయనలో ఇంకా విశ్వాసాన్ని, ఆశను కలిగి ఉంటున్నారు. మోదీ పదేళ్లపాటు అధికారంలో ఉంటారని కశ్మీర్ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి, అత్యంత అనుభవజ్ఞుడైన రాజకీయ నేత ముఫ్తీ మహమ్మద్ తేల్చి చెబుతున్నారు. ముఫ్తీ అభిప్రాయం నిజమే అయితే ప్రధానిగా 18 నెలల కాలం ఏమంత ముఖ్యమైనది కాదు. అయితే బరాక్ ఒబామా 2008లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు మీడియా మొఘల్ రూపర్ట్ మర్దోక్ మాట్లాడుతూ, గతంలోని అధ్యక్షులు తీసుకొచ్చిన గొప్ప మార్పులు వారు అధికారం చేపట్టిన తొలి ఆరు నెలల్లోనే సంభవించాయని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత వారు వ్యవస్థ చట్రంలో ఇరుక్కుపోయారని, ప్రతిఘటన కూడా చేయలేక, ఏ గొప్ప మార్పునైనా సరే తీసుకురాలేకపోయారని మర్దోక్ పేర్కొన్నారు. ఇది నిజమైతే, నవ్య భారత్‌ను రూపు దిద్దడానికి అసంపూర్ణమైన, చెదిరి పోయిన ఆవిష్కరణలను ప్రధాని మోదీ ప్రకటించడం కంటే తన ప్రజాదరణను, విశ్వసనీయతను ఉన్నత స్థాయిలో నిలుపుకోవడానికి ఇతర మార్గాలను కనుగొనవలసి ఉంటుంది. వ్యాసకర్త కాలమిస్టు, రచయిత: అకార్ పటేల్( aakar.patel@icloud.com)