వీడక వెన్నాడుతూనే ఉండే సమస్య | akaar patel opinion on languages in schools | Sakshi
Sakshi News home page

వీడక వెన్నాడుతూనే ఉండే సమస్య

Published Sun, Sep 4 2016 1:00 AM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM

వీడక వెన్నాడుతూనే ఉండే సమస్య

వీడక వెన్నాడుతూనే ఉండే సమస్య

అవలోకనం

స్వాతంత్య్రానికి ముందు నుంచి పాఠశాల విద్యా బోధనకు మాధ్యమంగా ఉండాల్సిన భాషపై వాదోపవాదాలు సాగుతూనే ఉన్నాయి. గోవా ఎన్నికల్లో కొంకణి, మరాఠీ మాద్యమాలకు ప్రాధాన్యాన్నిస్తామన్న బీజేపీ, అధికారంలోకి వచ్చాక అది ఆచరణ సాధ్యం కాదని గుర్తించింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఈ సంక్లిష్ట సమస్యకు పరిష్కారంగా కొన్ని సబ్జెక్టులను గుజరాతీలో, కొన్నిటిని ఇంగ్లిష్‌లో బోధించాలని సూచించారు. అది అమలయ్యేదో, కాదో తెలియకపోయినా అది చక్కటి పరిష్కారం అనిపించింది.
 
‘భారత బాలల పాఠశాల విద్యా బోధన ఏ భాషా మాధ్యమం ద్వారా జర గాలి?’ సమాధానం చెప్పడం తేలికేం కాదు. ఈ సమస్యకు తన పరిష్కారమే మిటో కొన్నేళ్ల క్రితం- ఇంకా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా  నరేంద్ర మోదీ నాతో చెప్పారు. దాన్ని మీకు చెబుతాను.
 
ఇటీవల వెలువడ్డ నాలుగు కథనాల కారణంగా నేనిది రాస్తున్నాను. ఒకటి, గోవాలోని బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించినందుకు గానూ ఆ రాష్ట్ర రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధిపతిని పదవి నుంచి తొలగించడం. ఆర్‌ఎస్‌ఎస్ స్థానిక విభాగం గోవాలోని ఇంగ్లిష్ మీడియం పాఠశాలలకు, నిర్దిష్టంగా చర్చి నడిపే 127 ఇంగ్లిష్ మీడియం స్కూళ్లకు ప్రభుత్వ ఆర్థిక సహాయం అందించడాన్ని వ్యతిరేకించింది. గోవా ఎన్నికల్లో గెలవడానికి ముందు బీజేపీ కూడా గోవాలో కొంకణి, మరాఠి మాధ్యమాలకు ప్రాధాన్యమిస్తామని వాగ్దానం చేసింది. కానీ గెలి చాక అది ఆచరణ సాధ్యం కాదని గుర్తించి, ఆ అంశంపై మెతక వైఖరిని చేపట్టింది.

స్పష్టమైన సమాధానం లేని ఈ సమస్య సంక్లిష్టమైనదని బీజేపీ గుర్తించింది. స్వాతంత్య్రానికి ముందు నుంచి పాఠశాల విద్యా బోధనకు భాష అనే అంశంపై వాదోపవాదాలు సాగాయి. రవీంద్రనాథ్ టాగూర్, గాంధీ మాతృభాషలోనే విద్యా బోధన జరగాలని అభిప్రాయపడ్డారు. భారత విద్యార్థులకు విదేశీ భాషలో విద్యా బోధన జరిగితే వారిలోని కళాత్మక ప్రతిభ, సృజనాత్మకత అభివృద్ధి చెందవని భావించారు. కాగా, గాంధీ అలా భావించడానికి కారణాలు చాలా వరకు దేశభక్తికి చెందినవి. నెహ్రూ, కేఎం మున్షీలు ఈ చర్చలో ఎదుటి పక్షంగా ఉన్నారు. టాగూర్, గాంధీలు చెప్పినవాటిని వారిరువురూ వ్యతిరేకించలేదుగానీ ఇంగ్లిష్ భాషవల్ల భారత్‌కు కలిగిన ప్రయోజనాలను కోల్పోతామని ఆందోళన చెందారు. బయటి ప్రపంచంలోని జ్ఞానాన్ని, ఆధునిక చట్టపరమైన వ్యవస్థను ఇంగ్లిష్ అందు బాటులోకి తేవడం ఆ ప్రయోజనాల్లో ఒకటి. ఈ నలుగురూ ద్విభాషా ప్రవీణులే కాబట్టి సమస్యను రెండు కోణాల నుంచీ మదింపు చేయగల వారే. చివరికి వారు తమ ప్రాధాన్యాలను బట్టే తమ వైఖరులను నిర్ణయించుకున్నారు.

ఇక దీనికి సంబంధించిన రెండవ వార్తా కథనం అటల్ బిహారీ వాజపేయి విశ్వవిద్యాలయం నుంచి వచ్చినది. హిందీ భాషలో మాత్రమే బోధించే ఈ విశ్వవిద్యాలయం తన కోర్సులకు విద్యార్థులను ఆకర్షించడంలో తంటాలు పడు తోంది. ప్రత్యేకించి ఈ సమస్య ఇంజనీరింగ్ కోర్సుల విషయంలో కనబడుతోం దని ఆ వార్తా నివేదిక తెలిపింది. ఆ డిగ్రీతో తమకు ఉద్యోగాలు రావని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పైగా తమకు అప్పటికే సుపరిచితమైన ప్రాథమిక ఇంజనీరింగ్ పదజాలానికి బదులు కొత్తగా రూపొందించిన హిందీ పదజాలంతో విద్యా బోధన సాగే కోర్సులో చేరాలంటే భయపడుతున్నారు. అందువల్ల నగర్ (సివిల్), విద్యుత్ (ఎలక్ట్రికల్), యాంత్రిక్ (మెకానికల్) విభాగాలలో ఈ ఏడాది డజను మంది విద్యార్థులు మాత్రమే చేరారు. అయితే ఆ విశ్వవిద్యాలయం నిరుత్సాహపడలేదు. ‘‘ఒక్క విద్యార్థి చేరినా ఈ ఏడాది ఈ కోర్సులను ప్రారం భించడానికి సిద్ధంగా ఉన్నాం. మేం ఏటికి ఎదురీదుతున్నాం. ఇంగ్లిష్ వేళ్లూను కొనడానికి 250 ఏళ్లు పట్టింది. హిందీకి కొన్నేళ్లయినా పడుతుంది’’ అని ఏబీవీ హెచ్‌వీ వైస్-చాన్స్‌లర్ ప్రొఫెసర్ మోహన్‌లాల్ చ్చీపా అన్నట్టు అది పేర్కొంది.

ఇక మూడో వార్తా నివేదిక హిందీలో ప్రచురితమైన చట్టాలు లేకపోవడం. చట్టాలన్నిటినీ ఇంగ్లిష్‌లో చేసి, హిందీలోకి తర్జుమా చేయాల్సి ఉంది. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి దాదాపు 200 చట్టాలున్నాయి. ‘ఆ చట్టాలు, నిబంధన లన్నీ ఆన్‌లైన్‌లోనూ, కొత్తగా డిజిటలైజ్ చేసిన భారత గెజిట్ వెబ్‌సైట్‌లోనూ కూడా అందుబాటులో ఉన్నాయి. హాయిగా మీరు ఏ చట్టం కోసమైన శోధించ వచ్చు. కాకపోతే అవన్నీ ఇంగ్లిష్‌లోనే ఉన్నాయి’ అని అది తెలిపింది. అందుకు ఒక కారణం ప్రజలు ఇంగ్లిష్ పదజాలంతో సుపరిచితులై ఉంటారు. అప్పటికే సుప రిచిత మై, అందుబాటులో ఉన్నవాటిని మార్పు చేస్తే గందరగోళం  ఏర్పడుతుంది. హిందీలో చట్టాలు కావాలనే వారు కొరవడటం కూడా కారణం కావచ్చు.

ఇక నాలుగవ కథనం బిహార్‌కు చెందిన ఒక బాలుడు మోదీకి ప్రభుత్వ పాఠ శాలల్లోని అధ్వాన పరిస్థితులను వివరిస్తూ, ఇంగ్లిష్‌ను తప్పనిసరి బోధనాంశంగా ప్రవేశ పెట్టాలని కోరుతూ రాసిన లేఖ. ‘‘నా తండ్రి సంపాదన అంతంత మాత్రం. కాబట్టి మేం మా ప్రాథమిక విద్యను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకోవాల్సి వస్తోంది. ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్‌ను బోధించమని మీరు బిహార్ ప్రభు త్వాన్ని కోరాలని నా విన్నపం. లేకపోతే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులం ఉన్నత తరగతులలో చాలా ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని రాశాడా బాలుడు. ఇది, మోదీ అన్ని కోణాల నుంచి అర్థం చేసుకోగలిగిన సమస్య. గుజరాత్ ప్రభుత్వ పాఠశాలల్లో 5వ తరగతి వరకు ఇంగ్లిష్ బోధనను ఆర్‌ఎస్‌ఎస్ అడ్డుకుంది. కొన్ని సబ్జెక్టులను గుజరాతీలో, కొన్నిటిని ఇంగ్లిష్‌లో బోధించాలనేది మోదీ నాకు వివ రించిన పరిష్కారం. నాకు సరిగ్గానే గుర్తున్నట్టయితే ఆయన గణితం, విజ్ఞానశాస్త్రా లను ఇంగ్లిష్‌లోనూ, చరిత్ర, భౌగోళికశాస్త్రాలను గుజరాతీలోనూ బోధించాల న్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ఒత్తిడికి చివరికది అమలయ్యేనా అనేది తెలియకపోయినా నాకైతే అది చక్కటి పరిష్కారం అనిపించింది.

అయితే ఇక్కడ కూడా సమస్య పిల్లలకు ఇంగ్లిష్ బోధించేది ఎవరు అనే సమాధానం లేని ప్రశ్న, అది బోధించడానికి తగినంతగా ఇంగ్లిష్‌ను ఎరిగినవారు కొద్ది మందే ఉన్న దేశమిది. అలా అని మనకేమీ పదుల లక్షలలో అర్హులైన వ్యక్తులు అవసరం కారు. నేను ఇంతకు ముందే చెప్పినట్టు ఇది సమాధానం చెప్పడం కష్ట మైన సమస్య. చాలా సుదీర్ఘ కాలం పాటూ ఈ సమస్య మనల్ని వెన్నాడుతూనే ఉంటుంది. ఎందుకంటే మనది ఉన్నత వర్గాల వారంతా ఒక విదేశీ భాషలో మాట్లాడే ఏకైక ముఖ్య దేశం.

వ్యాసకర్త:ఆకార్ పటేల్
కాలమిస్టు, రచయిత
aakar.patel@icloud.com

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement