ప్రోత్సాహకర వాతావరణం ఉంటే లైంగిక వేధింపులకు, హింసకు గురైన భారత బాధిత మహిళలు కూడా, అమెరికాలోలాగే ఆ నేరాలపైకి సమాజం దృష్టిని మళ్లించగలుగుతారు. ఈ బాధ్యతను బాధిత మహిళలపైనే పెట్టడం క్రూరత్వమే. లైంగిక వేధింపులకు అంతం పలకడానికి లేదా కనీస స్థాయికి తగ్గేలా చేయడానికి నిజమైన పరిష్కారం.. చట్టం తక్షణం నేరస్తులను శిక్షించడమే.
హాలీవుడ్ నిర్మాత హార్వే విన్‌స్టీన్ లైంగికపరమైన తప్పుడు నడవడికను గురించిన కథనాన్ని అక్టోబర్ 5న న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రచురించింది. హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విన్‌స్టీన్ అత్యంత శకివంతుడైన వ్యక్తి, ది కింగ్స్ స్పీచ్ వంటి ఆస్కార్ అవార్డులను గెలుచుకున్న సినిమాలను నిర్మించినవాడు. అతగాడి లైంగిక వేధింపు లకు, దాడులకు గురైన మహిళల సొంత కథనాలను ఆ పత్రిక పేర్కొంది. ఆ కథనం Ðð లువడ్డాక, విన్‌స్టీన్ లైంగిక దాడుల గురించి వెల్లడించడానికి మరింత మంది మహిళలు ముందుకు వచ్చారు. అక్టోబర్ మాసాంతానికి అలా ఆరోపణలు చేసినవారి జాబితా 80కి మించిపోయింది. ఈ నెల రోజుల కాలంలో మరింత మంది మహిళలు.. వారిలో చాలామంది ప్రముఖులు కూడా.. తమ కథనాలను బహిరంగంగా చెప్పడం మొదలెట్టారు. దీంతో, శక్తివంతులైన ఇతర పెద్దమనుషుల పైకి దృష్టి మళ్లింది.
జేమ్స్ టోబాక్ (228 మందికి పైగా మహిళల ఆరోపణలకు గురైనవాడు), నటులు డస్టిన్ హాఫ్‌మ్యాన్, కెవిన్ స్పేసీ, స్టీవెన్ సీగల్, బెన్ అఫ్లెక్, రాజకీయ విశ్లేషకుడు మార్క్ హాల్‌పెరిన్, మాజీ అమెరికా అధ్యక్షుడు హెడబ్ల్యూ బుష్ (సీనియర్)లు వారిలో ఉన్నారు. రిపబ్లికన్ సెనేట్ అభ్యర్థి, మాజీ న్యాయమూర్తి రాయ్ మూర్స్‌పైన, డెమోక్రటిక్ పార్టీ సెనేటర్ అల్ ఫ్రాంకెన్ పైన కూడా ఆరో పణలు వచ్చాయి. బుష్ సహా వీరిలో చాలా మంది తమ ప్రవర్తనకు క్షమాపణలు చెప్పారు. మహిళలు చూపిన తెగువే ఈ అంటువ్యాధిని వెలుగులోకి తెచ్చిందనేది స్పష్టమే. సంపన్నులు, పలుకుబడిగలవారైన ప్రముఖ మగవాళ్ల అనుచిత ప్రవర్తన వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు. అయినా, అమెరికాలో ఏదో మార్పు వచ్చినట్టు అనిపిస్తోంది.
2014లోనే సుప్రసిద్ధ విదూషకుడు బిల్ కాస్బీ డజన్ల కొద్దీ మహిళలకు మత్తు మందులిచ్చి, వారిపై అత్యాచారాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుల్లో చాలా వరకు చట్టం పరిమితులకు ఆవల ఉన్నవే (అమెరికాలో, రాష్ట్రాన్ని బట్టి నేరం జరిగిన తర్వాత 3 నుంచి 30 ఏళ్ల తర్వాత అది వెలుగులోకి వస్తే దాన్ని విచారించడానికి వీలు ఉండదు). అయినా కాస్బీకి వ్యతిరేకంగా ఒక కేసు కోర్టులో ఉంది. కాస్బీ కేసు విస్తృతంగా ప్రచారం పొందినా, విన్‌స్టీన్ కేసులోలాగా ఇంత విస్త్రుతమైన సార్వత్రిక ప్రతిస్పందన అప్పుడు రాలేదు. ఇప్పుడు ప్రతిరోజూ ఒకరిద్దరు ప్రముఖ పురుషుల లీలలు బయటపడుతున్నాయి.
అమెరికన్ మహిళ ధిక్కారానికి తగు సమయం ఆసన్నమైనందన్నట్టుగా ఈ అంశంపై ట్వీటర్ వేదికగా అంతర్జాతీయ ఉద్యమం సాగుతోంది. మరి దీని పట్ల భారత్ ప్రతిస్పందన ఎలా ఉంది? లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు ఆరోపణలకు గురైన ప్రముఖ విద్యావేత్తలు అంటే ప్రొఫెసర్లు, ఉపాధ్యాయుల జాబితాను వెల్ల డించడంతో అది ప్రారంభమైంది. ఆ ఆరోపణలు చేసిన బాధితులు అజ్ఞాతంగానే ఉన్నా, ఆ జాబితాను రచ్చకెక్కించిన అమెరికాలోని విద్యార్థి రాయా సర్కార్‌కు వారెవరో తెలుసనేది స్పష్టమే. ఆ జాబితాలో ఉన్న ఒకరు, నవంబర్ 16న మద్రాస్ మ్యూజిక్ అకాడమీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనా మాకు కారణం ఆ ఆరోపణలో, కాదో ఇంకా స్పష్టంగా తెలియలేదు. జాబితాలోని బాధితుల పేర్లను గోప్యంగా ఉండటంపై విమర్శల దాడి జరుగుతోంది. అయితే, మన దేశంలోని లైంగిక హింస చరిత్రను బట్టి చూస్తే, బాధితులు పేర్లు చెప్పకుండా అజ్ఞాతంగా ఉండటంలో ఆశ్చర్యమేమీ లేదు. దేశంలోని లైంగిక హింస బాధితుల్లో 99 శాతం నేరాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయరని ప్రభుత్వ గణాంకాలే చెబు తున్నాయి. అమెరికాలో సైతం, బాధితుల్లో దాదాపు మూడో వంతే ఫిర్యాదు చేస్తుంటారు. లైంగిక దాడి వ్యక్తిగతంగా జరిగే దాడి, ఆ వివరాలను చెప్పడానికి బాధితులు ఇబ్బంది పడుతుంటారు.
మన దేశంలోనైతే, ఇంకా పలు ఇతర అంశాలు కూడా పని చేస్తుంటాయి. ఒకటి, మహిళలపై జరిగే హింసకు తరచుగా వారినే తప్పు పట్టే సామాజిక, సాంస్కృతిక వాతావరణం ఉండటం. మనది, ‘పరువు’ ప్రతిష్టలనే భావాల భారాన్ని అన్యాయంగా మహిళలపై మోపే సమాజం. అంతేకాదు, శక్తివంతులైన వారు ఏ తప్పు చేసినాగానీ, దాదాపుగా ఎన్నడూ ఎలాంటి శిక్షకూ గురికాని సమాజం మనది. బాలీవుడ్‌లో, పలుకుబడంతా కొందరు పురుషుల చేతుల్లోనే అత్యధికంగా పోగుబడి ఉంది. వాళ్లు నటులు లేదా నిర్మాతలు లేదా దర్శకులు ఎవ రైనా కావచ్చు, అత్యంత శక్తివంతులు. వారిపైన ఆరోపణ చేసిన మహిళ ఇక మళ్లీ సినిమా పరిశ్రమలో పని చేయడం మాట మరిచిపోవాల్సిందే. పైగా, అవమా నాలకు గురి కావాల్సి వస్తుంది. ఆ మగాళ్లు మాత్రం దాదాపుగా ఎలాంటి చికాకూ లేకుండా తప్పించుకోగలుగుతారు. రాజకీయాల్లో ఈ పరిస్థితి మరింత అధ్వానం. మహిళలను వేటాడే శక్తివంతులైన రాజకీయవేత్తలకు వ్యతిరేకంగా న్యాయాన్ని పొందడం అసాధ్యం. వ్యక్తుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడం పట్ల రాజ కీయ పార్టీలకు ఏ సంకోచమూ ఉండదు. రహస్యంగా చొరబడి వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించి రికార్డ్ చేసే ‘సెక్స్ టేప్ స్కాండల్స్’లో లాగా... కేవలం ప్రేమలో పడ్డ నేరానికి అమాయక మహిళలను బాధితులను చేస్తారు.
ఇంత తలనొప్పి ఉన్నా, ఇది పరిస్థితులను మార్చే కీలక మలుపు కాగలిగితే అద్భుతంగా ఉంటుంది. ప్రోత్సాహకరమైన వాతావరణం ఉండేట్టయితే, లైంగిక వేధింపులకు, హింసకు గురైన భారత బాధిత మహిళలు కూడా, అమెరికాలోని బాధిత మహిళల వలెనే ఆ నేరాలపైకి సమాజం దృష్టిని మళ్లించగలుగుతారు. ఈ బాధ్యతను బాధిత మహిళలపైనే పెట్టడం క్రూరత్వమే. లైంగిక వేధింపులకు అంతం పలకడానికి లేదా కనీస స్థాయికి తగ్గేలా చేయడానికి నిజమైన పరిష్కారం.. చట్టం తక్షణం నేరస్తులను శిక్షించడమే. అయితే, సమస్య, కొంత వరకు సాంస్కృతికమై నది కూడా అయినప్పుడు, సరైన సమయం గొప్ప మార్పును తేగలుగుతుంది.
ఇలాంటి సమయాల్లోనే మన జనాభాలో పెద్ద భాగం ఈ అంశంపైకి దృష్టిని మళ్లించి ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని చేజారిపోనివ్వడం అవమానకరం. అనువైన ఈ సమయంలోనే సమాజాన్ని బాధితులపట్ల మరింత సున్నితంగా, సానుభూతితో ఉండేలా చేయగలుగుతాం. బాధితురాలిదే తప్పని తేల్చే పరిస్థితిని సృష్టించిన సామాజిక, సాంస్కృతిక విలువలను పక్కకు నెట్టేయడానికి సమాజం ఇప్పుడైతేనే సుముఖంగా ఉంటుంది.
- ఆకార్ పటేల్
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత‘ aakar.patel@icloud.com
Comments
Please login to add a commentAdd a comment