చిగురించిన ఆశలు
Published Thu, Jul 28 2016 1:02 AM | Last Updated on Wed, Apr 3 2019 4:38 PM
దేవరకొండ
వరుణుడు ఎట్టకేలకు మళ్లీ పలకరించాడు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో కురిసిన అడపాదడపా వర్షాలకు విత్తనాలు విత్తుకున్న రైతుల ఆశలు మంగళవారం, బుధవారం కురి సిన వర్షాలతో చిగురించాయి. విత్తనాలు విత్తన నాటి నుంచి వరుణుడు ముఖం చాటెయ్యడంతో పంట చేలు వాడుబట్టాయి. కొన్ని చోట్ల అసలు విత్తనాలు మెులవనేలేదు. ఈ ఏడాది కరువు తప్పదనుకుని నిరాశలో ఉన్న రైతన్నకు వరుణుడు కరుణించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు మెులవని చోట మళ్లీ పనిలో పడ్డారు. ఇదే రీతిలో ఒకటి రెండు పెద్ద వానలు పడితే కరువు నుంచి బయటపడవచ్చని రైతులు పేర్కొంటున్నారు.
హరితహారం మొక్కలకు జీవం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పాల్గొని మొక్కలు నాటుతున్నా వర్షాలు లేకపోవడంతో నాటిన మొక్కలు కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఎండిపోతున్నాయి. ఇది గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కలు కాపాడుకోవడానికి ఫైర్ ఇంజన్ల సహాయంతో మొక్కలకు నీళ్లు పోసి కాపాడాలని అధికారులను ఆదేశించారు. అయినా ఫైర్ ఇంజన్లకు సైతం నీళ్లు లేకపోవడంతో వారు కూడా ఏమీ చేయలేని దుస్థితి. కాని గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు హరితహారంలో నాటిన మొక్కలకు జీవం పోసినట్లయింది.
7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
ఖరీఫ్ సీజన్ మొదటి నుంచి జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసినప్పటికీ దేవరకొండ నియోజకవర్గంలో మాత్రం ఇప్పటి వరకు చుక్క వర్షం కూడా కురవని పరిస్థితి నెలకొంది. రైతులంతా తొలకరి వర్షాలకే పత్తి, ఇతర పంటలను విత్తుకోగా వాటికి జీవం లేక ఎండిపోయే పరిస్థితి నెలకొంది. చాలా ఎకరాల్లో పంటలు కూడా ఎండిపోయాయి. ఈ పరిస్థితికి రైతులంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో జిల్లాపరిషత్ చైర్మన్ బాలునాయక్ చందంపేట మండలం పెద్దమునిగల్ ముత్యాలమ్మ దేవాలయంలో వర్షాలు కురిస్తే మొక్కు చెల్లించుకుంటానని ప్రత్యేక పూజలు చేయడం, ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ఈనెల 31న దేవరకొండ పట్టణంలోని శివాలయంలో వరుణయాగం తలపెట్టడం నియోజకవర్గంలో కరువు పరిస్థితికి తార్కాణాలుగా నిలుస్తున్నాయి. ఇకపోతే గ్రామాలలో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేయడం పరిపాటి అయ్యింది. దేవరకొండ నియోజకవర్గ వ్యాప్తంగా 7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
Advertisement