సౌదీ సాలెగూడు | Saudi web of | Sakshi
Sakshi News home page

సౌదీ సాలెగూడు

Published Sat, Jul 19 2014 2:14 AM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM

సౌదీ సాలెగూడు - Sakshi

సౌదీ సాలెగూడు

  • దేశం కాని దేశంలో చిక్కుకున్న అభాగ్యులు
  •  మెరుగైన ఆదాయం కోసం ఎన్నో ఆశలు
  •  జీతం రాక, ఆకలి తీరక ఇప్పుడు ఎడారిలో ఖైదీలు
  •  స్వదేశంలో కుటుంబ సభ్యుల కన్నీరు మున్నీరు
  • అనారోగ్యం పాలైన కుమారుడికి మంచి వైద్యం అందించే ఉద్దేశంతో ఒకరు.. అంతోఇంతో సంపాదించుకుని జీవితం సాఫీగా గడపాలన్న ఆశతో ఒకరు.. కుటుంబ పోషణ కోసం కాయకష్టం చేసైనా తగినంత ఆదాయం సంపాదించాలన్న ఆలోచనతో ఒకరు.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో ధ్యేయంతో పరాయి గడ్డకు పయనమయ్యారు. తగినంత రాబడి ఉంటుందన్న  ఆశతో అప్పో సప్పో చేసి మరీ ఏజెంట్లకు లక్షల్లో సమర్పించి సౌదీ విమానమెక్కారు. కానీ అక్కడికి వెళ్లాక వారికి ఎడారి దేశంలో ఎండమావి కనిపించింది. నిరాశ ఎదురొచ్చింది. వేతనం లేదు సరికదా, ఆకలి తీరే దారి కూడా లేకుండా పోయింది. సౌదీలో చిక్కుకున్న  జిల్లా వాసుల విషాద కథనమిది..
     
    మల్కాపురం: కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే ఉద్దేశంతో గల్ఫ్ వెళ్లిన ఆ యువకుడు ఎడారి దేశంలో చిక్కుకున్నాడు. అటు జీతమూ లేక, ఇటు ఆకలీ తీరక నానా అవస్థలు పడుతున్నాడు. 47వ వార్డులోని ములగాడ హౌసింగ్ కాలనీకి చెందిన పిళ్లా గణేశ్ (33) ఇప్పుడు సౌదీ అరేబియాలో ఇక్కట్లు ఎదుర్కొంటున్నాడు. గణేశ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో గాజువాక ఆటోనగర్‌లోని ప్రజ్ఞాన్ వెల్డింగ్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా సౌదీ అరేబియాలో ఫిట్టర్‌గా విధులు నిర్వహించేందుకు వెళ్లాడు.

    అప్పుచేసి ఏజెంట్‌కు లక్ష రూపాయలు చెల్లించి సౌదీకి పయనమయ్యాడు. కంపెనీ ఏజెంట్లు అక్కడ గణేశ్‌కు నెలకు రూ. 22 వేలు జీతం, ఉచిత భోజనం, గది ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఐదు నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని, ఒకపూట భోజనమే పెడుతూ నరకాన్ని చూపిస్తున్నారని గణేశ్ చెప్పినట్టు అతడి భార్య, తల్లిదండ్రులు వివరిస్తున్నారు. ఐదేళ్ల క్రితం గణేశ్‌కు వివాహమైంది.

    ఈ దంపతులకు నాలుగేళ్ల కుమార్తె, 10 నెలల కుమారుడు ఉన్నారు. కుమారుడికి ఆరోగ్యం బాగులేకపోవడంతో అతడికి వైద్యం కోసం గణేశ్ ఎక్కువ వడ్డీకి అప్పు చేసి సౌదీకి వెళ్లాడు. అక్కడ ఉపాధి లేక, పూట గడవక, స్వదేశానికి రాలేక సతమతమవుతున్నాడు. తన భర్త క్షేమంగా ఇంటికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని గణేశ్ భార్య  రాజ్యలక్ష్మి రెవెన్యూ అధికారులకు మొర పెట్టుకుంది. వృద్ధులైన తల్లిదండ్రులు తమ బిడ్డ కోసం వేయికళ్లతో నిరీక్షిస్తున్నారు.
     
    ఆశలు నేలపాలు

    కశింకోట: తేగాడకు చెందిన బోదెపు నరసింగరావు ఎన్నో ఆశలతో సౌదీకి బయల్దేరి చివరికి రిక్తహస్తాలతో వెనక్కు రావాల్సిన పరిస్థితి ఎదురైంది. పదో తరగతి చదివిన నరసింగరావు ఒక్కడే కుటుంబానికి ఆధారం. తల్లిదండ్రులు సూర్యాకాంతం, అప్పలనాయుడు వృద్ధులు కావడంతో వారి పోషణభారం అతడిదే. సొంత ఊరిలో ఎంత కూలి చేసినా కుటుంబ పోషణ కష్టం కావడంతో అతడు ఎక్కువ ఆదాయం వస్తుందన్న ఆశతో సౌదీకి పయనమయ్యాడు.

    విశాఖకు చెందిన యువకులతోపాటు అతడు కూడా నాలుగు నెలల క్రితం సౌదీ అరేబియా వెళ్లి పనిలో చేరాడు. అయితే కంపెనీ ఆర్థిక పరిస్థితి బాగులేకపోవడంతో జీతం కూడా లభించని పరిస్థితి ఎదురుకావడంతో అతడి ఆశలు నేలకూలాయి. ఇంక అక్కడ ఉండి ఫలితం లేదని తేలిపోయింది. వెనక్కు వచ్చేద్దామనుకుంటున్నట్టు సౌదీ నుంచి కొడుకు గురువారం ఫోన్ చేసి చెప్పాడని నరసింగరావు తల్లి సూర్యాకాంతం శుక్రవారం తెలిపారు. ఇద్దరు ఆడ పిల్లలకు పెళ్లిళ్లు చేయడం వల్ల అప్పులు పెరిగిపోయాయని, 30 సెంట్ల భూమి మాత్రమే ఉండడంతో బతుకు గడవడం కష్టమైందని, సౌదీలో కూడా కుమారుడికి నిరాశే ఎదురైందని ఆమె విచారంతో చెప్పారు.
     
    తల్లికి తీరని వేదన

    అనకాపల్లి: ‘నా కొడుకు ఎప్పుడొస్తాడు?... ‘క్షేమంగా వస్తాడా?’ అని అనారోగ్యంతో బాధ పడుతున్న ఆ తల్లి ప్రశ్నిస్తూ ఉంటే బంధువులకు ఏం జవాబు చెప్పాలో అర్ధం కావడం లేదు. దూర ప్రాంతానికి వెళ్లి నానా అవస్థలు పడుతున్న కొడుకును తలచుకు ఆ వృద్ధురాలు విలపిస్తూ ఉంటే ఎలా ఓదార్చాలో అర్ధం కావడం లేదు. బతుకుతెరువుకోసం సౌదీ వెళ్లిన అనకాపల్లి యువకుని దీనావస్థ తీరే దారేమిటో ఎవరికీ అర్ధం కావడం లేదు.

    అనకాపల్లి మండలం రామాపురం కాలనీకి చెందిన రాయి శ్రీనివాస్ పరిస్థితి ఇది.  శ్రీనివాస్ తండ్రి అప్పారావు పదేళ్ల క్రితమే కన్నుమూయడంతో తల్లి సింహాచలం అన్నీ తానే అయి కుమారుడిని, ఇద్దరు కుమార్తెలను పెంచి పెద్ద చేసింది. ఇద్దరు కుమార్తెలకు తానే వివాహాలు చేసింది. సెల్‌ఫోన్ మెకానిక్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ లక్ష రూపాయల వరకు సమకూర్చుకొని ఐదు నెలల క్రితం గాజువాకకు చెందిన ఒక కన్సల్టెన్సీ ద్వారా 10 మందితో కలసి పయనమయ్యాడు. అయితే అతడికి అక్కడి వాస్తవాలు వెక్కిరించాయి.

    వేతనం సంగతి అటుంచితే కడుపు నింపుకొనేందుకు కూడా నానా యాతన పడాల్సి వస్తోంది. చేతిలో చిల్లిగవ్వ లేక తిరిగి ఎలా రావాలో తెలియని దయనీయ స్థితిలో ఉన్నాడు. ఫోన్ చేయడానికి కూడా డబ్బు లేని పరిస్థితిలో తెలిసిన వారి ద్వారా కుమారుడికి సింహాచలం ఫోన్ చేయించింది. కుమారుడు అక్కడి నుంచి ఎలా వస్తాడని ఇప్పుడామె కుమిలిపోతోంది. ఆమె ఆరాటం ఏరీతిలో తీరుతుందో ఎవరు చెప్పగలరు?
     
    వేతనానికి బదులు వేదన

    పెదగంట్యాడ: పొట్టకూటి కోసం దేశం కాని దేశం వెళ్లిన మహ్మద్ హాఫీజుల్లా దుస్థితిని తలచుకుని అతడి సోదరి ఆఖీషా విలవిలలాడుతోంది. పెదగంట్యాడ రూరల్ మండలం పెదపాలెం గ్రామానికి చెందిన హాఫీజుల్లా సుమారు ఐదునెలల క్రితం మరికొందరితో పాటు సౌదీ వెళ్లాడు. వీరిని సౌదీ తీసుకువెళ్లిన సంస్థ జీతాలను చెల్లించకపోవడం వల్ల అక్కడ నానా ఇక్కట్లూ పడుతున్నట్టు సమాచారం అందింది. గతంలో తన సోదరుడు రెండుసార్లు సౌదీ వెళ్లి వచ్చాడని, ఎప్పుడు ఇటువంటి ఇబ్బందులు ఎదురుకాలేదని అఖీషా వాపోతోంది. తన సోదరుడిని క్షేమంగా తీసుకురావాలని అధికారులను కోరుతోంది.
     
    నిలువునా ముంచిన నయవంచన
     
    ఉపాధి కల్పిస్తామని సౌదీ తీసుకువెళ్లిన కంపెనీ నట్టేట ముంచడంతో ఇప్పుడేం చేయాలో తోచడం లేదని పెదగంట్యాడకు చెందిన మరో బాధితుడు ఎ.గోవిందరావు బంధువులు ఆక్రోశిస్తున్నారు. వెల్డింగ్ పనిలో కుదుర్చుతామని గోవిందరావును సౌదీకి తీసుకువెళ్లిన కంపెనీ నాలుగు నెలలుగా జీతాలు చెల్లించడంలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది జూలైలో దుబాయ్ వెళ్లినప్పుడు ఎటువంటి ఇబ్బందీ ఎదురు కాలేదని. ఈ ఏడాది మార్చిలో సౌదీ వెళ్లి ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తోందని చెప్పారు. తన భర్తను వెనక్కు తీసుకు రావాలని గోవిందరావు భార్య వారం క్రితం కలెక్టరేట్‌కు వెళ్లి అధికారులకు విజ్ఞప్తి చేశారు కూడా. వేతనాలు అందకపోవడంతో తన భర్త, మరో 39 మంది వెనక్కు వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement