ఏటేటా పెరుగుతున్న ప్రవాసుల ఆదాయం | Immigrants Income Rises Yearly | Sakshi
Sakshi News home page

ఏటేటా పెరుగుతున్న ప్రవాసుల ఆదాయం

Published Fri, Jul 5 2019 12:03 PM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM

Immigrants Income Rises Yearly - Sakshi

ఎన్‌.చంద్రశేఖర్,మోర్తాడ్‌(నిజామాబాద్‌ జిల్లా) :విదేశాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న వారితో పాటు ఉద్యోగ బాధ్యతలను చేపట్టిన మన దేశ పౌరులు పంపిస్తున్న విదేశీ మారక ద్రవ్యం విలువ రూ.5లక్షల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. విదేశాల నుంచి మన దేశానికి చేరుతున్న ప్రవాసీయుల ఆదాయం ఏటేటా పెరుగుతూనే ఉంది. మన దేశానికి వివిధ దేశాల నుంచి వస్తున్న ఆదాయంలో గల్ఫ్‌ దేశాల్లో పనిచేస్తున్న కార్మికులు పంపిస్తున్న సొమ్ము అధికంగా ఉంటుందని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. పాశ్చాత్య దేశాల్లో స్థిరపడిన మన దేశస్థులు అక్కడే స్థిరాస్థులను కూడబెట్టుకోవడం వల్ల మన దేశానికి ఎక్కువగా సొమ్మును పంపించే అవకాశం లేదు. గల్ఫ్‌ దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు, వ్యాపారాలను నిర్వహిస్తున్నవారు మాత్రం అక్కడ లభించిన ఆదాయాన్ని వారు దాచి ఉంచుకునే అవకాశం లేదు. అందువల్ల గల్ఫ్‌లో పనిచేస్తున్న వారు తమ ఖర్చులకు అవసరమైనంత సొమ్మును దాచుకుని మిగిలిన మొత్తాన్ని స్వగ్రామాలకు పంపిస్తున్నారు.  

గల్ఫ్‌ దేశాల్లో తెలంగాణ వాసులు 13లక్షలకు పైగానే..
గల్ఫ్‌ దేశాల్లో ఉద్యోగం, వ్యాపారం చేస్తూ స్థిరపడిన తెలంగాణ వాసుల సంఖ్య 13లక్షలకు మించింది. బహ్రెయిన్, సౌదీ అరేబియా, యూఏఈ, ఒమన్, ఖతార్, కువైట్, ఇరాక్‌లలో ఉపాధి పొందుతున్న తెలంగాణ జిల్లాల వారు ఒక్కొక్కరు నెలకు కనీసం రూ.20వేల చొప్పున ఇంటికి పంపించినా.. ఆ సొమ్ము రూ.2వేల కోట్లకు మించిపోతుంది. ఈ లెక్కన ఏడాదికి రూ.24వేల కోట్ల ఆదాయం కేవలం గల్ఫ్‌ దేశాల నుంచి లభిస్తుంది. గల్ఫ్‌లో కార్మికులతో పాటు ఉన్నత ఉద్యోగాల్లోనూ స్థిరపడిన వారు ఉన్నారు.  ఉద్యోగాల్లో స్థిరపడిన వారికి నెలకు ఆదాయం మన కరెన్సీలో రూ.లక్ష వరకు ఉంటుంది. అలాగే వ్యాపార రంగాల్లో స్థిరపడిన వారి ఆదాయం ఇంకా ఎక్కువే ఉంటుంది. గల్ఫ్‌ దేశాల్లో తెలంగాణ వాసులతో పాటు కేరళ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల వాసులు ఉపాధి పొందుతున్నారు. అయితే, కేరళ తరువాత తెలుగు రాష్ట్రాల వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని అంచనా.

సంక్షేమంపై చిన్నచూపు..
ప్రవాసులు మన దేశానికి ప్రతి ఏటా గణనీయమైన ఆదాయాన్ని సమకూరుస్తున్నా వారి సంక్షేమంపై ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా గల్ఫ్‌ కార్మికు లు ఎన్నో ఏళ్లుగా ఎన్‌ఆర్‌ఐ పాలసీ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. తాము రెక్కలు ముక్కలు చేసుకుని  రూ.వేల కోట్ల ఆదాయం అందిస్తున్నా తమ సంక్షేమానికి ప్రభుత్వాలు ఎలాంటి కార్యక్రమాలూ రూపొందించలేదని ఆరోపిస్తున్నారు. ఏళ్ల తరబడి కుటుంబాలకు దూరంగా ఉంటూ తమ కోసం సంపాదించుకుంటున్నా పరోక్షంగా స్వదేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని అందిస్తున్నామని గల్ఫ్‌ కార్మికులు వివరిస్తున్నారు. కానీ, ప్రభుత్వాలు తమ పట్ల కనికరం చూపడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రవాసులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి
ప్రవాసుల కోసం మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను అమలు చేయాలి. ఏటా రూ.లక్షల కోట్ల ఆదాయం సమకూర్చుతున్న ప్రవాస భారతీయుల కోసం ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయకపోవడం వల్ల వారు ఎంతో నష్టపోతున్నారు. విదేశాల్లో ఉపాధి పొందుతూ ఏ కారణం చేతనైనా మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలి. అలాగే ఏజెంట్ల చేతుల్లో నష్టపోయిన వారిని ఆదుకోవాలి.  వీలైనంత తొందరగా ఎన్‌ఆర్‌ఐ పాలసీని అమలు చేయాలి.     – గంగుల మురళీధర్‌రెడ్డి,ప్రవాస భారతీయుల సంక్షేమ సంఘం ప్రతినిధి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement