
భారతీయ జనతా పార్టీ(బీజేపీ)
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : సాధారణ ఎన్నికలు సమీపిస్తుంటే రాజకీయ పార్టీల్లో కొత్త ఉత్సాహం ఉరకలెత్తుతుంది. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉండే పార్టీలు మరింత దూకుడుగా వ్యవహరిస్తూ ప్రజా సమస్యలపై పోరాటాలతో హంగామా సృష్టిస్తాయి. అయితే, జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ(బీజేపీ) పరిస్థితి మాత్రం ఉమ్మడి పాలమూరు జిల్లాలో నానాటికి తీసికట్టుగా తయారవుతోంది. ఒకప్పుడు ఎంతో హంగామా సాగించిన కమలం పార్టీ ప్రస్తుతం ఉనికి కోసం కొట్టుమిట్టాడుతుండడం గమనార్హం.
పార్టీ సీనియర్ నేతల వ్యవహార శైలి కారణంగా కొత్త నేతలు వచ్చి చేరేందుకు విముఖత చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అంతేకాదు ఉన్న కొద్ది మంది నేతల్లో కూడా గ్రూపు తగాదాల కారణంగా పార్టీ పరిస్థితి ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే సాధారణ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చే నాయకుల కోసం వెతకాల్సిన పరిస్థితి నెలకొనేలా కనిపిస్తోంది.
గతంలో ఊపు..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గతంలో బీజేపీ హవా కొనసాగింది. ఈ పార్టీ నేతలు సర్పంచ్‌లు మొదలుకుని ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ, శాసనసభ, పార్లమెంట్ స్థానాల్లో సైతం బలమైన పోటీ ఇచ్చి కొన్ని స్థానాల్లో విజయం సాధించారు. అందులో భాగంగా మహబూబ్‌నగర్ ఎంపీగా జితేందర్‌రెడ్డి 1999లో కమలం గుర్తుపైనే పోటీ చేసి గెలుపొందారు. అలంపూర్ నియోజకవర్గం జనరల్ స్థానంగా ఉన్నప్పుడు రావుల రవీంద్రనాథ్‌రెడ్డి సైతం ఈ పార్టీ తరఫునే పోటీకి దిగి గెలుపొందారు.
అలాగే కొన్ని మున్సిపాలిటీలను కూడా తన గుప్పిట్లో పెట్టుకున్నది. గతంలో గద్వాల మున్సిపల్ చైర్మన్, ఇటీవలి కాలం వరకు నారాయణపేట మున్సిపల్ కుర్చీ బీజేపీ ఖాతాలో ఉండేది. అదే విధంగా తెలంగాణ ఉద్యమకాలంలో మహబూబ్‌నగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన యెన్నం శ్రీనివాస్‌రెడ్డి గెలుపొంది రికార్డు సృష్టించారు. ఇలా మొత్తం మీద పాలమూరు ప్రాంతంలో బీజేపీకి ఘనమైన చరిత్రే ఉంది.
ముగ్గురు నేతలదే హవా....
సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ గ్రూపు తగాదాలతో సతమతమవుతోంది. పాలమూరు ప్రాంతంలో కేవలం మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోనే ఆశలున్నాయి. గతంలో ఇక్కడి నుంచి ఎంపీ, ఎమ్మెల్యేలుగా గెలిచిన చరిత్ర ఉంది. అయితే మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో సీనియర్ నేతలుగా చెలామణి అవుతున్న ముగ్గురి చేతుల్లోనే పార్టీ బందీగా మారిందనే ప్రచారం ఉంది. ఆ ముగ్గురు నేతలు ఏం చెబితే అదే జిల్లా పార్టీకి దిశా, నిర్దేశంగా మారింది. ఒక వేళ వారిని కాదని ఎవరైనా ముందడుగు వేస్తే పదడుగుల దూరం పెడుతు
న్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. వారిని కాదని కనీసం ప్రెస్‌మీట్ పెట్టే పరిస్థితి కూడా లేదని నేతలు వాపోతున్నారు. వీరి ఆగడాలు శృతిమించడంతో ఒక ప్రధాన విభాగానికి బాధ్యులుగా ఉన్న వ్యక్తి రాజీనామా సైతం చేసినట్లు సమాచారం. దీంతో ఆగమేఘాల మీద సదరు నేతకు నచ్చజెప్పి రాజీనామాను ఉపసంహరింప చేశారు. అంతేకాదు పార్టీపై అభిమానంతో బలోపేతం చేద్దామని ద్వితీయశ్రేణి నాయకులెవరైనా ముందుకొస్తే నీరుగార్చే చర్యలు అవలంభిస్తారనే ప్రచారం ఉంది. ఇలా వీరి ఆధిపత్యం కారణంగానే ద్వితీయశ్రేణి నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. దీంతో ఏ ఒక్క ని యోజకవర్గంలోనూ ఆశించిన స్థాయి లో పార్టీ పుంజుకోవడం లేదని చెబుతున్నారు.
మహబూబ్‌నగర్ నియోజకవర్గం విషయానికొస్తే పార్టీ పట్టణ అధ్యక్షుడు పాండురంగారెడ్డి, జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి మధ్య ఆధిపత్యపోరు నడుస్తున్నట్లు చెబుతుండగా.. కేడర్‌లో అయోమయం నెల కొంది. అలాగే దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించి ఎగ్గని నర్సింహులుకు పార్టీ కేడర్ అంతగా సహకరించడం లేదని చెబుతారు. మక్తల్ నియోజకవర్గంలో పార్టీ సీనియర్ నేత కొండన్నకు తాజాగా వర్కటం జగన్నాథరెడ్డి పోటీకి వచ్చేశారు. ఇలా ఎక్కడిక్కడ గ్రూపు తగాదాల కారణంగా పార్టీ రోజురోజుకు బలహీనపడుతుందనే విమర్శలున్నాయి.
పోరాటాలేవి?
పాలమూరు ప్రాంతంలో గతమెంతో ఘన చరిత్ర అన్నట్లుగా చెప్పుకునే బీజేపీ పరిస్థితి ప్రస్తుతం దయనీయం గా తయారైంది. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నా.. ఇప్ప టి వరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి బీజే పీ నిర్మాణాత్మకమైన పోరా టాలు చేసిన దాఖలాలు లేవని పార్టీ వర్గాల్లోనే చర్చ సాగుతోంది. ప్రజల పక్షాన గట్టి గొంతు వినిపించడంలో నేతలు విఫలమవుతున్నారనే విమర్శలున్నా యి. గతంలో జిల్లాలో పర్యటించిన ఆ పార్టీ శాసనసభా పక్షనేత జి.కిషన్‌రెడ్డి మార్చి నెలలో ప్రజా ఉద్యమాలను పాలమూరు నుంచే శ్రీకారం చుడుతామని చెప్పారు. కానీ మార్చి పోయి ఏప్రిల్ వచ్చినా ఇప్పటి వరకు ఆదిశగా ఆలోచనలే చేయడం లేదు.
ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా పార్టీ తరఫున ప్రజా సమస్యలపై ఉద్యమాలకు నేతలు శ్రీకారం చుట్టడం లేదు. దీంతో కింది స్థాయి కేడర్ నైర్యాశంలో కొట్టుమిట్టాడుతోంది. గతంలో నాగం జనార్ధన్‌రెడ్డి మాత్రమే పార్టీ తరఫున ప్రభుత్వంపై గట్టి విమర్శలు చేసేవారు. ప్రస్తుతం ఆ స్థాయిలో పాలనా పరమైన లోపాలపై విమర్శించడంలో నాయకత్వం విఫలమవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల ఏడాదిలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లారనే ఆందోళన ద్వితీయశ్రేణి నాయకత్వాన్ని పట్టి పీడిస్తోంది.
ఒక్కరిద్దరు నేతలే..
నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో బీజేపీకి సంబంధించి గుర్తింపు కలిగిన నేతలను వేళ్ల మీద లెక్కించవచ్చు. ఈ ప్రాంతానికి చెందిన... రాజకీయ ఉద్దండుడిగా పేరొందిన నాగం జనార్ధన్‌రెడ్డితాజాగా పార్టీకి గుడ్‌బై చెప్పడంతో పరిస్థితి దయనీయంగా మారింది. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో బీజేపీకి కల్వకుర్తి నియోజకవర్గం కాస్త మెరుగ్గా ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నా రు. కల్వకుర్తి గడ్డ మీద కాషాయం జెండా ఎగురవేయడానికి మూడు, నాలుగు పర్యాయాలుగా పార్టీ సీనియర్‌నేత టి. ఆచారి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
గత సాధారణ ఎన్నికల్లో అతితక్కువ మెజార్టీతో ఆయన ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఆయన కారణంగానే నియోజకవర్గంలో పార్టీ కాస్తంత బలంగా ఉంది. నాగర్‌కర్నూల్ అసెంబ్లీ సెగ్మెంట్‌కు వచ్చే సరికి పరిస్థితి అయోమయంగా తయారైంది. సీనియర్ నేత నాగం పార్టీకి గుడ్‌బై చెప్పడంతో పార్టీ జెండా ఎత్తే నాథులే కరువయ్యారు. అలాగే కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన జగదీశ్వర్‌రావు కూడా నాగం దారిలో వెళ్తుండడంతో పరిస్థితి దయనీయంగా మారింది. అచ్చంపేట నియోజకవర్గానికి వచ్చే సరికి బల్మూరు కు చెందిన మల్లేశ్వర్ కొంత కాలంగా పోరాడుతున్నారు.
వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి పార్టీ జిల్లా అధ్యక్షుడు అయ్యగారి ప్రభాకర్‌రెడ్డితో పాటు ఎన్నారై కొత్త ప్రభాకర్‌రెడ్డి బరిలో ఉన్నారు. అదే విధంగా గద్వాల నియోజకవర్గంలో ఉన్నంతలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి మాత్రమే కాస్తంత పోరాట పటిమ కనబరుస్తున్నారు. ఇక అలంపూర్ నియోజకవర్గం విషయానికి వస్తే ఒకప్పుడు బీజేపీ జెండా ఎగిరిన చరిత్ర ఉన్నా.. ప్రస్తుతం పోటీ చేసే నాయకులే కరువయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment