ఎగ్గని నర్సింహులు (దేవరకద్ర) దిలీప్ ఆచారి (నాగర్‌కర్నూల్) అమరేందర్‌రెడ్డి (వనపర్తి)
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రానున్న ఎన్నికల బరిలో బీజేపీ తరఫున నిలిచే అభ్యర్థుల రెండో జాబితాను ఆ పార్టీ అధిష్టానం వెల్లడించింది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి మూడు స్థానాలకు అభ్యర్థుల వివరాలను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం వెల్లడించారు. కొద్దిరోజుల క్రితం ఉమ్మడి జిల్లాలో ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా మరో ముగ్గురి పేర్లు విడుదల చేశారు. నాగర్‌కర్నూల్ నుంచి నేదనూరి దిలీప్‌చారి, వనపర్తి నుంచి కొత్త అమరేందర్‌రెడ్డి, దేవరకద్ర నుంచి ఎగ్గని నర్సింహులు పేర్లను ప్రకటించారు. తద్వారా ఉమ్మడి జిల్లాలో 14 స్థానాలకు గాను తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. అయితే రెండో జాబితాలోనే మహబూబ్‌నగర్, కొడంగల్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ రాష్ట్ర నాయకత్వం జాబితాను రూపొందించి కేంద్ర నాయకత్వానికి పంపించింది. అయితే ఈ రెండు స్థానాల అభ్యర్థులను మాత్రమే పార్టీ జాతీయ నాయకత్వం తాత్కాలికంగా నిలిపివేయడం చర్చనీయాంశంగా మారింది.
ఏం జరిగింది?
రాష్ట్రంలో వస్తున్న ముందస్తు ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ... అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ జాతీయ నాయకత్వం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఈ ఎన్నికలను ఛాలెంజింగ్ తీసుకోవడంతో కేంద్ర నాయకత్వమే స్వయంగా అభ్యర్థుల ఎంపిక, ఇతరత్రా అంశాలను పర్యవేక్షిస్తోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీ శ్రేణులకు సైతం అంతుబట్టడం లేదు.
ముఖ్యంగా మహబూబ్‌నగర్, కొడంగల్ అభ్యర్థుల పేర్ల ప్రకటనను అకస్మాత్తుగా నిలిపేయడం పార్టీలో చర్చకు దారి తీసింది. సరిగ్గా రెండు రోజుల క్రితం రాష్ట్ర నాయకత్వం బరిలో నిలిచే అభ్యర్థులకు సంబంధించి రెండో జాబితా రూపొందించారు. అందులో మహబూబ్‌నగర్ నుంచి జిల్లా పార్టీ అధ్యక్షురాలు పద్మజారెడ్డి, కొడంగల్ నుంచి నాగూరావు నామాజీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి అధిష్టానానికి పంపించారు. అయితే ఈ రెండు చోట్ల అభ్యర్థులకు కేంద్ర పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మహబూబ్‌నగర్ స్థానం కోసం పార్టీ వారితో పాటు బయటి వ్యక్తులు కూడా పైరవీ చేస్తుండటంతో తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. ఇక కొడంగల్‌కు సంబంధించి నాగూరావు విషయంలో కూడా బయటి వ్యక్తుల నుంచి కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైనట్లు పార్టీలో చర్చ సాగుతోంది.
మహబూబ్‌నగర్ నుంచి ఎవరు?
ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీజేపీకి బాగా బలమున్న స్థానాల్లో మహబూబ్‌నగర్ నియోజకవర్గం కూడా ఒకటని చెప్పొచ్చు. గతంలో ఈ స్థానం నుంచి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అనూహ్య విజయం సాధించింది. దీంతో ఒక్కసారిగా బీజేపీ బలం రాష్ట్రస్థాయిలో గట్టిగా చాటినట్లయింది. అంతేకాదు గత సాధారణ ఎన్నికల్లో సైతం బీజేపీ అభ్యర్థి టీఆర్‌ఎస్ అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు. అంతలా హోరాహోరీ తలపడే శక్తి ఉండడంతో... ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆశావహులు ఆసక్తి చూపుతున్నారు. ఈ స్థానం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పార్టీని వీడిన తర్వాత... పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి నియోజకవర్గంపై దృష్టి సారించారు.
అందుకు అనుగుణంగా మూడేళ్లుగా పనిచేసుకుంటూ పోతున్నారు. అందులో భాగంగా రాష్ట్ర నాయకత్వం కూడా ఆమె పేరును ఖరారు చేస్తూ ఢిల్లీకి పంపింది. అయితే ఊహించని విధంగా ఆమె అభ్యర్థిత్వానికి ఆమోదం లభించలేదు. అయితే ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు మహబూబ్‌నగర్ పట్టణానికి చెందిన ఒక ప్రముఖ న్యాయవాది సుముఖత వ్యక్తం చేసినట్లు వినికిడి. అదే విధంగా గత ఎన్నికల్లో పోటీ చేసిన ఓటమి పాలైన యెన్నం శ్రీనివాస్‌రెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇలా పలు ఊహాగానాల నేపథ్యంలో మహబూబ్‌నగర్ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఆసక్తి కరంగా మారింది.
ఐదు స్థానాలకు బ్రేక్
ఉమ్మడి జిల్లాలో బీజేపీ అభ్యర్థుల విషయంలో ఇప్పటి వరకు తొమ్మిది నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. మొత్తం 14 స్థానాలకు గాను మరో అయిదు స్థానాలకు అభ్యర్థులను ప్ర కటించాల్సి ఉంది. మహబూబ్‌నగర్, కొడంగల్ నియోజకవర్గాలను తాత్కాలికంగా నిలిపేయడంతో మిగిలిన మూడు స్థానాలకు అభ్యర్థులు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. కొల్లాపూర్, అలంపూర్, జడ్చర్ల నియోజకవర్గాలకు అభ్యర్థులు ఎవరనేది తేలడం లేదు. అలంపూర్ నియోజకవర్గంలో రజనీరెడ్డి కొంత కాలంగా పనిచేసుకుపోతున్నారు.
ఈ నేపథ్యంలో అక్కడ ఆమెకు దాదాపు ఖరారయ్యే చాన్స్ ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే కొల్లాపూర్ నుంచి ధారాసింగ్ ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్కడ బీజేపీ అధిష్టానం మాత్రం ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన ముఖ్యనేత కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. ఇక జడ్చర్ల నియోజకవర్గంలో మాత్రం ముగ్గురు పోటీ పడుతున్న నేపథ్యంలో ఎవరికి అవకాశం కల్పిస్తారనేది అంతు చిక్కడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment