Covid-19: దేశాన్ని గడగడలాడించింది ఈ వేరియంటే.. | CCMB Director Dr Vinay Nandukuri Comments On Covid-19 | Sakshi
Sakshi News home page

Covid-19: దేశాన్ని గడగడలాడించింది ఈ వేరియంటే..

Published Fri, Sep 10 2021 3:32 AM | Last Updated on Fri, Sep 10 2021 1:32 PM

CCMB Director Dr Vinay Nandukuri Comments On Covid-19 - Sakshi

సాక్షి, అమరావతి: ‘కరోనా వైరస్‌ వ్యాప్తి 2020 మార్చి నుంచి ఉన్నా వేరియంట్‌లపై మనం ఎక్కువ దృష్టి సారించింది సెకండ్‌ వేవ్‌లోనే. దేశంలో అత్యంత ప్రభావం చూపింది డెల్టా వేరియంటే. ఈ రోజుకు కూడా డెల్టా వేరియంట్‌ వివిధ రాష్ట్రాల్లో ఉంది. తదుపరి మరో 25 రకాల ఉప (సబ్‌ లీనియన్స్‌) వేరియంట్‌లను సృష్టించుకుంది. వాటినే ‘ఏవై 1 – ఏవై 25’ అని వ్యవహరిస్తున్నాం..’ అని హైదరాబాద్‌లోని సీసీఎంబీ (సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ) డైరెక్టర్‌ డాక్టర్‌ వినయ్‌ నందుకూరి తెలిపారు. ఏపీలో శాటిలైట్‌ సెంటర్‌ (జినోమిక్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబొరేటరీ) ఏర్పాటు కోసం సిద్ధార్థ మెడికల్‌ కాలేజీని పరిశీలించేందుకు వచ్చిన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలివీ...

థర్డ్‌వేవ్‌ ముప్పు ఏమేరకు ఉండవచ్చు?
థర్డ్‌ వేవ్‌పై ఏం మాట్లాడినా అది ఊహాజనితం అవుతుంది. మనం ఇప్పుడు సెకండ్‌ వేవ్‌ చివరి దశలో ఉన్నాం. థర్డ్‌వేవ్‌ వస్తుందా.. రాదా? అనేది ఎవరూ చెప్పలేరు. ఒక్కసారి దేశంలో ఇన్‌ఫ్లుయంజా వచ్చినప్పుడు ఎన్ని రోజులు ఉందో తెలిసిందే. దీనిపై కూడా ఏమీ చెప్పలేని పరిస్థితి. థర్డ్‌వేవ్‌ అనేది రకరకాల పరిస్థితులపై ఆధారపడి ఉంది.

డెల్టా వేరియంట్‌ ప్రభావం ఎంత?
దేశాన్ని గడగడలాడించింది ఇదే. దేశవ్యాప్తంగా 60 వేలకు పైగా శాంపిళ్లు జినోమిక్‌ సర్వే చేస్తే డెల్టా ప్రభావమే ఎక్కువగా ఉంది. దీనికి మళ్లీ ఏవై పేరుతో 25 ఉప వేరియంట్‌లు వచ్చాయి. వీటిలో ఏవై 12, ఏవై 4 అనే రెండు మాత్రమే ప్రభావం చూపాయి. డెల్టా తర్వాత ఏ వేరియంట్‌ ప్రభావం చూపిస్తుందనేది చెప్పలేం. డెల్టా తర్వాత కొత్త వేరియంట్‌ రాలేదు. డెల్టా ప్లస్‌ అంటున్నారు కానీ దానిపై స్పష్టత లేదు.

రెండు డోసులు వ్యాక్సిన్‌ తీసుకున్నా కేసులు వచ్చాయి కదా?
కరెక్టే. ఇది డెల్టా వేరియంట్‌ వల్లే. ఇమ్యూనిటీని కూడా తప్పించుకుని మరీ ఈ వేరియంట్‌ వ్యాప్తి చెందింది. అందుకే కొంతమందికి వ్యాక్సిన్‌ తీసుకున్నా వచ్చింది. అయితే వ్యాక్సిన్‌ తీసుకోని వారితో పోలిస్తే వీరిలో తీవ్రత తక్కువ అని తేలింది. డెల్టా వేరియంట్‌కు వైరల్‌ లోడ్‌ చాలా ఎక్కువగా ఉంటుంది.

కేరళలో కేసులు పెరగడానికి కారణాలేమిటి?
కేరళలో ఇప్పుడు సెకండ్‌ వేవ్‌ పీక్‌ దశలో ఉంది. ఢిల్లీలో పీక్‌ దశలో ఉన్నప్పుడు కేరళలో సీరో సర్వెలైన్స్‌ 40 శాతమే ఉంది. అప్పుడు ఢిల్లీలో 70 శాతానికి పైగా ఉంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో దశలో సెకండ్‌ వేవ్‌ వచ్చింది. ఇప్పుడు కేరళలోనూ అంతే. దేశవ్యాప్తంగా సెకండ్‌ వేవ్‌ చివరి దశలో ఉంది.

స్కూళ్లు ప్రారంభమయ్యాయి కదా.. పరిస్థితి ఏమిటి?
స్కూళ్లలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఒక్కటే. బాగా వెంటిలేషన్‌ (వెలుతురు), ఫ్యాన్‌ తిరుగుతూ ఉంటే సమస్య ఉండదు. జర్మనీలో ఇది నిర్ధారణ అయింది. అందుకే పిల్లలను బాగా వెంటిలేషన్‌ ఉన్న గదుల్లో ఉంచమని చెబుతున్నాం.

భవిష్యత్‌ పరిణామాలను ఎలా ఎదుర్కోగలం?
అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి. కిక్కిరిసిన జన సమూహాలు (మాస్‌ గ్యాథరింగ్స్‌) లేకుండా చూసుకోవడం, మాస్కులు విధిగా ధరించడం వల్ల థర్డ్‌వేవ్‌ను చాలావరకూ నిలువరించవచ్చు. ప్రజలు తీసుకునే జాగ్రత్తలు, వ్యవహరించే తీరును బట్టే వైరస్‌ పోకడ ఉంటుంది.

చిన్నపిల్లలకు వచ్చే అవకాశం ఉందా?
అలాగని ఏమీ లేదు. ఇప్పటివరకూ వాళ్లు తక్కువగా ప్రభావితమయ్యారు. వ్యాక్సిన్‌ ఇవ్వలేదు కాబట్టి పిల్లలకు వచ్చే అవకాశం ఉందని ముందస్తు జాగ్రత్తలు సూచిస్తున్నారు. పిల్లలకు ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని ఎక్కడా లేదు.

శాటిలైట్‌ ల్యాబొరేటరీ వల్ల ఉపయోగాలేమిటి?
దేశవ్యాప్తంగా శాటిలైట్‌ ల్యాబొరేటరీలు ఏర్పాటవుతున్నాయి. ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇంతవరకూ వైరస్‌ పరివర్తనాలు, ఎలాంటి వైరస్‌లు ఉన్నాయి లాంటివాటిని తెలుసుకునేందుకు హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పంపేవారు. విజయవాడలో ఏర్పాటు చేస్తే ఇక్కడే నమూనాలను పరిశీలించవచ్చు. దాన్ని బట్టి ఏ వేరియంట్‌ వస్తే ఎలా చికిత్స చేయవచ్చు అనేది తెలుస్తుంది. ప్రస్తుతం సీసీఎంబీకి పంపిస్తున్న నమూనాలు కూడా యథావిధిగా వెళతాయి. దీనికి సుమారు రూ.కోటిన్నర ఖర్చవుతుంది. నెలకు గరిష్టంగా రెండు వేల వరకూ నమూనాలను పరిశీలించే అవకాశం ఉంది.

జినోమిక్‌ ల్యాబ్‌ ఏర్పాటుపై ఎంవోయూ
విజయవాడలోని సిద్ధార్థ మెడికల్‌ కాలేజీలో శాటిలైట్‌ సెంటర్‌ (జినోమిక్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబొరేటరీ)ఏర్పాటుకు సంబంధించి సీసీఎంబీ డైరెక్టర్‌ డా.వినయ్‌ నందుకూరితో కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ గురువారం ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఈ ప్రాజెక్టుకు స్టేట్‌ బ్యాంక్‌ ఇండియా ఫౌండేషన్‌ ఆర్థిక సహకారం అందిస్తోంది.

ల్యాబ్‌ ఎస్‌బీఐ ఫౌండేషన్‌ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద అందచేస్తుంది. ల్యాబ్‌కు కావాల్సిన స్థలం, సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. సాంకేతిక సహకారాన్ని జాన్‌ హాప్కిన్స్‌ సంస్థ అందిస్తుంది. కరోనా వైరస్‌కు సంబంధించిన వేరియంట్‌ల ఉనికిని ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ నెలకు 2 వేల నమూనాలను పరిశీలించే అవకాశం ఉంది. నెల రోజుల్లో ల్యాబ్‌ ఏర్పాటయ్యే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. జినోమిక్‌ సీక్వెన్స్‌తో రకరకాల వేరియంట్ల ఉనికిని తెలుసుకోవడం వల్ల చికిత్సను ఎప్పటికప్పుడు మార్చుకునే వీలు కలుగుతుంది. కరోనా పూర్తిగా నియంత్రణలోకి వస్తే ఈ ల్యాబ్‌ను మరోరకంగా కూడా వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు.

వైరస్‌ బలహీనపడే అవకాశాలున్నాయా?
చెప్పలేం. గతంలో ఇన్‌ఫ్లుయెంజా వచ్చినప్పుడు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత అది బలహీనపడుతూ వచ్చింది. కరోనా వైరస్‌ కూడా మన దేశానికి వచ్చి రెండేళ్లు కావస్తోంది. బలహీన పడుతుందని ఆశాభావంతో ఉన్నాం. దీంతో పాటు ప్రజల్లో  కూడా ఇమ్యూనిటీ పెరుగుతూ ఉంటుంది కదా. డెల్టా కంటే ప్రభావవంతమైన వేరియంట్‌ వస్తే తప్ప అంతగా ప్రభావం ఉండదని భావిస్తున్నాం. త్వరగా వ్యాక్సినేషన్‌ చేయగలిగితే చాలామటుకు వైరస్‌ నుంచి రక్షణ పొందే అవకాశాలున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement