లబ్బీపేట (విజయవాడ తూర్పు): విజయవాడలోని సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలలో నూతన వైద్య విధానాలపై పరిశోధనలు చేసేలా వైద్యులు, విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. మన ప్రాంతంలో సోకే వ్యాధులకు అవసరమైన వైద్య పరిష్కారాలపై ఇక్కడ పరిశోధనలు సాగిస్తున్నారు. ఇందుకు కళాశాలలో మల్టిడిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్(ఎంఆర్‌యూ)ను ఏర్పాటు చేశారు. దీని కేంద్రంగా వివిధ విభాగాల్లోని వైద్యులు, పోస్ట్రుగాడ్యుయేట్ విద్యార్థులు పరిశోధనలు చేస్తున్నారు. అందుకయ్యే ఖర్చును కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేయనుంది.
అయితే ముందుగా పరిశోధనలకు కళాశాల ఎథికల్ కమిటీ నుంచి అనుమతి పొందాలి. ఇలా అనుమతి పొందిన పరిశోధనలకు అయ్యే ఖర్చు మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఏం పరిశోధనలు చేయాలనుకుంటున్నారు? ఎలా చేస్తారు? ఏ అంశంపై చేస్తారు? అనే వివరాలను పేపర్ ప్రజెంటేషన్ రూపంలో సమర్పించాల్సి ఉంది. వీటిని వైద్య కళాశాలలోని ఎథికల్ కమిటీ పరిశీలించి అనుమతి ఇస్తుంది. తర్వాత కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం పంపుతారు. అక్కడి నుంచి అనుమతులు వచ్చాక పరిశోధనలు ప్రారంభించవచ్చు.
పలు విభాగాల్లో పరిశోధనలు
సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఇప్పటికే ఎనస్థీషియా, మైక్రోబయాలజీ విభాగాల్లో పరిశోధనలు పూర్తి చేశారు. ప్రస్తుతం కమ్యూనిటీ మెడిసిన్(ఎస్పీఎం)లో పరిశోధనలు కొనసాగుతున్నాయి. అలాగే పీడియాట్రిక్, జనరల్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, మైక్రోబయాలజీ విభాగాల్లో పరిశోధనలకు ఎథికల్ కమిటీ నుంచి అనుమతి పొంది కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. అక్కడి నుంచి అనుమతి రావాల్సి ఉంది.
క్లినికల్ రీసెర్చ్ సైతం..
ఔషధ రంగంలో కొత్తగా కనిపెట్టిన మందుల పనితీరుపై కూడా సిద్ధార్థ వైద్య కళాశాలలో క్లినికల్ రీసెర్చ్ చేస్తున్నారు. ఆయా వ్యాధులకు మందులు ఎలా పనిచేస్తున్నాయి? వంటి అంశాలపై పరిశోధనలు కొనసాగిస్తున్నారు. వీటికి సైతం ముందుగా ఎథికల్ కమిటీ నుంచి అనుమతులు తప్పనిసరి. అలాగే రోగి అంగీకారం కూడా అవసరం. కాగా కళాశాలలో జీనోమ్ సీక్వెన్స్ ల్యాబ్ అందుబాటులో ఉంది. ఇందులో కొత్తగా సోకే వ్యాధుల జీన్స్, ఏ రకం వ్యాధి అనేది గుర్తించనున్నారు. కరోనాలో కొత్త వేరియెంట్‌లతో పాటు హెచ్3ఎన్2 వైరస్ వంటి వాటిని కూడా గుర్తించే సదుపాయం ఉంది.
అందుబాటులోకి నూతన వైద్య విధానాలు
ఇప్పటివరకు వివిధ వ్యాధులకు ఎక్కడో చేసిన పరిశోధనల ఆధారంగా చికిత్స అందిస్తున్నారు. అలా కాకుండా మన ప్రాంతంలో సోకే వ్యాధులకు అవసరమైన వైద్య పద్ధతులపై ఇక్కడే పరిశోధనలు చేయడం ద్వారా నూతన వైద్య విధానాలు అందుబాటులోకి రానున్నాయి. వైద్యులు చేసే పరిశోధనల్లో వైద్య విద్యార్థులు సైతం భాగస్వాములు కానుండటంతో వారికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. చదువుకునే సమయంలోనే పరిశోధనలపై పట్టు సాధించడంతో పాటు కొత్త విధానాలను తెలుసుకునే అవకాశం లభిస్తుందని చెబుతున్నారు.
కొత్త చికిత్సలపై అవగాహన పెరుగుతుంది..
వైద్య కళాశాలలోని పలు విభాగాల్లో పరిశోధనలతో వైద్య విద్యార్థుల్లో పరిజ్ఞానం మరింత పెరుగుతుంది. నూతన వైద్య విధానాలు, కొత్త చికిత్సలపై అవగాహన పెంపొందించుకోవచ్చు. ప్రస్తుతం ఎనస్థీషియా, మైక్రోబయాలజీ విభాగాల్లో పరిశోధనలు పూర్తయ్యాయి. పరిశోధనల కోసం వైద్య కళాశాలలో ప్రత్యేకంగా మలీ్టడిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్‌ను ఏర్పాటు చేశాం. –డాక్టర్ కంచర్ల సుధాకర్, ప్రిన్సిపాల్, సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాల, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment