పీజీ డెంటల్ కౌన్సెలింగ్ గందరగోళం
- ఆపాలని కొంతమంది..
- కొనసాగించాలని మరికొంతమంది
- విద్యార్థుల్లో టెన్షన్..టెన్షన్
- ఎట్టకేలకు మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభ ం
విజయవాడ : డెంటల్ పోస్టుగ్రాడ్యుయేషన్ కౌన్సెలింగ్‌ను రద్దు చేసి మరలా నిర్వహించాలని కొందరు.. కౌన్సెలింగ్ నిర్వహించేందుకు చివరి రోజు కావడంతో ఏమి జరుగుతుందోననే ఆందోళనలో మరికొందరు విద్యార్థులతో సిద్ధార్థ వైద్య కళాశాల ప్రాంగణంలో గురువారం గందరగోళ వాతావరణం నెలకొంది. డెంటల్ పీజీ ప్రవేశ పరీక్ష ‘కీ’లో ఏడు ప్రశ్నలకు తప్పుడు సమాధానాలు ఇచ్చారని, డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డితో పాటు మరో ఆరుగురు హైకోర్టును ఆశ్రయించడంతో, కౌన్సెలింగ్‌ను నిలిపివేసి, ప్రశ్నాపత్రాలు పరిశీలించాలని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం అధికారులకు కోర్టు ఆదేశాలిచ్చింది.
దీంతో ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్ నిలిచిపోయింది. అప్పటికే పెద్ద సంఖ్యలో హాజరైన విద్యార్థుల్లో ఆందోళన ప్రారంభమైంది. హైకోర్టు నుంచిస్టే వచ్చిందని ప్రచారం జరగడం, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం గురువారం నాటికి కౌన్సెలింగ్ పూర్తి చేయాల్సి ఉన్నందున్న కౌన్సెలింగ్ జరగకపోతే తమ పరిస్థితి ఏమిటనే ఆందోళనకు గురయ్యారు.
అదే సమయంలో కోర్టును ఆశ్రయించిన విద్యార్థులు సైతం ప్రవేశ పరీక్ష కీలో తప్పుగా సమాధానాలు ఇచ్చారని, దీంతో ర్యాంకులు తారుమారయ్యాయంటూ ఆందోళన ప్రారంభించారు. కాగా హైకోర్టు ఆదేశాల మేరకు వ ర్సిటీ అధికారులు హైదరాబాద్, విజయవాడ డెంటల్ కళాశాలల ప్రిన్సిపాళ్లు డాక్టర్ బాలిరెడ్డి, డాక్టర్ టి.మురళీమోహన్‌లతోకూడిన ఎక్స్‌పర్ట్ కమిటీ ప్రశ్నాపత్రాలు, జవాబు పత్రాలు పరిశీలించి నివేదిక ఇచ్చిన అనంతరం 12 గంటలకు కౌన్సెలింగ్‌ను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.
దీంతో కోర్టును ఆశ్రయించిన విద్యార్థులు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న డాక్టర్ శశాంక్ వద్దకు వెళ్లి కోర్టు ఇచ్చినకాపీలను అందజేశారు. ఈ విషయంలో తామేమి చేయలేమని, వర్సిటీ అధికారులను కలిస్తే వివరణ ఇస్తారని వారు విద్యార్థులకు సూచించారు. దీంతో వారు వెనుదిరగడంతో అనంతరం కౌన్సెలింగ్‌ను కొనసాగించారు.