సిద్ధార్థకు ‘పీఎంఎస్‌ఎస్‌వై’ కన్సల్టెన్సీ రాక | Siddhartha 'piemesesvai consultancy arrival | Sakshi
Sakshi News home page

సిద్ధార్థకు ‘పీఎంఎస్‌ఎస్‌వై’ కన్సల్టెన్సీ రాక

Published Thu, Sep 18 2014 2:40 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 PM

సిద్ధార్థకు ‘పీఎంఎస్‌ఎస్‌వై’ కన్సల్టెన్సీ రాక

సిద్ధార్థకు ‘పీఎంఎస్‌ఎస్‌వై’ కన్సల్టెన్సీ రాక

  • రూ. 150 కోట్ల  కేంద్ర నిధులు
  •  రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించేనా?
  •  ప్రభుత్వాస్పత్రుల్లో  మెరుగైన సేవల నిమిత్తం
  • విజయవాడ : కేంద్ర ప్రభుత్వం సిద్ధార్థ వైద్య కళాశాలకు ప్రధానమంత్రి స్వాస్త్ సురక్ష యోజన(పీఎంఎస్‌ఎస్‌వై) పథకం ద్వారా కేటాయించిన రూ.150 కోట్ల నిధులతో చేపట్టనున్న పనులను ఎంపిక చేసేందుకు  కన్సల్టెన్సీ వారం పది రోజుల్లో రానున్నట్లు తెలిసింది. ఈమేరకు బుధవారం వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ సూచనప్రాయంగా తెలియజేశారు.

    ప్రభుత్వాస్పత్రుల్లో సూపర్‌స్పెషాలిటీ విభాగాల అభివృద్ధితో పాటు, మెరుగైన సేవలందించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా పలు వైద్య కళాశాలలకు గత బడ్జెట్‌లో పీఎంఎస్‌ఎస్‌వై కింద నిధులు కేటాయించగా, సిద్ధార్థ వైద్య కళాశాలకు  రూ.150 కోట్లు కేటాయించారు. ఆ నిధుల  వినియోగానికి సంబంధించి పలు ప్రతిపాదనలను ఆస్పత్రి, వైద్య కళాశాల అధికారులు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికినివే దించారు.

    ప్రస్తుతం ఉన్న న్యూరాలజీ, న్యూరోసర్జరీ, కార్డియాలజీ, ప్లాస్టిక్ సర్జరీ విభాగాలను ఆధునీకరించడంతో పాటు అంకాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, ఎండోక్రైనాలజీ, పిడియాట్రిక్ సర్జరీ వంటి విభాగాల ఏర్పాటుతో పాటు, ఎంఆర్‌ఐ స్కాన్ ఏర్పాటు చేయాల్సి ఉందని అధి    కారులు నివేదిక సమర్పించారు.    

    నివేదిక ఆధారంగా పథకం నియమ నిబంధనల ప్రకారం భవన నిర్మాణాలను అందుబాటులో ఉన్న స్థలాన్ని పరిశీలించడంతో పాటు, పరికరాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన కన్సల్టెన్సీ  వైద్య కళాశాలకు రానున్నట్లు తెలిసింది. ఇప్పటికే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను వారికి చూపించాలని అధికారులు నిర్ణయించారు. అయితే  ఆ ప్లాన్ ప్రకారం భవనాల నిర్మాణానికే రూ.250 కోట్లు అవుతుందని, ప్రస్తుతానికి అది సాధ్యపడదని  అధికారులే అంటున్నారు.
     
    మ్యాచింగ్ గ్రాంటు వస్తేనే మెరుగైన సేవలు
     
    కేంద్ర ప్రభుత్వం పీఎంఎస్‌ఎస్‌వై పథకం కింద రూ.150 కోట్లు కేటాయించగా, దానిలో 20 శాతం అంటే రూ.30 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అంతమొత్తం చెల్లించడం సందేహాస్పదంగా మారింది. గతంలో పోస్టుగ్రాడ్యుయేషన్ విద్యార్థులకు సౌకర్యాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం రూ.7 కోట్లు కేటాయించగా, దానికి మ్యాచింగ్ గ్రాంటును రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో  రెండేళ్లు పనులు చేపట్టకుండా అలాగే ఉంచి చివరికి తిరిగి పంపించారు. ఈ సారి కూడా అలాంటి పరిస్థితులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా సకాలంలో చెల్లిస్తే సూపర్‌స్పెషాలిటీ విభాగాల్లో మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని పలువురు ఆశిస్తున్నారు.  
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement