ప్రభుత్వాలు మారుతున్నా జిల్లాలో సాగునీరు, ఇతరత్ర ప్రాజెక్టుల నిర్మాణం ముందుకు సాగటం లేదు. ఏటా బడ్జెట్‌లో నిధుల కేటాయింపు అత్తెసరుగా ఉంటుండటంతో పనుల్లో పురోగతి లేదు. వైఎస్ హయాంలో మొదలుపెట్టిన రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ పనులు గడవుదాటినా పూర్తి కాలేదు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టే బడ్జెట్‌పై జిల్లా ప్రజానీకం కోటి ఆశలతో ఉంది.
సాక్షి, ఖమ్మం: ప్రభుత్వాలు మారుతున్నా జిల్లాలో సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం ముందుకు సాగటం లేదు. ఏటా బడ్జెట్‌లో నిధుల కేటాయింపు అత్తెసరుగా ఉంటుండటంతో పనులు కదలడం లేదు. వైఎస్ ప్రభుత్వం హయాంలో జలయజ్ఞంలో భాగంగా మొదలుపెట్టిన రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ పనులు గడవుదాటినా పూర్తి కాలేదు. నూతన రాష్ట్రంలో నూతన ప్రభుత్వమైనా ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు విడుదల చేస్తుందేమోనని జిల్లా రైతాంగం ఆశగా ఎదురు చూస్తోంది.
రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులకు అవసరమైన భూమి సేకరణలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. రాజీవ్‌సాగర్‌కు 6,258 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. నేటికీ కేవలం 750 ఎకరాలను మాత్రమే సేకరించారు. ఇందిరాసాగర్ నిర్మాణానికి 5,708 ఎకరాలకు 950 ఎకరాలే సేకరించారు. మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి మరణంతో ఈ ప్రాజెక్టులకు తగినన్ని నిధులను ప్రభుత్వాలు విడుదల చేయడం లేదు. నూతన ప్రభుత్వం గత ఏడాది నవంబర్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనూ ఈ ప్రాజెక్టులకు అరకొరగానే నిధులు కేటాయించింది.
నత్తనడకన ఇందిరాసాగర్
ఇందిరాసాగర్ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,824 కోట్లు. కానీ ఇప్పటి వరకు రూ.1,150.36 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.886.533 కోట్లు ఖర్చు చేశారు. 2011-12 నాటికి అన్నిరకాల పనులు పూర్తి కావాల్సి ఉన్నా నేటికీ పూర్తికాలేదు. ప్రధానంగా ఈ ప్రాజెక్టు ఎత్తిపోతల కేంద్రం, కొంత ఆయకట్టు ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లడంతో నిధుల విషయంలో ప్రభుత్వం ఎలా అడుగులు వేస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో వేలేరుపాడు మండలం రుద్రమకోట వద్ద గోదావరి ఎత్తిపోతల ద్వారా జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలోని కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో సాగు నీరు ఇవ్వాలనే ఆశయం నెరవేరలేదు.
ఇప్పటివరకు జిల్లాలో కేవలం 24 కిలో మీటర్ల దూరం అండర్ గ్రౌండ్ పైపులైను పనులు జరిగాయి. మిగిలిన పనులకు బ్రేక్ పడింది. ఈ ప్రాజెక్టుతో మూడు జిల్లాల్లో కలిపి సుమారు 2లక్షల ఎకరాలకు నీరు అందించడం ప్రధాన ఉద్దేశం. జిల్లాలో ఏడు మండలాలు, కృష్ణా జిల్లాలో 2 మండలాలు, పశ్చిమగోదావరి జిల్లాలో 4 మండలాల పరిధిలోని 148 గ్రామాల పరిధిలో భూములకు సాగు నీరు ఇవ్వడానికి అవసరమైన భూ సేకరణలో ప్రభుత్వం విఫలమైంది. ప్రధాన ఎత్తిపోతల నిర్మాణ కేంద్రం వేలేరుపాడు మండలం ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లడంతో ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం నిధుల కేటాయింపుపై నీలినీడలు అలుముకున్నాయి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందిస్తేనే ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుందని నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ముందుకు సాగని రాజీవ్‌సాగర్
జిల్లాతో పాటు వరంగల్ జిల్లాలోని సుమారు 2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలనే లక్ష్యంతో రాజీవ్‌సాగర్ ప్రాజెక్టును రూపొందించారు. గోదావరి నదిపై అశ్వాపురం మండలం పాములపల్లి వద్ద ఎత్తిపోతల ద్వారా నీటిని తీసుకొని జిల్లాలోని16 మండలాలు, వరంగల్ జిల్లాలో ఒక మండలానికి సాగు నీరు అందించాలని డిజైన్ చేశారు. రాజీవ్‌సాగర్ ఎత్తిపోతల ప్రాజెక్టును 2007లో రూ.1,681 కోట్లతో చేపట్టారు. సాంకేతికంగా ఈ ప్రాజెక్టుకు రూ.1,254 కోట్లు కేటాయించారు.
పనులు ప్రారంభించి ఏడళ్లయినా కేవలం 50 శాతం మేరకే పూర్తయ్యూరుు. కేటాయించిన వాటిలో రూ. 842.914 కోట్లు ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు 2012 నాటికి పూర్తి చేసి నిర్ధారిత ఆయకట్టుకు నీరు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గడువు దాటినా ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేక పోయారు. భూ సేకరణలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
గత ఏడాది నవంబర్ బడ్జెట్‌లో నూతన ప్రభుత్వం పెద్దవాగు ప్రాజెక్టుకు రూ.20 లక్షలు, కిన్నెరసాని, తాలిపేరు, గుండ్లవాగు, వైరా రిజర్వాయర్లకు ఒక్కో దానికి రూ.10 లక్షల చొప్పున కేటాయించింది. ఈ నిధులు కేవలం తాత్కాలిక మరమ్మతులకే కేటాయించారు. ఎక్కువ నిధులు కేటాయించాలని రైతులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
మిషన్ కాకతీయ కింద జిల్లాలో 4,500 చెరువులు మరమ్మతులు చేయూలి. మొదటి విడతలో 903 చెరువులను ఆధునికీకరించాలని నిర్ణయించారు. వీటిలో 450 చెరువుల వరకు టెండర్ల ప్రక్రియ పూర్తి అయింది. పనులు ఈ వేసవిలో ప్రారంభం కానున్నాయి. ఖరీఫ్ నాటికి ఇవి పూర్తవటం కష్టమేనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దళితులకు భూ పంపిణీ పథకం ఆరంభ శూరత్వంగానే మిగిలింది. జిల్లాలో తొమ్మిది మంది లబ్ధిదారులను మాత్రమే ఎంపిక చేసి 22.14 ఎకరాలు పంపిణీ చేశారు. దీన్ని తొలుత ఖమ్మం రెవెన్యూ డివిజన్ వరకే వర్తింపజేశారు. డివిజన్‌లోని 17 మండలాల్లో ఒక్కో గ్రామం చొప్పున 17 గ్రామాలను పెలైట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఈ గ్రామాల్లో ఎన్ని ఎస్పీ కుటుంబాలు ఉన్నాయో సర్వే చేశారు. దీని ప్రకారం మొత్తం 6,487 కుటుంబాలు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో 4,391 కుటుంబాలకు భూమి ఉండగా 2,096 కుటుంబాలకు భూమి లేదని నిర్ధారించారు. గత ఏడాది ఆగస్టు 15న తొమ్మిది మందికి 21 ఎకరాలు భూమి పంపిణీ చేశారు.
జిల్లా కేంద్ర ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా తీర్చిదిద్దుతామని గతంలో ప్రభుత్వం చేసిన ప్రకటన కాగితాలకే పరిమితమైంది. పాల్వంచ కేటీపీఎస్ ఏడో దశ విస్తరణ పనులు, మణుగూరులో నూతనంగా చేపడుతున్న విద్యుత్ ప్రాజెక్టు పనులకు భారీ మొత్తంలో నిధులు కేటాయిస్తేనే గడువులోపు పూర్తవుతారుు.
2007 నుంచి గత ఏడాది వరకు ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులకు ఖర్చు చేసిన నిధులు (రూ. కోట్లలో)..
సంవత్సరం ఇందిరాసాగర్ రాజీవ్‌సాగర్
2007 - 08 211.724 62.238
2008 - 09 407.683 189.589
2009 - 10 130.699 158.89
2010 - 11 71.529 95.847
2011 - 12 20.464 162.343
2012 - 13 30.844 151.067
2013 - 14 8.59 11.94
2014 - 15 5 11
మొత్తం 886.533 842.914
కోటి ఆశలు
Published Wed, Mar 11 2015 3:36 AM | Last Updated on Sat, Sep 2 2017 10:36 PM
Advertisement
Advertisement