మళ్లీ మాయే! | Yanamala pout all the groups on a budget | Sakshi
Sakshi News home page

మళ్లీ మాయే!

Published Thu, Mar 16 2017 1:49 AM | Last Updated on Tue, Sep 5 2017 6:10 AM

మళ్లీ మాయే!

మళ్లీ మాయే!

యనమల బడ్జెట్‌పై అన్ని వర్గాల పెదవి విరుపు
జిల్లాకు స్పష్టమైన కేటాయింపులు శూన్యం
తిరుపతిలో ఎస్సీ విద్యార్థులకు మోడల్‌ ఐటీఐ
చిత్తూరులో మెగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్కు


మళ్లీ ఊహించినట్లే జరిగింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం శాసన సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అంకెల గారడీని తలపించింది. పెద్దఎత్తున హామీలు తప్ప జిల్లా అభివృద్ధికి అవసరమైన నిధుల కేటాయింపులు లేకుండా పోయాయి. విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి ఎంతో చేస్తున్నామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఆయా రంగాలకు అరకొర నిధులు కేటాయించి చేతులు దులుపుకుంది.

తిరుపతి : అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో వివిధ రంగాలవారీగా కేటాయింపులను వేల కోట్లలో చూపిన ఆర్థిక మంత్రి జిల్లాల వారీ అవసరాలను, ఇచ్చిన హామీలను విస్మరించారు. అమరావతి అభివృద్ధి, హైటెక్‌ టెక్నాలజీకి పెద్ద పీట అంటూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి సగటు మనిషి ఆర్థిక స్థితిగతులను ప్రభావితం చేసే రంగాలకు కేటాయిం పులు మరిచిపోయారు. దీంతో బడ్జెట్‌పై అన్ని వర్గాల ప్రజలూ పెదవి విరుస్తున్నారు.

గత ఏడాది కేటాయించిన నిధులకు విడుదలైన నిధులకు పొంతన లేకుండా పోయిందనీ, జిల్లాలో చేసిన పనులు కూడా తక్కువేనని పలువురు ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. గృహనిర్మాణం, మైనార్టీ,  గిరిజన సంక్షేమం, ఉపాధి కల్పన వంటి రంగాలకు ఆశించిన మేర కేటాయింపులు  లేకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. గత ఏడాది ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో చిత్తూరు జిల్లాకు, తిరుపతి నగరానికి ఆర్థిక మంత్రి వరాలు ప్రకటించారు. తిరుపతిలో సైబర్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సు, కన్వెన్షన్‌ సెంటర్, స్పోర్ట్స్‌ కాంప్లెక్సు, ఇంక్యూబేషన్‌ సెంటర్ల ఏర్పాటుకు ని«ధులు కేటాయిస్తున్నట్లు అప్పట్లో ప్రకటించారు. చిత్తూరు జిల్లాలో 5 వేల హెక్టార్లలో జాతీయ పెట్టుబడులు, ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నామని కూడా చెప్పారు. అయితే ఇవన్నీ అమలు జరిగిన దాఖలాలు గానీ, కనీసం మొదలు పెట్టినట్లు గానీ లేదు.

తలకిందులైన ప్రాజెక్టుల కేటాయింపులు
జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులకు అంతంత మాత్రంగా నిధులు కేటాయించారు. ఈ బడ్జెట్‌లో జలవనరుల శాఖకు రూ.16 వేల కోట్ల కేటాయింపులు ఉంటాయని భావించిన నీటిపారుదల శాఖ అధికారులు తెలుగుగంగ చీఫ్‌ ఇంజినీర్‌ పరిధిలోని అన్ని ప్రాజెక్టులకూ సుమారు రూ.1,830 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పెట్టగా అసలు కేటాయింపులే తగ్గాయి. మొత్తం జలవనరుల శాఖకు రూ.12,770 కోట్లు కేటాయించిన ప్రభుత్వం జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులైన హంద్రీ–నీవా, గాలేరు –నగరి, తెలుగు గంగ ప్రాజెక్టులకు అరకొర కేటాయింపులతో చేతులు దులుపుకుంది. సుమారు రూ.3 వేల కోట్లు అవసరమైన హంద్రీ–నీవాకు కేవలం రూ.479 కోట్లు కేటాయించారు.

ఈ ప్రాజెక్టు కింద పూర్తయిన పనులకు ఇంకా రూ.91 కోట్లు ప్రభుత్వం బిల్లుల కింద చెల్లించాల్సి ఉంది. అదేవిధంగా గాలేరు నగరి ప్రాజెక్టు పూర్తయ్యేందుకు రూ.1000 కోట్లకు పైగా అవసరమై ఉండగా, ఈ ఏడాది బడ్జెట్‌లో కేవలం రూ. 363.12 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇకపోతే రూ.57.09 కోట్లు కేటాయించారు. కిందటేడాది బడ్జెట్‌లో ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు రూ. 78 కోట్లు కేటాయించింది. అయితే పనులు మాత్రం రూ.22 కోట్లకే జరిగాయి.

విశ్వవిద్యాలయాలకు నిధులు
అయితే జిల్లాలోని నాలుగు యూనివర్సిటీలకు మాత్రం ప్రభుత్వం నిధులు కేటాయించింది. గత ఏడాదితో పోలిస్తే మూడు వర్సిటీలకు కొద్దిమేర ని«ధులను పెంచారు. ఎస్వీయూకు రూ.172 కోట్లు, పద్మావతీ మహిళా యూనివర్సిటీకి రూ. 46.08 కోట్లు, వెటర్నరీ వర్సిటీకి రూ. 153 కోట్లు, కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీకి రూ. 22.09 కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు. సీఎం చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తోన్న కుప్పం నియోజకవర్గానికి ఆర్థిక మంత్రి యనమల ఎక్కువ నిధులను కేటాయించారు. కిందటేడాది కేటాయింపుల మేరకు ని«ధులను ఖర్చు చేయని సర్కారు ఈ ఏడాది మళ్లీ ఆర్భాటంగా వర్సిటీల వారీ నిధుల కేటాయింపులను ప్రకటించింది.

ఈ బడ్జెట్‌ హామీలివే....
1 ఈ ఏడాది రాష్ట్రంలో రూ.570 కోట్ల విలువ గల ఐటీ ఉత్పత్తులు ఎగుమతి కాగలవని భావిస్తోన్న ప్రభుత్వం రెండు ఇంక్యుబేషన్‌ టవర్ల ద్వారా 33 స్టార్టప్‌లను పోత్సహిస్తోన్నట్లు చెబుతోంది. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా శ్రీసిటీలో ఎలక్ట్రానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
2 తిరుపతి శివారులో షెల్యూల్డ్‌ కులాల విద్యార్థుల కోసం కొత్తగా ఓ మోడల్‌ ప్రభుత్వ ఐటీఐని  ఏర్పాటు చేయనున్నామని యనమల  ప్రకటించారు.
3 జాతీయ స్మార్ట్‌ సిటీ మిషన్‌ కింద తిరుపతి పట్టణాన్ని అభివృద్ధి పరుస్తాం. ఇందుకోసం విశాఖ, తిరుపతి. కాకినాడ పట్టణాలకు రూ. 450 కోట్ల కేటాయింపు
4 చిత్తూరులో మెగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement