minister yanamala ramakrishnudu
-
ఎరక్కపోయి ఇరుక్కుపోయిన మంత్రి
-
ఎరక్కపోయి ఇరుక్కుపోయిన యనమల
♦ ప్రతిపక్షనేత బైటకు వెళ్లడంపై ఆర్థికమంత్రి వ్యంగ్య వ్యాఖ్యలు ♦ వాష్రూంకి వెళ్లినా రాజకీయమేనా అంటూ జగన్ చురకలు సాక్షి, అమరావతి: బడ్జెట్‌పై చర్చ జరుగుతుంటే బైటకు వెళ్లారని.. వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌ను ఇరుకున పెట్టాలని చూసిన ఆర్థిక మంత్రి యనమల చివరకు తానే ఇరుక్కుపోయారు. బడ్జెట్‌పై ప్రభుత్వం తరఫున సమాధానమిచ్చేందుకు సిద్ధమైన యనమల ‘ప్రతిపక్ష నేత బాయ్ కాట్ చేసినట్లా? ఏదైనా పని ఉండి బయటకు వెళ్లినట్టా.. బాత్రూంకి వెళ్లినట్లా..’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. లోనికి వచ్చిన జగన్ చిటికెన వేలు చూపిస్తూ.. ఇలా చూపించి వెళ్లాలని తనకు తెలియదన్నారు. ‘అధ్యక్షా ఇదేం పద్ధతి చివరకు వాష్రూంకి వెళ్లినా రాజకీయం చేస్తారా?’ అని చురకలంటించారు. ‘‘సభలో అందరికంటే ఎక్కువ సమయం కేటాయించేది నేనే. మా వాళ్లకు స్ఫూర్తినివ్వడం కోసం నేను ఇక్కడే కూర్చుంటా.. మీరు వ్యక్తిగతంగా దూషణలు చేస్తూ మాట్లాడినా.. ఎనిమిదేళ్ల క్రితం చని పోయిన మా నాన్న గురించి ఆరోపణలు చేస్తున్నా ఓపికగా ఉంటున్నా.. కుక్కతోక వంకర అన్నట్లు ఏదో ఒక అభాండం వేయాలని, ఏదో ఒక విమర్శ చేయాలని అన్నట్లుగా ఉంది మీ ధోరణి’’ అని జగన్ వ్యాఖ్యానించారు. ఆర్థికమంత్రి సమాధానమి స్తుండగా సీఎం చంద్రబాబే సభలో లేకుండా పోయారని జగన్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతను ఇరుకున పెట్టాలని చూసి యనమలే ఇరుకునపడ్డారని సొంత పార్టీ సభ్యులు వ్యాఖ్యానించడం గమనార్హం. -
కొత్త మద్యం పాలసీ రానుంది
⇒రాష్ట్ర బడ్జెట్లో స్పష్టం చేసిన మంత్రి ⇒మండల యూనిట్‌గా మద్యం అంగళ్లు ⇒పరిగణనలోకి సుప్రీం తీర్పు ⇒వచ్చే వారంలో నోటిఫికేషన్? కొత్త మద్యం పాలసీపై ప్రభుత్వం ఓ స్పష్టత ఇచ్చింది. బుధవారం అమరావతిలో జరిగిన రాష్ట్ర బడ్జెట్ ప్రసంగంలో మంత్రి యనమల రామకృష్ణుడు దీనిపై ప్రకటన చేశారు. ఈ సమావేశాల్లోనే కొత్త మద్యం పాలసీ ప్రకటించనున్నట్లు తెలిపారు. దీంతో కొన్నాళ్లుగా సందిగ్ధంలో ఉన్న మద్యం విధి విధానాలపై సమాధానం లభించినట్లయ్యింది. చిత్తూరు (అర్బన్):జిల్లాలో తిరుపతి ఎక్సైజ్ పరిధిలో 212 మద్యం దుకాణాలు, చిత్తూరు ఎక్సైజ్ పరిధిలో 207 మద్యం దుకాణాలకు ఈ ఏడాది జూన్ వరకు ప్రభుత్వం లైసెన్సులు జారీ చేసింది. అయితే జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఉండడానికి వీల్లేదంటూ గత ఏడాది సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి నెలాఖరులోపు 500 మీటర్ల పరిధిలో ఉన్న మద్యం దుకాణాలను మూసేయాలని తీర్పునిచ్చింది. తమకు జూన్ వరకు గడువు ఇవ్వాలంటూ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా.. రెండు రోజుల క్రితం సీఎం ఆదేశాలతో పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వచ్చే వారంలో దీనిపై అధికారిక ప్రకటన విడుదల కానుంది. ఇదీ కొత్త పాలసీ ప్రభుత్వం కొత్తగా విడుదల చేసే పాలసీలో 500 మీటర్ల పరిధిలో ఉన్న దుకాణాలను ఇతర ప్రాంతాల్లో జూన్ వరకు నిర్వహించుకోవడానికి అవకాశం ఇవ్వనుంది. దీనికి ఇప్పటి వరకు ఉన్న లైసెన్సు నిబంధనలే వర్తింప చేస్తారు. మిగిలిన దుకాణాలకు ఏప్రిల్ 1 నుంచి ప్రవేశపెట్టనున్న కొత్త పాలసీ అమలు చేస్తారు. ఇప్పటి వరకు మద్యం విక్రయదారులు కనిష్టంగా రూ.34 లక్షల నుంచి గరిష్టంగా రూ.45 లక్షలు చెల్లించి రెండేళ్లకు లైసెన్సులు తీసుకుంటున్నారు. కొత్త పాలసీలో దీన్ని రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్యలో నిర్ణయించే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పైగా మద్యం విక్రయాల్లో వ్యాపారులకు సగటున లభిస్తున్న 18 శాతం మార్జిన్‌ను కొత్త పాలసీలో 12 శాతానికి తగ్గించే అవకాశాలున్నాయి. ఇక మండలాన్ని, పట్టణాలను, కార్పొరేషన్లను ఓ యూనిట్‌గా పరిగణించి ఒక్కో మండలంలో నిర్ణీత దుకాణాలు నిబంధనలకు లోబడి పక్క పక్కనే పెట్టుకునే వెసులుబాటు కల్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అంటే చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో 18 దుకాణాలుంటే వీటన్నింటిని కలిపి ఒకే వ్యక్తికి లాటరీ పద్ధతిలో కేటాయిస్తారు. మద్యం దుకాణాలతో పాటు బార్లకు సైతం ఏడేళ్ల తరువాత వచ్చే వారంలోనే కొత్త పాలసీ ప్రకటించనున్నారు. -
మళ్లీ మాయే!
⇒యనమల బడ్జెట్‌పై అన్ని వర్గాల పెదవి విరుపు ⇒జిల్లాకు స్పష్టమైన కేటాయింపులు శూన్యం ⇒తిరుపతిలో ఎస్సీ విద్యార్థులకు మోడల్ ఐటీఐ ⇒చిత్తూరులో మెగా ఫుడ్ ప్రాసెసింగ్ పార్కు మళ్లీ ఊహించినట్లే జరిగింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం శాసన సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీని తలపించింది. పెద్దఎత్తున హామీలు తప్ప జిల్లా అభివృద్ధికి అవసరమైన నిధుల కేటాయింపులు లేకుండా పోయాయి. విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి ఎంతో చేస్తున్నామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఆయా రంగాలకు అరకొర నిధులు కేటాయించి చేతులు దులుపుకుంది. తిరుపతి : అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో వివిధ రంగాలవారీగా కేటాయింపులను వేల కోట్లలో చూపిన ఆర్థిక మంత్రి జిల్లాల వారీ అవసరాలను, ఇచ్చిన హామీలను విస్మరించారు. అమరావతి అభివృద్ధి, హైటెక్ టెక్నాలజీకి పెద్ద పీట అంటూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి సగటు మనిషి ఆర్థిక స్థితిగతులను ప్రభావితం చేసే రంగాలకు కేటాయిం పులు మరిచిపోయారు. దీంతో బడ్జెట్‌పై అన్ని వర్గాల ప్రజలూ పెదవి విరుస్తున్నారు. గత ఏడాది కేటాయించిన నిధులకు విడుదలైన నిధులకు పొంతన లేకుండా పోయిందనీ, జిల్లాలో చేసిన పనులు కూడా తక్కువేనని పలువురు ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. గృహనిర్మాణం, మైనార్టీ, గిరిజన సంక్షేమం, ఉపాధి కల్పన వంటి రంగాలకు ఆశించిన మేర కేటాయింపులు లేకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. గత ఏడాది ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో చిత్తూరు జిల్లాకు, తిరుపతి నగరానికి ఆర్థిక మంత్రి వరాలు ప్రకటించారు. తిరుపతిలో సైబర్ స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్సు, కన్వెన్షన్ సెంటర్, స్పోర్ట్స్ కాంప్లెక్సు, ఇంక్యూబేషన్ సెంటర్ల ఏర్పాటుకు ని«ధులు కేటాయిస్తున్నట్లు అప్పట్లో ప్రకటించారు. చిత్తూరు జిల్లాలో 5 వేల హెక్టార్లలో జాతీయ పెట్టుబడులు, ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నామని కూడా చెప్పారు. అయితే ఇవన్నీ అమలు జరిగిన దాఖలాలు గానీ, కనీసం మొదలు పెట్టినట్లు గానీ లేదు. తలకిందులైన ప్రాజెక్టుల కేటాయింపులు జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులకు అంతంత మాత్రంగా నిధులు కేటాయించారు. ఈ బడ్జెట్లో జలవనరుల శాఖకు రూ.16 వేల కోట్ల కేటాయింపులు ఉంటాయని భావించిన నీటిపారుదల శాఖ అధికారులు తెలుగుగంగ చీఫ్ ఇంజినీర్ పరిధిలోని అన్ని ప్రాజెక్టులకూ సుమారు రూ.1,830 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పెట్టగా అసలు కేటాయింపులే తగ్గాయి. మొత్తం జలవనరుల శాఖకు రూ.12,770 కోట్లు కేటాయించిన ప్రభుత్వం జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులైన హంద్రీ–నీవా, గాలేరు –నగరి, తెలుగు గంగ ప్రాజెక్టులకు అరకొర కేటాయింపులతో చేతులు దులుపుకుంది. సుమారు రూ.3 వేల కోట్లు అవసరమైన హంద్రీ–నీవాకు కేవలం రూ.479 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టు కింద పూర్తయిన పనులకు ఇంకా రూ.91 కోట్లు ప్రభుత్వం బిల్లుల కింద చెల్లించాల్సి ఉంది. అదేవిధంగా గాలేరు నగరి ప్రాజెక్టు పూర్తయ్యేందుకు రూ.1000 కోట్లకు పైగా అవసరమై ఉండగా, ఈ ఏడాది బడ్జెట్లో కేవలం రూ. 363.12 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇకపోతే రూ.57.09 కోట్లు కేటాయించారు. కిందటేడాది బడ్జెట్లో ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు రూ. 78 కోట్లు కేటాయించింది. అయితే పనులు మాత్రం రూ.22 కోట్లకే జరిగాయి. విశ్వవిద్యాలయాలకు నిధులు అయితే జిల్లాలోని నాలుగు యూనివర్సిటీలకు మాత్రం ప్రభుత్వం నిధులు కేటాయించింది. గత ఏడాదితో పోలిస్తే మూడు వర్సిటీలకు కొద్దిమేర ని«ధులను పెంచారు. ఎస్వీయూకు రూ.172 కోట్లు, పద్మావతీ మహిళా యూనివర్సిటీకి రూ. 46.08 కోట్లు, వెటర్నరీ వర్సిటీకి రూ. 153 కోట్లు, కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీకి రూ. 22.09 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. సీఎం చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తోన్న కుప్పం నియోజకవర్గానికి ఆర్థిక మంత్రి యనమల ఎక్కువ నిధులను కేటాయించారు. కిందటేడాది కేటాయింపుల మేరకు ని«ధులను ఖర్చు చేయని సర్కారు ఈ ఏడాది మళ్లీ ఆర్భాటంగా వర్సిటీల వారీ నిధుల కేటాయింపులను ప్రకటించింది. ఈ బడ్జెట్ హామీలివే.... 1 ఈ ఏడాది రాష్ట్రంలో రూ.570 కోట్ల విలువ గల ఐటీ ఉత్పత్తులు ఎగుమతి కాగలవని భావిస్తోన్న ప్రభుత్వం రెండు ఇంక్యుబేషన్ టవర్ల ద్వారా 33 స్టార్టప్‌లను పోత్సహిస్తోన్నట్లు చెబుతోంది. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా శ్రీసిటీలో ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2 తిరుపతి శివారులో షెల్యూల్డ్ కులాల విద్యార్థుల కోసం కొత్తగా ఓ మోడల్ ప్రభుత్వ ఐటీఐని ఏర్పాటు చేయనున్నామని యనమల ప్రకటించారు. 3 జాతీయ స్మార్ట్ సిటీ మిషన్ కింద తిరుపతి పట్టణాన్ని అభివృద్ధి పరుస్తాం. ఇందుకోసం విశాఖ, తిరుపతి. కాకినాడ పట్టణాలకు రూ. 450 కోట్ల కేటాయింపు 4 చిత్తూరులో మెగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు -
మార్చి తొలి వారంలో బడ్జెట్
ఆర్థిక మంత్రి యనమల వెల్లడి ఈ నెల 30, 31 తేదీల్లో బడ్జెట్‌పై మంత్రులు, అధికారులతో భేటీ సాక్షి, అమరావతి: వచ్చే ఆర్థిక సంవత్సరం (2017–18) వార్షిక బడ్జెట్‌ను మార్చి తొలి వారంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఆదాయ రాబడులను వాస్తవాలకు దగ్గరగా అంచనా వేస్తామని, అందుకు అనుగుణంగానే బడ్జెట్ రూపొందించనున్నామని చెప్పారు. ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారులు అంతర్గతంగా బడ్జెట్ రూపకల్పనను ప్రారంభించారని, చాలా వరకు కసరత్తు పూర్తవుతోందన్నారు. బడ్జెట్ రూపకల్పన, ఆదాయ వ్యయాల అంచనాలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పరిస్థితిపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో, సామాజిక ఆర్థిక సర్వే రూపకల్పనపై ప్రణాళిక శాఖ అధికారులతో మంత్రి సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 30, 31 తేదీల్లో బడ్జెట్ ప్రతిపాదనలపై శాఖల మంత్రులు ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గత మూడు సంవత్సరాల్లో బడ్జెట్ కేటాయింపులు, వ్యయం సామర్థ్యం ఆధారంగానే వచ్చే బడ్జెట్లో ఆయా శాఖలకు కేటాయింపులుంటాయని ఆయన స్పష్టం చేశారు. -
టీటీడీలో ప్రతిపైసాకు లెక్క చూపాల్సిందే..
మంత్రి యనమల రామకృష్ణుడు సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో ఆదాయ వ్యయాలన్నింటికీ ఆడిట్ జరగాల్సిందేనని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. భక్తులు సమర్పించే కానుకల్లో వాడే ప్రతిపైసాకు లెక్కచూపి, భక్తులకు జవాబు చెప్పాల్సిందేనని ఆయన స్పష్టంచేశారు. టీటీడీ నిర్వహించిన కొన్ని స్కీములు, ఎస్వీబీసీతోపాటు ఖర్చులపై ఇంకా ఆడిట్ జరగాల్సిన అవసరం ఉందన్నారు. టీటీడీ వ్యవహారాలపై ఏప్రిల్‌లో సమావేశం నిర్వహించి సమీక్షిస్తామని తెలిపారు. శుక్రవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏటా రూ.4 వేల కోట్ల ఆదాయం వచ్చే టీటీడీలో సేవా టికెట్లు, లడ్డూ ధరలు పెంచాలనుకోవడం సబబు కాదని ఆయన అన్నారు. భక్తులపై భారం వేసి ఆదాయాన్ని పెంచుకోవాలన్న ధార్మిక సంస్థ ఆలోచన మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. -
'9 నెలల్లో మంజునాథ్ కమిషన్ నివేదిక'
విజయవాడ: కాపులను బీసీల్లో చేర్చే అంశంపై జస్టిస్ మంజునాథ్ కమిషన్ 9 నెలల్లో నివేదిక ఇస్తుందని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ...కమిషన్‌లోని ఇతర సభ్యుల నియామకం, విధివిధానాలు త్వరలో రూపొందిస్తామన్నారు. కాపులను ఏ కేటగిరిలో చేర్చాలనేది కమిషన్ నిర్ణయిస్తుందన్నారు. ఏపీలో బీసీ రిజర్వేషన్ 4 కేటగిరీలలో మొత్తం 144 కులాల వారున్నారని యనమల పేర్కొన్నారు. కాపుల రిజర్వేషన్ల విధివిధానాలపై చంద్రబాబుతో జస్టిస్ మంజునాథ్ గురువారం భేటీకానున్నారు. అంతకు ముందు విజయవాడలోని స్టేట్ గెస్ట్ హౌస్‌లో యనమలతో బీసీ సంఘాల నేతలు భేటీ అయ్యారు. ఏపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా 13 జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల్ని ముట్టడించనున్న నేపథ్యంలో మంత్రి, నేతలతో సమాలోచనలు జరిపారు. ఆందోళన విరమించుకోవాలని నేతలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. -
నెగ్గిన యనమల పంతం.. కోడెల యత్నాలు విఫలం
- హైదరాబాద్‌లోనే ఏపీ అసెంబ్లీ సమావేశాలు - మంత్రుల ద్వారా సీఎంపై ఒత్తిడిపెంచిన యనమల సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ వ్యవహారాలు, ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తన పంతం నెగ్గించుకున్నారు. హైదరాబాద్‌లోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని మంత్రుల ద్వారా ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చి ఆమోదింప చేసుకున్నారు. అందుకు అనుగుణంగా మంత్రివర్గ సమావేశంలో ప్రకటన చేయించారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు పలువురు, అధికారులు నూతన రాజధాని ప్రాంతం గుంటూరు జిల్లాలో నివాసం ఉండటంతో పాటు విజయవాడ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గుంటూరు జిల్లాలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా అక్కడే నిర్వహిస్తే బాగుంటుందని సభాపతి కోడెల శివప్రసాదరావు భావించారు. ఇదే విషయం సీఎంతో చర్చించి గుంటూరు జిల్లాలోని హాయ్‌ల్యాండ్‌కు అధికారుల బృందాన్ని పంపించి సభ నిర్వహణకు గల సాధ్యాసాధ్యాలపై నివేదిక రూపొందింపజేశారు. కే ఎల్ విశ్వవిద్యాలయాన్ని కోడెల స్వయంగా పరిశీలించారు. అక్కడ సమావేశాల ఏర్పాటుకు ఇబ్బంది ఏమీ ఉండదని ప్రభుత్వానికి అసెంబ్లీ వర్గాలు ఓ నివేదికను కూడా అందించాయి. హాయ్‌ల్యాండ్ అంశం కోర్డు పరిధిలో ఉన్న నేపధ్యంలో కేఎల్ విశ్వవిద్యాలయంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు సీఎం కూడా సుముఖత వ్యక్తం చేశారుకూడా. అయితే గత శాసనసభలో.. తర్వాతి సమావేశాలు కూడా హైదరాబాద్ లోనే నిర్వహిస్తామని ప్రకటించిన యనమల.. ఆమేరకు ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల అంశం సమావేశంలో ఎలాగైనా ప్రస్తావనకు వస్తుందనే జనవరి 25వ తేదీన విజయవాడలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో చక్రం తిప్పారు. కె.అచ్చెన్నాయుడుతో పాటు పలువురు మంత్రులతో సమావేశాలు హైదరాబాద్‌లోనే నిర్వహిస్తే మంచిదని, గతంలో ప్రైవేటు సంస్థల్లో ఏ రాష్ర్ట అసెంబ్లీ సమావేశాలు నిర్వహించలేదని, ఇప్పటికిపుడు ఏర్పాట్లు చేయాలన్నా కష్టమేనని, ఖర్చు కూడా ఎక్కువవుతుందని, విపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పించారు. దీంతో సీఎం చంద్రబాబు హైదరాబాద్‌లోనే సమావేశాలు నిర్వహిస్తామని మంత్రివర్గ సమావేశంలో ప్రకటించారు. తన ఆలోచనలకు పూర్తి విరుద్ధంగా నిర్ణయం తీసుకునేలా సీఎంపై ఆర్థిక మంత్రి యనమల ఒత్తిడి తేవటం పట్ల స్పీకర్ కోడెల అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. -
సింగపూర్ సంస్థలకే సర్వాధికారాలు
సాక్షి, హైదరాబాద్: రాజధాని అమరావతి భూములపై సింగపూర్ సంస్థలకు సర్వాధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం చట్ట సవరణ తెచ్చింది. ఫ్రీ హోల్డ్ ప్రాతిపదికన రాయితీల రేట్లపై అన్నీ సమకూర్చేందుకు చేసిన మార్పులకు శాసనసభ ఆమోదం తెపింది. ప్రధాన ప్రతిపక్షం లేకుండా, సమగ్ర చర్చకు ఎంతమాత్రం అవకాశమే ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ శాసనసభ సోమవారం ఎనిమిది కీలకమైన బిల్లులను ఆమోదించింది. ఇందులో రెండు అప్పటికప్పుడే ప్రవేశపెట్టి, ఆమోదముద్ర వేయడం విశేషం. వాటిలో మౌలిక వసతుల సదుపాయాల అభివృద్ధి సవరణ, విద్యుత్ సుంకం , నౌకాశ్రయాల అభివృద్ధిపై మ్యారిటైమ్ బోర్డు , విదేశీ మద్యం సవరణ , వ్యాట్ ఆధారిత పన్ను సవరణ , మెట్రో పాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ బిల్లులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల సదుపాయాల అభివృద్ధి బిల్లును కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెడుతూ... రాష్ట్రంలో ప్రైవేటు సంస్థలకు ఇచ్చే భూముల లీజును 33 ఏళ్ళ నుంచి 99 ఏళ్లకు పెంచినట్టు తెలిపారు. తక్కువ సమయం లీజు కారణంగా బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు సుముఖంగా లేవని, ఈ కారణంగా పారిశ్రామిక వేత్తలు పరిశ్రమల స్థాపనకు ముందుకు రావడం లేదని సవరణ ఉద్దేశాలను వివరించారు. మనీల్యాండరింగ్ బిల్లు...: కాల్‌మనీ-సెక్స్ రాకెట్ రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతున్న నేపథ్యంలో మనీ ల్యాండరింగ్ బిల్లుకు సభలో ఆమోదం తెలిపారు. దీన్ని ప్రవేశపెట్టిన రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప మాట్లాడుతూ... వడ్డీ వ్యాపారానికి లెసైన్సులు తప్పనిసరి చేస్తున్నామని, ప్రభుత్వం నిర్దేశించిన వడ్డీకన్నా ఎక్కువ వసూలు చేస్తే ఏడాది వరకూ జైలు శిక్ష, రూ.లక్ష వరకూ జరిమానా విధించే అధికారం కల్పించామని చెప్పారు. ప్రతీ వడ్డీ వ్యాపారి ఏటా అకౌంట్ పుస్తకాలను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుందన్నారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, కూన రవికుమార్, శ్రీరాం తాతయ్య, బుచ్చయ్య చౌదరి అభ్యంతరాలు వ్యక్తం చేసినా పట్టించుకోలేదు. ప్రైవేటు యూనివర్సిటీలు బార్లా రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు అవకాశాలు కల్పిస్తూ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రవేశపెట్టిన బిల్లుపై సభ్యులు అనేక అనుమానాలు లేవనెత్తారు. ప్రభుత్వ పరిధిలోని యూనివర్సిటీల ప్రాధాన్యత తగ్గే అవకాశం ఉందని స్వపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ వినియోగదారులపై సుంకం భారం మోపుతూ అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టిన సవరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. దీనివల్ల యూనిట్‌కు రూ. 6 పైసల చొప్పున వసూలు చేస్తారు. తీర ప్రాంతంలో ప్రైవేటు పెట్టుబడులకు ఊతం ఇస్తూ ఏపీ మ్యారిటైమ్ బోర్డుకు సంబంధించిన బిల్లును సభ ఆమోదించింది. వ్యాట్‌కు సవరణలు చేస్తూ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, మెట్రో పాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ బిల్లును మంత్రి నారాయణ ప్రవేశపెట్టారు.వీటి ఆమోదం తర్వాత సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ కోడెల శివప్రసాద్ తెలిపారు. -
రాజ్యసభపై యనమల కన్ను!
♦ ఎప్పటినుంచో పెద్దల సభకు వెళ్లాలని యోచిస్తున్న ఆర్థికమంత్రి ♦ వచ్చే ఏడాది జూన్‌లో నాలుగు ఖాళీలు.. ♦ టీడీపీకి మూడు దక్కే అవకాశం.. సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ఆర్థిక, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు పెద్దల సభపై కన్నేశారు. ప్రస్తుతం శాసనమండలి సభ్యుడిగా ఉన్న యనమల రాజ్యసభకు వెళ్లాలని ఆలోచన చేస్తున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. వచ్చేఏడాది జూన్‌లో ఏపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం పూర్తవనుంది. ఇందులో కేంద్రమంత్రులు వై.సత్యనారాయణ చౌదరి(సుజనా), నిర్మలా సీతారామన్‌తోపాటు జైరాం రమేష్, జేడీ శీలం(కాంగ్రెస్) ఉన్నారు. ఈ నాలుగింటిలో మూడింటిని టీడీపీ గెలుచుకునే అవకాశముంది. ఇందులో ఒకటి మిత్రపక్షం బీజేపీ తరఫున ప్రస్తుతం రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నిర్మలా సీతారామన్‌కు మరోసారి కే టాయించక తప్పని పరిస్థితి. మరో సీటును సుజనా చౌదరికి కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో మూడో సీటును తాను దక్కించుకోవాలని యనమల ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే తన ఆలోచనను యనమల సన్నిహితులతో ప్రస్తావించినట్లు సమాచారం. రాష్ట్రమంత్రివర్గంలో యనమల కీలకంగా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో సీఎం కార్యాలయ అధికారులు ఆయన శాఖలో జోక్యం చేసుకుంటున్నారు. ఇటీవల తన శాఖ పరిధిలో ఆయన చేసిన బదిలీలను సీఎం కార్యాలయ ఉన్నతాధికారి ఒకరు ఆపేయించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాజ్యసభకు వెళ్లటం మేలని ఆయన భావిస్తున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. -
ఆగస్టు 31 లేదా సెప్టెంబర్ 3 నుంచి అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 31వ తేదీ నుంచి లేదా సెప్టెంబర్ 3వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సెప్టెంబర్ 20వ తేదీలోపు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సి ఉందని ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. సచివాలయంలో బుధవారం తనను కలిసిన విలేకరులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సెప్టెంబర్ రెండో వారంలో విదేశీ పర్యటనకు వెళ్తున్నందున సెప్టెంబర్ తొలి వారంలోనే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఉండవచ్చునని యనమల పేర్కొన్నారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో రైతుల రుణ మాఫీ, రైతుల ఆత్మహత్యలతో పాటు ఇటీవల పుష్కరాల ప్రారంభం రోజున తొక్కిసలాటలో 29 మంది మృతి చెందిన ఘటన చర్చకు వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. డీజిల్ లీటర్‌పై రూ.2 తగ్గింపు: డీజిల్ ధ రను లీటర్‌పై 2 రూపాయలు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు యనమల తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం డీజిల్ లీటర్‌పై నాలుగు రూపాయల వ్యాట్‌ను పెంచిన విషయం తెలిసిందే. -
బాబుకు 23 ప్రశ్నలు
మీడియాకు విడుదల చేసిన వైఎస్సార్సీపీ సాక్షి, హైదరాబాద్: టీడీపీ ప్రభుత్వాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి అస్థిరపరుస్తున్నారంటూ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ధ్వజమెత్తింది. తమ పార్టీపై ప్రశ్నలను సంధిం చడానికి ప్రతిగా పలు ప్రశ్నలను మీడియాకు విడుదల చేసింది. చంద్రబాబుకు, టీడీపీకి వైఎస్సార్ కాంగ్రెస్ సూటి ప్రశ్నలు.. ⇒ ఓటు, కోట్లు కేసులో మీరు కేసీఆర్ కాళ్లు పట్టుకునేందుకు సిద్ధం అయ్యారా?లేదా? ⇒ ఢిల్లీలో బేరం, రాయబారం కుదుర్చుకునేందుకు సుజనా చౌదరిని ఉపయోగించి కేటీఆర్ కాళ్లా వేళ్లా పడ్డారన్నది నిజం అవునా? కాదా? ⇒ ఢిల్లీలో మీ కేంద్ర మంత్రుల్ని, ఎంపీలను ఉపయోగించి ఎన్డీఏ పెద్దలందరినీ ప్రాధేయపడి గవర్నర్ ద్వారా కాంప్రమైజ్ ఫార్ములా పంపారా? లేదా? ⇒ ఆంబోతు, కీలుబొమ్మ వంటి మాటలు మాట్లాడవద్దని తాఖీదులు ఇచ్చారంటే ఇది మీ రాజీలో భాగం కాదా? గవర్నర్‌ను అప్పుడు ఎందుకు అవమానించారు? ఇప్పుడు ఎందుకు మంచి చేసుకునే ప్రయత్నం మొదలుపెట్టారు? ⇒ గాంధీ అనే తాబేదారును ఫోరెన్సిక్ సాక్ష్యాలు తారుమారు చేసేందుకే ఇప్పటికిప్పుడు ఏపీ అడ్వైజర్‌గా వేసుకున్నది నిజం కాదా? ⇒ మీరు స్టీఫెన్‌సన్‌తో మాట్లాడింది నిజం అవునా? కాదా? ఆ వాయిస్ రికార్డింగ్‌లో ఉన్నది మీ గొంతు అవునా? కాదా? ⇒ మీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రూ. 50 లక్షలతో దొరికాడా?లేదా? ⇒ సెక్షన్-8 ప్రకారం గవర్నర్‌కు శాంతిభద్రతల విషయంలో, పోలీసు అంశాల్లో తుది అధికారం ఉంటుందన్న విషయం మీరు అడ్డంగా దొరికిపోయేవరకు గుర్తుకు రాలేదన్నది నిజం కాదా? ⇒ ఫోన్లో రికార్డు చేయటం తప్పు, ఎమ్మెల్యేకి రూ. 5 కోట్లు ఇచ్చి కొనటం ఒప్పు అన్నది మీ అభిప్రాయమా? ⇒ 2008 అక్టోబర్ 18నే తెలంగాణను విడగొట్టండి అని మీ పార్టీలో ఉన్న ఆంధ్రా నాయకులు, రాయలసీమ నాయకులు కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేయటం, ఆ తీర్మాణాన్ని ప్రణబ్ ముఖర్జీ కమిటీకి పంపటం నిజం అవునా? కాదా? ⇒ టీఆర్ఎస్ కంటే ముందే ఏపీని విడగొట్టండని తీర్మానం చేసి పంపింది మీ పార్టీ అవునా? కాదా? ⇒ 2009లో మీరు, కేసీఆర్ ఒకరి కండువాలు ఒకరిమీద కప్పుకుని, ఒకరినొకరు కౌగిలించుకుని ఎన్నికల్లో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకుని పోటీ చేసింది నిజం అవునా? కాదా? అప్పుడు మీరు టీఆర్ఎస్కు ఎన్ని మూటలు సమర్పించుకున్నారో చెప్పే ధైర్యం మీకుందా? ⇒ 2008 మొదలు ప్రతి మహానాడులోనూ తెలంగాణ రాష్ట్రాన్ని విడగొట్టండి అని మీరు తీర్మానాలు చేశారా? లేదా? ⇒ వైఎస్ మరణం తర్వాత కేసీఆర్ నిరాహార దీక్ష మొదలు పెట్టినప్పుడు ముఖ్యమంత్రిగా రోశయ్య పెట్టిన ఆల్ పార్టీ మీటిం గ్లో ఏపీని విడగొట్టండని టీఆర్ఎస్కు మద్దతు పలికింది మీరు అవునా? కాదా? ⇒ రాష్ట్ర విభజనకు పార్లమెంటులో మొదటి ఓటు వేసింది మీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు నామా నాగేశ్వరరావు అవునా? కాదా? ⇒ మీరు ఏపీ సీఎం అయిన తర్వాత కూడా మహబూబ్‌నగర్, కరీంనగర్‌లలో మావల్లే తెలంగాణ వచ్చిందని చెప్పటం నిజం కాదా? ⇒ పోలవరం ప్రాజెక్టును కట్టొద్దు, కేవలం లిఫ్ట్‌లతో సరిపెట్టండి అన్న తెలంగాణవాదుల డిమాండ్‌ను పట్టిసీమ పేరిట అమలు చేయటంలో ఆంధ్రప్రదేశ్ వ్యతిరేక కుట్ర దాగి ఉండటం నిజం కాదా? ⇒ రేవంత్‌రెడ్డి మోసిన మూటలు పట్టిసీమ నుంచి మీరు కొట్టిన వందల కోట్ల సొమ్ము నుంచి బయటకు తీసినవి అవునా? కాదా? ⇒ పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎలాంటి అనుమతులూ లేకుండా కేసీఆర్ ప్రారంభించినా మీరు కనీసం ఉత్తరం ముక్క కూడా రాయకపోవడం నిజం కాదా? ⇒ దొంగల్లా దొరికి కూడా దబాయిస్తున్నారంటే రాజీ కుదుర్చుకున్నారన్నది స్పష్టం కాదా? ⇒ నీ దొంగతనానికి, ఏపీ ప్రజలకు సంబంధం ఏమిటో చెప్పగలవా? ⇒ స్టీఫెన్సన్కు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని జగన్ ఉత్తరం రాశారని అంటున్నావు. ఈ ఆరోపణ చేయటానికి బుద్ధి, జ్ఞానం ఉండాలి. ఆ లేఖను బయటపెట్టగలవా? ⇒ మేము ఎమ్మెల్యేని ధారాదత్తం చేయలేదు. నువ్వే తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్‌కు ధారాదత్తం చేసింది నిజం అవునా? కాదా? -
ఎమ్మెల్యేలు చెబితే వినాల్సిందే
సమన్వయంతో పనిచేయండిఅధికారులకు యనమల హితవు సాక్షి, విశాఖపట్నం : అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఏదైనా చెబితే వెంటనే స్పందించాలని రాష్ర్ట ఆర్థిక మంత్రి, జిల్లా ఇన్చార్జిమంత్రి యనమల రామకృష్ణుడు అధికారులను ఆదేశించారు. అధికారులు,ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే జిల్లా అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర జిల్లా అధికారులతో యనమల మంగళవారం సాయంత్రం స్థానిక సర్క్యూట్ హౌస్‌లో భేటీ అయ్యారు. ఇటీవల రూరల్ ఎస్పీ విషయంలోచోటుచేసుకున్న పరిణామాలను ఎమ్మెల్యేలు యనమల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులకు మధ్య కొరవడిన సమన్వయ లోపాలు, నియోజకవర్గాల వారీగా ఉన్న సమస్య లను అడిగి తెలుసుకున్నారు. బదిలీలు, జిల్లాలో మంత్రుల మధ్య నెలకొన్న విబేధాలు కూడా ఈ సందర్భంగా వీరి మధ్య చర్చకు వచ్చాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పినట్టుగా అధికారులు పనిచేయాలని, వారికి ఇబ్బంది కల్గించే విధంగా వ్యవహరించవద్దని యనమల అధికారులకు సూచించారు. ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలే తప్ప కొత్త సమస్యలు సృష్టించవద్దని హితవు పలికారు. పనివిధానంలో మార్పురావాలి.. ఏడాది గడిచింది.. ఇంకా మైండ్‌సెట్ మార్చు కోకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఆర్థిక ఇబ్బందులున్నాయి.. వాటిని అధిగ మించేందుకు అందరూ సమష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలనుగుణంగా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎంపీ అవంతి శ్రీనివాసరావు, కలెక్టర్ యువరాజ్, జేసీ నివాస్, ఎస్పీ కోయ ప్రవీణ్, పోలీస్ కమిషనర్ అమిత్‌గార్గ్ పాల్గొన్నారు. -
7 నుంచి అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 7 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ నరసింహన్ మంగళవారం నోటిఫికేషన్ జారీచేశారు. శాసనమండలి సమావేశాలు కూడా అదే రోజు ప్రారంభమవుతాయి. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ఆరోజు ఉదయం 8.55 గంటలకు ప్రసంగిస్తారు. రాష్ట్ర బడ్జెట్‌ను మార్చి 12వ తేదీన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెడతారు. వ్యవసాయ బడ్జెట్‌ను 13వ తేదీన వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమర్పించనున్నారు. ఈ సమావేశాలు మార్చి 27వ తేదీవరకు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. -
కేంద్ర ప్యాకేజీపై అయోమయంలో రాష్ట్రం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అభివృద్ధి ప్యాకేజీపై రాష్ట్ర ప్రభుత్వం అయోమయంలో పడింది. కేంద్ర ప్రకటనపై సీఎం చంద్రబాబు గురువారం కొందరు మంత్రులు, అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ప్రజల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లిందని ఈ సందర్భంగా సీఎం వ్యాఖ్యానించినట్లు తెలిసింది.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న తరుణంలో కేంద్రం నుంచి భారీ ప్యాకేజీ వస్తుందని ఆశించినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను ప్రధానమంత్రిని కలిసి వివరించి అదనపు సహాయాన్ని కోరనున్నట్టు సీఎం చెప్పారు. అనంతరం ఆర్థిక మంత్రి యనమల రామకష్ణుడు విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని నడిపించేందుకు రూ.కోట్లలో అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సచివాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఖజానా మొత్తం ఖాళీ అయ్యిందన్నారు. ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ నెల 8, 9 తేదీల్లో ముఖ్యమంత్రితో పాటు తాను ఢిల్లీ వెళ్తున్నట్లు తెలిపారు.