కొత్త మద్యం పాలసీ రానుంది
⇒రాష్ట్ర బడ్జెట్‌లో స్పష్టం చేసిన మంత్రి
⇒మండల యూనిట్‌గా మద్యం అంగళ్లు
⇒పరిగణనలోకి సుప్రీం తీర్పు
⇒వచ్చే వారంలో నోటిఫికేషన్?
కొత్త మద్యం పాలసీపై ప్రభుత్వం ఓ స్పష్టత ఇచ్చింది. బుధవారం అమరావతిలో జరిగిన రాష్ట్ర బడ్జెట్ ప్రసంగంలో మంత్రి యనమల రామకృష్ణుడు దీనిపై ప్రకటన చేశారు. ఈ సమావేశాల్లోనే కొత్త మద్యం పాలసీ ప్రకటించనున్నట్లు తెలిపారు. దీంతో కొన్నాళ్లుగా సందిగ్ధంలో ఉన్న మద్యం విధి విధానాలపై సమాధానం లభించినట్లయ్యింది.
చిత్తూరు (అర్బన్):జిల్లాలో తిరుపతి ఎక్సైజ్ పరిధిలో 212 మద్యం దుకాణాలు, చిత్తూరు ఎక్సైజ్ పరిధిలో 207 మద్యం దుకాణాలకు ఈ ఏడాది జూన్ వరకు ప్రభుత్వం లైసెన్సులు జారీ చేసింది. అయితే జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఉండడానికి వీల్లేదంటూ గత ఏడాది సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి నెలాఖరులోపు 500 మీటర్ల పరిధిలో ఉన్న మద్యం దుకాణాలను మూసేయాలని తీర్పునిచ్చింది. తమకు జూన్ వరకు గడువు ఇవ్వాలంటూ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా.. రెండు రోజుల క్రితం సీఎం ఆదేశాలతో పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వచ్చే వారంలో దీనిపై అధికారిక ప్రకటన విడుదల కానుంది.
ఇదీ కొత్త పాలసీ
ప్రభుత్వం కొత్తగా విడుదల చేసే పాలసీలో 500 మీటర్ల పరిధిలో ఉన్న దుకాణాలను ఇతర ప్రాంతాల్లో జూన్ వరకు నిర్వహించుకోవడానికి అవకాశం ఇవ్వనుంది. దీనికి ఇప్పటి వరకు ఉన్న లైసెన్సు నిబంధనలే వర్తింప చేస్తారు. మిగిలిన దుకాణాలకు ఏప్రిల్ 1 నుంచి ప్రవేశపెట్టనున్న కొత్త పాలసీ అమలు చేస్తారు. ఇప్పటి వరకు మద్యం విక్రయదారులు కనిష్టంగా రూ.34 లక్షల నుంచి గరిష్టంగా రూ.45 లక్షలు చెల్లించి రెండేళ్లకు లైసెన్సులు తీసుకుంటున్నారు. కొత్త పాలసీలో దీన్ని రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్యలో నిర్ణయించే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
పైగా మద్యం విక్రయాల్లో వ్యాపారులకు సగటున లభిస్తున్న 18 శాతం మార్జిన్‌ను కొత్త పాలసీలో 12 శాతానికి తగ్గించే అవకాశాలున్నాయి. ఇక మండలాన్ని, పట్టణాలను, కార్పొరేషన్లను ఓ యూనిట్‌గా పరిగణించి ఒక్కో మండలంలో నిర్ణీత దుకాణాలు నిబంధనలకు లోబడి పక్క పక్కనే పెట్టుకునే వెసులుబాటు కల్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అంటే చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో 18 దుకాణాలుంటే వీటన్నింటిని కలిపి ఒకే వ్యక్తికి లాటరీ పద్ధతిలో కేటాయిస్తారు. మద్యం దుకాణాలతో పాటు బార్లకు సైతం ఏడేళ్ల తరువాత వచ్చే వారంలోనే కొత్త పాలసీ ప్రకటించనున్నారు.