
మార్చి తొలి వారంలో బడ్జెట్
ఆర్థిక మంత్రి యనమల వెల్లడి
ఈ నెల 30, 31 తేదీల్లో బడ్జెట్‌పై మంత్రులు, అధికారులతో భేటీ
సాక్షి, అమరావతి: వచ్చే ఆర్థిక సంవత్సరం (2017–18) వార్షిక బడ్జెట్‌ను మార్చి తొలి వారంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఆదాయ రాబడులను వాస్తవాలకు దగ్గరగా అంచనా వేస్తామని, అందుకు అనుగుణంగానే బడ్జెట్ రూపొందించనున్నామని చెప్పారు. ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారులు అంతర్గతంగా బడ్జెట్ రూపకల్పనను ప్రారంభించారని, చాలా వరకు కసరత్తు పూర్తవుతోందన్నారు. బడ్జెట్ రూపకల్పన, ఆదాయ వ్యయాల అంచనాలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పరిస్థితిపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో, సామాజిక ఆర్థిక సర్వే రూపకల్పనపై ప్రణాళిక శాఖ అధికారులతో మంత్రి సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 30, 31 తేదీల్లో బడ్జెట్ ప్రతిపాదనలపై శాఖల మంత్రులు ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గత మూడు సంవత్సరాల్లో బడ్జెట్ కేటాయింపులు, వ్యయం సామర్థ్యం ఆధారంగానే వచ్చే బడ్జెట్‌లో ఆయా శాఖలకు కేటాయింపులుంటాయని ఆయన స్పష్టం చేశారు.