
రాజ్యసభపై యనమల కన్ను!
♦ ఎప్పటినుంచో పెద్దల సభకు వెళ్లాలని యోచిస్తున్న ఆర్థికమంత్రి
♦ వచ్చే ఏడాది జూన్‌లో నాలుగు ఖాళీలు..
♦ టీడీపీకి మూడు దక్కే అవకాశం..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ఆర్థిక, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు పెద్దల సభపై కన్నేశారు. ప్రస్తుతం శాసనమండలి సభ్యుడిగా ఉన్న యనమల రాజ్యసభకు వెళ్లాలని ఆలోచన చేస్తున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. వచ్చేఏడాది జూన్‌లో ఏపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం పూర్తవనుంది. ఇందులో కేంద్రమంత్రులు వై.సత్యనారాయణ చౌదరి(సుజనా), నిర్మలా సీతారామన్‌తోపాటు జైరాం రమేష్, జేడీ శీలం(కాంగ్రెస్) ఉన్నారు. ఈ నాలుగింటిలో మూడింటిని టీడీపీ గెలుచుకునే అవకాశముంది. ఇందులో ఒకటి మిత్రపక్షం బీజేపీ తరఫున ప్రస్తుతం రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నిర్మలా సీతారామన్‌కు మరోసారి కే టాయించక తప్పని పరిస్థితి.
మరో సీటును సుజనా చౌదరికి కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో మూడో సీటును తాను దక్కించుకోవాలని యనమల ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే తన ఆలోచనను యనమల సన్నిహితులతో ప్రస్తావించినట్లు సమాచారం. రాష్ట్రమంత్రివర్గంలో యనమల కీలకంగా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో సీఎం కార్యాలయ అధికారులు ఆయన శాఖలో జోక్యం చేసుకుంటున్నారు. ఇటీవల తన శాఖ పరిధిలో ఆయన చేసిన బదిలీలను సీఎం కార్యాలయ ఉన్నతాధికారి ఒకరు ఆపేయించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాజ్యసభకు వెళ్లటం మేలని ఆయన భావిస్తున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి.