
టీటీడీలో ప్రతిపైసాకు లెక్క చూపాల్సిందే..
మంత్రి యనమల రామకృష్ణుడు
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో ఆదాయ వ్యయాలన్నింటికీ ఆడిట్ జరగాల్సిందేనని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. భక్తులు సమర్పించే కానుకల్లో వాడే ప్రతిపైసాకు లెక్కచూపి, భక్తులకు జవాబు చెప్పాల్సిందేనని ఆయన స్పష్టంచేశారు.
టీటీడీ నిర్వహించిన కొన్ని స్కీములు, ఎస్‌వీబీసీతోపాటు ఖర్చులపై ఇంకా ఆడిట్ జరగాల్సిన అవసరం ఉందన్నారు. టీటీడీ వ్యవహారాలపై ఏప్రిల్‌లో సమావేశం నిర్వహించి సమీక్షిస్తామని తెలిపారు. శుక్రవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏటా రూ.4 వేల కోట్ల ఆదాయం వచ్చే టీటీడీలో సేవా టికెట్లు, లడ్డూ ధరలు పెంచాలనుకోవడం సబబు కాదని ఆయన అన్నారు. భక్తులపై భారం వేసి ఆదాయాన్ని పెంచుకోవాలన్న ధార్మిక సంస్థ ఆలోచన మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.