
ఎమ్మెల్యేలు చెబితే వినాల్సిందే
సమన్వయంతో పనిచేయండిఅధికారులకు యనమల హితవు
సాక్షి, విశాఖపట్నం : అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఏదైనా చెబితే వెంటనే స్పందించాలని రాష్ర్ట ఆర్థిక మంత్రి, జిల్లా ఇన్‌చార్జిమంత్రి యనమల రామకృష్ణుడు అధికారులను ఆదేశించారు. అధికారులు,ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే జిల్లా అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర జిల్లా అధికారులతో యనమల మంగళవారం సాయంత్రం స్థానిక సర్క్యూట్ హౌస్‌లో భేటీ అయ్యారు.
ఇటీవల రూరల్ ఎస్పీ విషయంలోచోటుచేసుకున్న పరిణామాలను ఎమ్మెల్యేలు యనమల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులకు మధ్య కొరవడిన సమన్వయ లోపాలు, నియోజకవర్గాల వారీగా ఉన్న సమస్య లను అడిగి తెలుసుకున్నారు. బదిలీలు, జిల్లాలో మంత్రుల మధ్య నెలకొన్న విబేధాలు కూడా ఈ సందర్భంగా వీరి మధ్య చర్చకు వచ్చాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పినట్టుగా అధికారులు పనిచేయాలని, వారికి ఇబ్బంది కల్గించే విధంగా వ్యవహరించవద్దని యనమల అధికారులకు సూచించారు.
ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలే తప్ప కొత్త సమస్యలు సృష్టించవద్దని హితవు పలికారు. పనివిధానంలో మార్పురావాలి.. ఏడాది గడిచింది.. ఇంకా మైండ్‌సెట్ మార్చు కోకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఆర్థిక ఇబ్బందులున్నాయి.. వాటిని అధిగ మించేందుకు అందరూ సమష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలనుగుణంగా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎంపీ అవంతి శ్రీనివాసరావు, కలెక్టర్ యువరాజ్, జేసీ నివాస్, ఎస్పీ కోయ ప్రవీణ్, పోలీస్ కమిషనర్ అమిత్‌గార్గ్ పాల్గొన్నారు.