హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అభివృద్ధి ప్యాకేజీపై రాష్ట్ర ప్రభుత్వం అయోమయంలో పడింది. కేంద్ర ప్రకటనపై సీఎం చంద్రబాబు గురువారం కొందరు మంత్రులు, అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ప్రజల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లిందని ఈ సందర్భంగా సీఎం వ్యాఖ్యానించినట్లు తెలిసింది.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న తరుణంలో కేంద్రం నుంచి భారీ ప్యాకేజీ వస్తుందని ఆశించినట్టు పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను ప్రధానమంత్రిని కలిసి వివరించి అదనపు సహాయాన్ని కోరనున్నట్టు సీఎం చెప్పారు. అనంతరం ఆర్థిక మంత్రి యనమల రామకష్ణుడు విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని నడిపించేందుకు రూ.కోట్లలో అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సచివాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఖజానా మొత్తం ఖాళీ అయ్యిందన్నారు. ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ నెల 8, 9 తేదీల్లో ముఖ్యమంత్రితో పాటు తాను ఢిల్లీ వెళ్తున్నట్లు తెలిపారు.