విశ్వనగరి.. నిధుల ఝరి
►విశ్వనగరం వైపు వడివడిగా అడుగులు
►బడ్జెట్‌లో నగరానికి భారీ నిధులు
►మంచినీళ్లు, రహదారులు, ప్రజాభద్రతకు పెద్దపీట
►మూసీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు నిర్ణయం
►కూతపెట్టనున్న పటాన్‌చెరు–తెల్లాపూర్ ఎంఎంటీఎస్ రైలు
►జూన్ 2న ప్రారంభమయ్యే మెట్రో రైలుకు మినీబస్సులు సపోర్ట్
►ఉస్మానియాకు రూ.200 కోట్లతో ‘శతాబ్ది’ వెలుగులు
సిటీబ్యూరో: అందరికీ మంచినీళ్లు, దుమ్ము రేగని రహదారులు, ఆధునిక భద్రతతో కూడిన మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా ‘విశ్వనగరి’ బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చేశారు. సోమవారం శాసనసభకు సమర్పించిన బడ్జెట్‌లో ఔటర్ రింగు రోడ్డు లోపలున్న ప్రాంతాలన్నింటికీ మంచినీళ్లు, కాలుష్య కాసారమై చిక్కి శల్యమైన మూసీనది శుద్ధి–ఆధునీకరణ, దుమ్మురేగని వైట్‌టాప్ రహదారులకు తోడు నగరంలో ఎక్కడ నేరం జరిగినా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆనవాళ్లు పట్టించే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణాలకు నిధులు కుమ్మరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జీహెచ్‌ఎంసీకి రూ.1000 కోట్లు కేటాయిస్తూ అందులో మూసీ నది ఆధకోసం రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేయాలని నిర్ణయించటం గమనించదగ్గ విషయం.
తద్వారా మూసీ మురికిని వదిలించే కార్యాచరణను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇక జలమండలి ఐదువేల కోట్లకు పైగా నిధులు కావాలని ప్రతిపాదనలు పంపినా, ఈ బడ్జెట్‌లో కోర్‌సిటీని పక్కన బెట్టి ఔటర్ రింగురోడ్డు లోపలున్న 190 నివాసిత ప్రాంతాలకు మంచినీళ్లందించే పనులను ప్రారంభించనున్నారు. నగరంలో మరింత భద్రతే లక్ష్యంగా మూడు పోలీస్ కమిషనరేట్లకు ఏకంగా రూ.520 కోట్లను కేటాయించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణంతో పాటు లక్ష సీసీ కెమెరాల ఏర్పాటు, ట్రాఫిక్ నియంత్రణ కోసం ఈ యేడాది నిధులను ఖర్చు చేయనున్నారు.
ఈ ఏడాదే..మెట్రో రైలు, ఎంఎంటీఎస్–2 ప్రారంభం!
ఈ ఏడాది జూన్ 2న మెట్రో రైలు ప్రారంభించేందుకు ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం, మెట్రో స్టేషన్లకు అనుసంధానంగా మినీ బస్సులను ఏర్పాటు చేసే దిశగా ఆర్టీసీకి భారీగా నిధులను కేటాయించింది. వీటితో పాటు పటాన్‌చెరు–తెల్లాపూర్‌ల మధ్య ఎంఎంటీఎస్ రెండవ దశ తొలి రైలు కూతపెట్టే దిశగానే బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. ఇక ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు రూ.200 కోట్ల వ్యయంతో అత్యంత ఆర్భాటంగా నిర్వహించేందుకు నిర్ణయించింది. ఇదిలా ఉంటే నగరంలో ప్రజారోగ్యాన్ని మరింత పటిష్టం చేసే దిశగా ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రులకు సరిపోను కేటాయింపులు చేయకపోవటం, రవీంధ్రభారతి ఆధునీకరణకు తోడు మిగిలిన ప్రాంతాల్లో ఆధునిక ఆడిటోరియాల ప్రస్తావన లేకపోవటం, పర్యాటక రంగానికి ప్రత్యేక నిధులేవీ కేటాయించకపోటంతో భాషాసాంస్కృతిక, పర్యాటక శాఖల్లో ఒకింత అసంతృప్తి వ్యక్తమైంది.