ఆసుపత్రులకు నిధుల విడుదల
- పరిపాలనా అనుమతి ఇస్తూ సర్కారు ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆసుపత్రులు, వైద్య క ళాశాలల అభివృద్ధి, ఆధునీకరణ కోసం ప్రభుత్వం రూ. 169.54 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు పరిపాలనా అనుమతులిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. గత బడ్జెట్‌లో ఆస్పత్రులు, కళాశాలల కోసం నిధులు కేటాయించిన విషయం తెలిసిందే. ఆస్పత్రులు, కళాశాలల్లో వివిధ అవసరాల కోసం నిధుల కేటాయింపు ఇలా ఉంది...
ఉస్మానియా జనరల్ ఆసుపత్రి ఐపీ బ్లాక్, ఎన్‌పీఆర్ బ్లాక్‌ల పటిష్టానికి రూ. 23.92 కోట్లు.
గాంధీ ఆసుపత్రిలో సీనియర్ల నివాసాలు, పీజీ విద్యార్థుల వసతి తదితరాలకు రూ. 30 కోట్లు, ప్రస్తుతం ఉన్న ఆసుపత్రి మరమ్మతులు, పునరుద్ధరణ కోసం రూ.5 కోట్లు.
ఈఎన్‌టీ ఆసుపత్రి మూడో అంతస్తు నిర్మాణం సహా ఇతరాలకు రూ. 8.35 కోట్లు.
నీలోఫర్ ఆసుపత్రిలో ఆధునిక వంటశాల, లాండ్రీ, పీజీ హాస్టళ్లు, సులభ్ కాంప్లెక్స్, రోడ్ల కోసం రూ. 7.15 కోట్లు, వార్డులు, మరుగుదొడ్ల పునరుద్ధరణ తదితరాలకు రూ. 2.85 కోట్లు.
హైదరాబాద్‌లోని ఛాతి ఆసుపత్రికి రూ. 3.81 కోట్లు, సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి రూ. 1.06 కోట్లు, ఫీవర్ ఆసుపత్రిలో మెడికల్ స్టోర్ నిర్మాణానికి, లైబ్రరీ తదితరాల కోసం రూ. 4.60 కోట్లు.
పేట్లబురుజులోని జీఎంహెచ్‌కు రూ. 16.34 కోట్లు, సుల్తాన్‌బజారులోని జీఎంహెచ్‌కు రూ. 17.60 కోట్లు.
ఎర్రగడ్డలోని మెంటల్ కేర్‌కు రూ. 16.75 కోట్లు, నర్సింగ్ కాలేజీ నిర్మాణానికి రూ. 8.33 కోట్లు.
ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీనియర్ల వసతి గృహాలకు రూ. 5 కోట్లు.
నిమ్స్ స్థాయిలో ఆధునీకరించేందుకు ఆదిలాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి రూ. 4 కోట్లు, ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి రూ. 6 కోట్లు
వరంగల్‌లో కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్మాణానికి రూ. 5 కోట్లు.
అలాగే గాంధీ ఆసుపత్రి సహా ఆదిలాబాద్, వరంగల్‌లలో నర్సింగ్ కాలేజీల నిర్మాణాలకూ ప్రభుత్వం నిధులు కేటాయించింది.