అన్ని కేటాయింపులూ అరకొరే! | All allocations arakore! | Sakshi
Sakshi News home page

అన్ని కేటాయింపులూ అరకొరే!

Published Thu, Feb 5 2015 1:12 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

అన్ని కేటాయింపులూ అరకొరే! - Sakshi

అన్ని కేటాయింపులూ అరకొరే!

  • బడ్జెట్ అంచనాలు బారెడు.. కేటాయింపులు మూరెడు
  • ఆదాయం అంచనా 80 వేల కోట్లు, వచ్చింది రూ. 30,187 కోట్లు
  • కేంద్రం నుంచీ సరిగా అందని వాటా
  • నిధుల కోసం సర్కారు సతమతం
  • సాక్షి, హైదరాబాద్: పేదల సంక్షేమంతో పాటు కీలక రంగాలకు భారీగా నిధులు ఖర్చు చేస్తామన్న రాష్ర్ట ప్రభుత్వం దాన్ని ఆచరణలో మాత్రం పెట్టలేకపోయింది. బడ్జెట్‌లో ప్రస్తావించిన అంచనాలతో పోల్చితే అరకొర కేటాయింపులకే పరిమితమైంది. తగినంత ఆదాయం లేకపోవడం, కేంద్ర వాటా నిధులు తగినన్ని రాకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైంది. ప్రభుత్వ ప్రాధమ్యాలుగా ఎంచుకున్న రంగాలకూ మొండిచేయే మిగిలింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో రెండు నెలలే మిగిలి ఉండటంతో వాటికి మరిన్ని నిధులు దక్కే పరిస్థితే కనిపించడం లేదు.

    గతంలో ఎన్నడూ లేని విధంగా మైనారిటీలకు రూ. 1,033 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్న సర్కారు గత నెలాఖరు వరకు కేవలం రూ. 233 కోట్లు ఖర్చు చేసింది. మిగిలిన రెండు నెలల్లో రూ. 800 కోట్ల విడుదల సాధ్యమయ్యేలా లేదని ఆర్థిక శాఖ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ విడుదల చేసినా ఇంత తక్కువ వ్యవధిలో ఖర్చు చేయడం కూడా అయ్యే పని కాదు. ప్రణాళికేతర రెవెన్యూ వ్యయానికి సంబంధించిన కేటాయింపులు.. ఖర్చులను చూస్తే ఈ డొల్లతనం బయటపడుతోంది.

    సాగు నీటిపారుదల రంగానికి అత్యంత ప్రాధాన్యమంటూ రూ. 2,981 కోట్లు కేటాయించినా ఇప్పటికి రూ. 235 కోట్లు మాత్రమే వ్యయం చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సంక్షేమ పథకాలకు కేటాయించిన రూ. 6973 కోట్లలో డిసెంబర్ వరకు కేవలం రూ. 1,208 కోట్లే ఖర్చయింది. ఇక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి డిసెంబర్ వరకు చేసిన రెవెన్యూ వ్యయం రూ. 28,223 కోట్లుగా నమోదైంది. ఇప్పటివరకు రాష్ట్రానికున్న రూ. 60 వేల కోట్ల అప్పుపై రూ. 935 కోట్ల వడ్డీ చెల్లించారు.
     
    ఆలస్యంగా కళ్లు తెరిచిన సర్కారు!


    గత నవంబర్‌లో ప్రవేశపెట్టిన పది నెలల బడ్జెట్‌లో రూ. 80 వేల కోట్ల రెవెన్యూ ఆదాయాన్ని సర్కారు అంచనా వేసింది. అయితే ఇప్పటివరకు కేవలం రూ. 30,187 కోట్ల ఆదాయం వచ్చింది. మిగతా రూ. 50 వేల కోట్ల ఆర్థిక లోటును ఎలా పూడ్చుకోవాలనే విషయంపై ప్రభుత్వం ఆలస్యంగా తేరుకుంది. భూములు, ప్రభుత్వ ఆస్తుల అమ్మకంతో పాటు ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకునేందుకు నెల రోజులుగా ముమ్మర యత్నాలు చేస్తోంది. ఇవేవీ కొలిక్కి రాలేదు.

    ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకున్న మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్, రోడ్ల నిర్మాణం, విశ్వనగరంగా హైదరాబాద్ తదితర అభివృద్ధి పథకాలకు నిధుల సమీకరణ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు నాబార్డ్ నుంచి రూ. 1,100 కోట్ల రుణం తప్ప మరేమీ రాలేదు. మరోవైపు కేంద్రం నుంచి ఆశించిన నిధులు రాలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి వివిధ పన్నులు, గ్రాంట్ల ద్వారా ఇప్పటి వరకు రాష్ట్రానికి రూ. 10 వేల కోట్లు మంజూరయ్యాయి. మరో రూ. 15 వేల కోట్లు రావాల్సి ఉంది.

    కేంద్రం ఆర్థిక పరిస్థితి కూడా అంతంతే అన్నట్లుగా ఉండటంతో.. మిగిలిన రెండు నెలల్లో అక్కడి నుంచి పెద్దగా నిధులు వచ్చే సంకేతాలు కనబడటం లేదు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్వయంగా ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసి 13వ ఆర్థిక సంఘం బకాయిలు, బీఆర్‌జీఎఫ్ నిధులు, ప్రత్యేక హోదా నిధులు, ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితి పెంపు,  కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను విడుదల చేయాలని కోరనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement