లబ్బీపేట, న్యూస్‌లైన్ : సిద్ధార్థ వైద్య కళాశాల అధికారులకు ఎంసీఐ ఫీవర్ పట్టుకుంది. కళాశాలలో సౌకర్యాలు లేవంటూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) గత ఏడాది 50 ఎంబీబీఎస్ సీట్లను రద్దు చేసింది. తిరిగి వాటిని పొందేందుకు అధికారులు దరఖాస్తు చేశారు. ఈ నేపథ్యంలో ఎంసీఐ బృందం ఏ క్షణంలోనైనా తనిఖీలకు వచ్చే అవకాశం ఉంది. ఎంసీఐ నిబంధనలకు అనుగుణంగా వార్డులు, పరికరాలు అందుబాటులో ఉంచాలని వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది ఎంసీఐ బృందం వచ్చిన తర్వాత ఫిజియాలజీ ల్యాబ్‌ను తెరవడంతో, వారు తన రిపోర్టులో దానిని వినియోగించడం లేదని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ సారి అటువంటి తప్పిదాలు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులు వైద్యులకు సూచిస్తున్నారు. అయితే శాశ్వత నిర్మాణాల విషయంలో గత ఏడాదికి ఇప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోవడంతో ఏమి జరుగుతుందోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
2012లో 50 సీట్లు మంజూరు
వంద ఎంబీబీఎస్ సీట్లు ఉన్న సిద్ధార్థ వైద్య కళాశాలను 2012లో ఎంసీఐ బృందం తనిఖీ చేసి అదనంగా మరో 50 సీట్లు మంజూరు చేసింది. ఆ సమయంలో లైబ్రరీ, రూరల్ కమ్యూనిటీ హెల్త్ (ఆర్‌సీహెచ్) బ్లాక్ నిర్మాణం, బోధనా సిబ్బంది పెంపు వంటి సమస్యలను ఏడాదిలో పరిష్కరిస్తామంటూ ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో అదే ఏడాది ఆగస్టులో జరిగిన అడ్మిషన్లలో 150 ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేశారు. అనంతరం 2013 మార్చిలో ఎంసీఐ బృందం తనిఖీలకు రాగా ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చక పోగా, మరిన్ని సమస్యలను వారు గుర్తించారు.
దీంతో పెంచిన 50 సీట్లకు సంబంధించి సౌకర్యాలు లేని కారణంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. చేసేది లేక ఈ ఏడాది వంద సీట్లకే అడ్మిషన్లు నిర్వహించారు. ఇప్పటికీ ఈ సమస్యలన్నీ ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో సీట్ల పెంపుకోసం దరఖాస్తు చేసి ప్రయోజనం ఏమిటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం.. నిలిచిపోయిన కేంద్ర నిధులు
దేశ వ్యాప్తంగా ఉన్న బోధనాస్పత్రుల్లో పోస్టుగ్రాడ్యుయేషన్ విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం నిధులు కేటాయించింది. వాటికి మ్యాచింగ్ గ్రాంటు కిందట 25 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించాల్సి ఉంటుంది. మూడేళ్ల క్రితం సిద్ధార్థ వైద్య కళాశాలకు కేంద్రప్రభుత్వం రూ.30 కోట్లు కేటాయించింది. ఇందులో తొలివిడతగా రూ.11 కోట్లు మంజూరవగా, వివిధ పరికరాల కొనుగోళ్లు, నిర్మాణపనులకు వెచ్చించారు.
మ్యాచింగ్ గ్రాంటు కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.4 కోట్లు మంజూరు చేయక పోవడంతో, కేంద్రం రెండో విడత విడుదల చేయాల్సిన గ్రాంటు రూ.11కోట్లు నిలిచిపోయాయని, దీంతో అభివృద్ధి పనులు ఆగిపోయాయని అధికారులు చెబుతున్నారు. సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ఉంటే ఇటువంటి పరిస్థితి తలెత్తేది కాదనేది వారి వాదన . తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికే పూర్తి స్థాయిలో నిధులు సద్వినియోగం చేసుకుంటే మన రాష్ట్రంలో మాత్రం అందుకు భిన్నంగా ఉందని అధికారులు వాపోతున్నారు.
వైద్య కళాశాలకు ఎంసీఐ ఫీవర్ !
Published Thu, Mar 6 2014 12:43 AM | Last Updated on Tue, Oct 9 2018 7:39 PM
Advertisement