ఈ రోజు చాలా ఆనందాన్ని ఇచ్చిన రోజు. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చరిత్రలో గొప్పగా చెప్పుకోదగ్గ రోజు. ఎందుకంటే.. 1,088 కొత్త అంబులెన్స్‌లను ప్రారంభించాము. అవి రోడ్డుపై పోతూ ఉంటే.. మనస్సుకు ఎంతో ఆనందం కలిగింది.
విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి వివిధ జిల్లాలకు ప్రయాణమైపోతున్న వాహనాలను చూసి ఎంతో సంతోషం కలిగింది. ఇది ఒక రికార్డు. ఇన్ని అధునాతన అంబులెన్స్‌లను ఒకేరోజు ప్రారంభించడం, జిల్లాలకు పంపించడం అనేది చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోయే ఘట్టం.
– సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: అది విజయవాడ నడిబొడ్డున ఉన్న బెంజ్ సర్కిల్.. బుధవారం ఉదయం సరిగ్గా 9 గంటలా 25 నిమిషాలు.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిరునవ్వుతో కాన్వాయ్‌లో నుంచి కిందకు దిగారు.. అప్పటికే బారులు తీరి సేవల రంగంలోకి ఉరికేందుకు 108, 104 వాహనాలు కనుచూపు మేర సిద్ధంగా ఉన్నాయి.. సీఎం వైఎస్ జగన్ జెండా ఊపగానే ఒక్కసారిగా కుయ్.. కుయ్.. కుయ్.. అంటూ పరుగులు తీశాయి. కనీ వినీ ఎరుగుని రీతిలో వాహన శ్రేణి ఒక్కసారిగా చూడముచ్చటగా ముందుకు సాగిపోతుంటే కార్యక్రమానికి హాజరైన ప్రజలు, అధికారులు కళ్లార్పకుండా చూస్తూనే ఉన్నారు.
ప్రాంగణాన్ని దాటుకుని వెళుతున్న ప్రతి వాహనానికి రెండు చేతులూ జోడించి ముఖ్యమంత్రి నమస్కరిస్తుండగా, అంబులెన్స్ డ్రైవర్లు ప్రతి నమస్కారం చేస్తూ వెళ్లారు. సుమారు 20 నిమిషాల పాటు వాహన శ్రేణి కదులుతూన్నంత సేపూ వేదిక మీద నిల్చొని ముఖ్యమంత్రి అభివాదం చేసిన దృశ్యం అంబులెన్స్ సిబ్బందికే కాదు.. రాష్ట్ర ప్రజలందరినీ ముగ్ధుల్ని చేసింది. ఈ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపించింది. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి అంబులెన్స్‌ల వ్యవస్థపై చూపిన శ్రద్ధ ఇప్పుడు ఆయన తనయుడిగా సీఎం వైఎస్ జగన్ చూపిస్తున్నారని అక్కడున్న పలువురు చర్చించుకోవడం కనిపించింది. మంత్రులు ఆళ్లనాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మోపిదేవి వెంకటరమణ, మరికొంత మంది ఎమ్మెల్యేలు, అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
బారులు తీరిన అంబులెన్స్‌లు
► రెండు మాసాలుగా విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఆయా వాహనాలన్నీ ఆధునిక వైద్య పరికరాలను సమకూర్చుకున్నాయి. బుధవారం ఉదయం ఆర్టీసీ బస్టాండ్ వైపు నుంచి బెంజి సర్కిల్ వరకు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరి ఉన్నాయి. ముఖ్యమంత్రి జెండా ఊపి వాహనాలను ప్రారంభించగానే 412 కొత్త 108 వాహనాలు, 676 కొత్త 104 వాహనాలు సైరన్ మోగిస్తూ.. కేటాయించిన జిల్లాలకు బయలుదేరాయి.
► సీఎం ప్రతి ఒక్క వాహన చోదకుడికీ అభివాదం చేశారు. దీంతో డ్రైవర్లు, టెక్నీషియన్ల ముఖంలో ఆనందం కనిపించింది.
► బెంజి సర్కిల్ నుంచి కొన్ని వాహనాలు రామవరప్పాడు వైపు, మరికొన్ని వారధి వైపు వెళ్లాయి. రూ.203 కోట్లు వ్యయం చేసి ఇంత పెద్ద స్థాయిలో వాహనాలు కొనుగోలు చేయడం కూడా ఇదే మొదటిసారి. ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు అని అక్కడకు వచ్చిన వారు చర్చించుకున్నారు.
డీజిల్ లేదు.. టైర్లు పోయాయన్న మాటే లేకుండా..
► గతంలో డీజిల్ లేక, టైర్లు దెబ్బతిని అంబులెన్స్‌లు ఆగిపోయిన సందర్భాలు కోకొల్లలు. అది గతం. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త వాహనాలను ఏర్పాటు చేసింది.
► మండలానికి కేటాయించిన అంబులెన్స్‌ను ఈఆర్‌సీ (ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్)కు అనుసంధానించింది. ఫోన్ చేయగానే 15 నిమిషాల్లో ఘటనా స్థలికి వచ్చేలా ఏర్పాట్లు చేసింది. ఇందులో చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన నియోనేటల్ అంబులెన్స్‌లు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.
సమూల మార్పులతో 104 వాహనాలు
► 2007లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కొన్న 104 వాహనాలే మొన్నటి వరకూ ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వమూ కొత్తవి కొనలేదు. మెజారిటీ వాహనాలు షెడ్లకే పరిమితమయ్యాయి.
► అందుకే ఒక్కటంటే ఒక్క పాత వాహనాన్ని తీసుకోకుండా మండలానికి ఒకటి లెక్కన 676 వాహనాలూ కొత్తగా కొన్నారు.
► ఈ వాహనాలు ప్రతి పల్లెనూ నెలలో ఒకసారి తాకి రావాల్సిందే. ఆ ఊళ్లో ఉన్న ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిందే. గతంలో 52 రకాల మందులు.. ఇప్పుడు 74 రకాల మందులు. రక్త పరీక్షలు అక్కడికక్కడే చేస్తారు.
► ప్రతి వాహనమూ ప్రాథమిక కేంద్రానికి అనుసంధానమై ఉంటుంది. రోగుల వివరాలతో పాటు సమస్త సమాచారాన్ని క్యూఆర్ కోడ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ కార్డులో నిక్షిప్తం చేస్తారు. దీంతో జబ్బుల ఉనికిని త్వరగా కనుక్కుని ముందస్తు చర్యలు తీసుకునే వీలుంటుంది.
► వైద్య సేవలే కాకుండా మాతా శిశు మరణాలు అరికట్టడం, చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడటం, పౌష్టికాహార లోపం ఉన్న చిన్నారులను గుర్తించి వారికి సేవలు అందించడం, సీజన్‌ను బట్టి అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవడం వంటివన్నీ ఇకపై 104 వాహనాల ద్వారానే చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment